Rohit Sharma- Dasun Shanaka: ఆటలో ఆడడంతోపాటు క్రీడాస్ఫూర్తి చాలా ముఖ్యం గెలుపోటములు ఎలా ఉన్నా.. ఆటను ఆటలా, ఇతరులకు స్ఫూర్తిగా ఉండేలా ఆడడం చాలా గొప్పవిషయం. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పుడు ఇదే పనిచేశాడు. హిట్‌మ్యాన్ చేసిన పనికి అందరూ ఫిదా అవుతున్నారు. లంక కెప్టెన్‌ను ఔట్ కాకుండా కాపాడాడు.. మహ్మద్ షమీపై విమర్శల రాకుండా చేశాడు.

బ్యాటింగ్‌లో దుమ్మురేపిన టీం ఇండియా..
అసోంలోని గుహవటి వేదికగా శ్రీలంకతో జరిగిన ఫస్ట్ వన్డేలో టీమిండియా దుమ్మురేపింది. 374 పరుగుల భారీ టార్గెట్‌ను శ్రీలంక ముందు ఉంచింది. లక్ష్య చేదనకు బరిలోకి దిగిన లంక నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 306 పరుగులు చేసింది. లంక కెప్టెన్ దసున్ షనక( 88 బంతుల్లో 108 పరుగులు నాటౌట్(12 ఫోర్లు, 3 సిక్సర్లు) సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. పాతుమ్ నిస్సాంక(80 బంతుల్లో 72 పరుగులు ; 11 ఫోర్లు), ధనంజయ డి సిల్వ (40 బంతుల్లో 47 పరుగులు ; 9 ఫోర్లు) సత్తా చాటారు. మిగతా బ్యాటర్లు సత్తా చాటకపోవడంతో లంకకు ఓటమి తప్పలేదు. టీమిండియా బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్ మూడు వికెట్లతో సత్తా చాటాడు. సిరాజ్ రెండు వికెట్లు తీశాడు. షమీ, హార్దిక్, చాహల్‌కి తలా ఓ వికెట్ దక్కింది.
మ్యాచ్ చివరిలో హైడ్రామా..
అయితే.. ఈ మ్యాచ్ ఆఖరి ఓవర్‌లో హై డ్రామా నడిచింది. శ్రీలంక ఇన్నింగ్స్ చివరి ఓవర్‌ను మహమ్మద్ షమీ వేయగా.. తొలి మూడు బంతులను ఆడిన షనక 2, 0, 1తో మూడు పరుగులు చేశాడు. నాలుగో బంతికి టెయిలెండర్ కసున్ రజితా స్ట్రైకింగ్ రాగా.. 98 పరుగులతో సెంచరీకి చేరువలో ఉన్న షనక నాన్ స్ట్రైకర్‌లో ఉన్నాడు. సెంచరీ చేసుకోవడంపై ఫోకస్ పెట్టిన షనక.. సింగిల్ తీసివ్వాలని రజితకు సూచించాడు. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ భారత ఫీల్డర్లను మోహరించగా.. షమీ బంతి వేయక ముందే షనక క్రీజు దాటాడు. ఇది గమనించిన షమీ.. మన్కడింగ్ పద్దతిలో రనౌట్ చేసి అప్పీల్ చేశాడు. దీంతో ఫీల్డ్ అంపైర్ థర్డ్ అంపైర్ ను రివ్యూ కోరాడు. అంతలోనే కెప్టెన్ రోహిత్ శర్మ జోక్యం చేసుకోని షమీ చేత అప్పీల్‌ను వెనక్కి తీసుకున్నాడు. దాంతో ఆట కొనసాగగా.. స్ట్రైక్‌లోకి వచ్చిన షనక బౌండరీతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో.. ఇప్పుడు రోహిత్ చేసిన పని వైరల్‌గా మారుతుంది. రోహిత్ శర్మ క్రీడా స్ఫూర్తిపై ఫ్యాన్స్‌తోపాటు మాజీ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. రోహిత్ నువ్వు నిజంగా గ్రేట్ సామీ.. నీ క్రీడా స్పూర్తికి సెల్యూట్ కొట్టాల్సిందే.. అంటూ క్రేజీ కామెంట్లు చేస్తున్నారు.
అందరి మనసు గెలిచి..
షమీ చేత అప్పిల్‌ను వెనక్కు తీసుకునేలా చేసి అందరి మనసులను గెలుచుకున్నాడు హిట్‌మ్యాన్. ఈ ఘటనపై మ్యాచ్ తర్వాత స్పందించిన రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. షమీ ఇలా మన్కడింగ్ చేస్తాడని ఊహించలేదన్నాడు. 98 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్న షనకను ఇలా ఔట్ చేయడం సరికాదని భావించే అప్పీల్‌ను వెనక్కి తీసుకున్నామని హిట్ మ్యాన్ స్పష్టం చేశాడు.

మొత్తానికి రోహిత్ చేసిన పనికి అందరు ఫిదా అవుతున్నారు. ఇలా చేసి.. లంక కెప్టెన్ ఔట్ కాకుండా కాపాడాడు హిట్ మ్యాన్.. మహ్మద్ షమీపై విమర్శల రాకుండా కూడా చేశాడని అందరూ మెచ్చుకుంటున్నారు.