Anam Ramanarayana Reddy: కొందరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు హైకమాండ్ ను భయపెడుతున్నారా? తమకు టిక్కెట్లు రావని బహిరంగంగా ప్రభుత్వంపై కామెంట్స్ చేయడానికి సిద్ధపడుతున్నారా? అటువంటి వారంతా పార్టీపై, అధినేతపై బురద జల్లేందుకు సిద్ధంగా ఉన్నారా? ఆనం రామనారాయణ రెడ్డి బాటలో వీరు నడవనున్నారా? ఇటువంటి వారి జాబితా జగన్ వద్దకు చేరిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఒకరి కాదు ఇద్దరు కాదు.. పెద్ద జాబితా ఉన్నట్టు తెలుస్తోంది. జగన్ ప్రభుత్వంలో తమ చేతిలో పదవి ఉందే తప్ప..పవర్, ఫండ్స్ లేకపోవడంతో చాలామంది ఎమ్మెల్యేలు నిరాశ, నిస్పృహలతో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అది జగన్ కూడా తెలుసు. తొలుత ఎమ్మెల్యేల పై హెచ్చరికలు జారీచేస్తూ వచ్చిన జగన్.. చివరికి కూల్ అయ్యారు. నాతో పాటు మీరందరూ అసెంబ్లీకి మరోసారి రావాలని కోరుకుంటున్నానే తప్ప.. మరో ఉద్దేశ్యం లేదని వారిని చల్లబరిచారు.

అయితే జగన్ కొందరి ఎమ్మెల్యేల వ్యవహార శైలిపై అనుమానంతో ఉన్నారు. జిల్లాలో ఆధిపత్య పోరుతో హైకమాండ్ తమను పట్టించుకోలేదని కొందరు, వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ దక్కదని మరికొందరు పక్కచూపులు చూస్తున్నారు. ఇటువంటి వారు పార్టీపై, ప్రభుత్వంపై, అధినేతపై విమర్శల డోసు పెంచాలని భావిస్తున్నారు. క్రమేపీ పార్టీకి దూరమై గోడదూకాలని చూస్తున్నారు. నిత్యం ఏజెన్సీలు, నిఘా సంస్థలతో సర్వే చేయించే అలవాటున్న జగన్ ఆ ఎమ్మెల్యేల అంతరంగాన్ని తెలుసుకొని గట్టిగానే షాక్ కు గురైనట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఏకపక్ష విజయం సాధిస్తామని ఆయన పార్టీ శ్రేణులకు ధైర్యాన్ని నూరుపోస్తూ వచ్చారు. కానీ క్షేత్రస్థాయిలో ఉన్న సంఖ్యాబలం గణనీయంగా తగ్గిపోతుందని కలవరపడుతున్నారు. ఆ నియోజకవర్గాల్లో నష్ట నివారణకు ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని ఎంపిక చేసే పనిలో పడ్డారు.
ఆనం రామనారాయణ రెడ్డి ఎపిసోడ్ తో వైసీపీ హైకమాండ్ జాగ్రత్త పడినట్టు తెలుస్తోంది. గత ఎన్నికలకు ముందు ఆయన టీడీపీ నుంచి వైసీపీలో చేరారు. వెంకటగిరి నుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మంత్రి పదవిని ఆశించారు. కానీ దక్కలేదు. మలి విడతలో సైతం జగన్ పట్టించుకోలేదు. అప్పటి నుంచి ఆయన బహిరంగంగానే పార్టీపై, ప్రభుత్వంపై అక్కసు వెళ్లగక్కారు. దీంతో మేల్కొన్న హైకమాండ్ ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా అక్కడ ప్రత్యమ్నాయ నాయకత్వాన్ని తెరపైకి తెచ్చింది. ధిక్కార స్వరాలను అణచివేస్తామని హెచ్చరికలు పంపింది. అయినా ప్రతీరోజూ ఎక్కడో ఓ చోట ధిక్కార స్వరాలు వినిపిస్తునే ఉన్నాయి.

ఒక్క ఆనం రామనారాయరెడ్డే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా 14 మంది ఎమ్మెల్యేలు ధిక్కార స్వరం వినిపించేందుకు సిద్ధంగా ఉన్నట్టు హైకమాండ్ కు సమాచారం అందింది. దీంతో ఆ నియోజకవర్గాల్లో దిద్దుబాటు చర్యలకు హైకమాండ్ సిద్ధమైంది. అక్కడ ప్రత్యామ్నాయంగా ఉన్న నాయకులెవరు? అన్నదానిపై దృష్టిపెట్టింది. ప్రధానంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీని వీడడం ఖాయమని.. వారు పార్టీ నుంచి వెళుతూ వెళుతూ విమర్శలకు దిగే అవకాశముందని భావిస్తున్నారు. అందుకు తగ్గ ఎదురుదాడికి సిద్ధంగా ఉండాలని ఐ ప్యాక్ బృందం వైసీపీ హైకమాండ్ కు సూచించినట్టు సమాచారం. సంక్రాంతి తరువాత ఈ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరూ బయట పడే చాన్స్ ఉన్నట్టు వైసీపీలో జోరుగా ప్రచారం సాగుతోంది.