Uttar Pradesh: బలగం సినిమా చూశారా. అందులో మూలగ బొక్క వేయలేదని ఓ ఇంటి అల్లుడు అలుగుతాడు. తన భార్యపై చేయి చేసుకుంటాడు. అలా ఆ ఇంట్లో గొడవ మొదలవుతుంది. తారా స్థాయికి చేరి విభేదాలకు కారణమవుతుంది. ఆ ఇంటి పెద్ద మరణించినప్పటికీ ఆ విభేదాలకు ఫుల్ స్టాప్ పడదు. చివరికి ఒకరికి ఒకరు క్షమాపణలు చెప్పుకోవడంతో కథ సుఖాంతం అవుతుంది.. అలాంటి గొడవలు తెలుగు రాష్ట్రాల్లో సహజం. ఆ మధ్య మంచిర్యాల జిల్లాలో తమ బంధువులకు మటన్ సరిపడినంత స్థాయిలో వేయలేదని పెళ్ళికొడుకు తరఫున వారు గొడవ చేశారు. చివరికి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు. ఆ తర్వాత పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీ పెట్టుకుని వధూవరులు విడిపోయారు.
అయితే అలాంటి గొడవ ఉత్తరప్రదేశ్ లో జరిగింది. కాకపోతే బలగం సినిమాలో మాదిరి మూలుగ బొక్క కోసం కాకుండా భోజనాల సందర్భంగా కుర్చీల కోసం కోసం బంధువులు కొట్టుకున్నారు.. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నో ప్రాంతంలో వివాహ వేడుక జరిగింది. వివాహం చేసేవారు డిన్నర్ మెనూ భారీగా ఏర్పాటు చేశారు. ఆ మెనూలో ఉన్న ఆహార పదార్థాలను ఆరగించడానికి బంధువులు పోటీపడ్డారు. ఈ క్రమంలో భోజనాల దగ్గర రద్దీ ఏర్పడింది. కుర్చీల కోసం కొట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఒకానొక దశలో ఒకరిని ఒకరు నెట్టేసుకున్నారు. కుర్చీల కోసం కొట్లాడుకున్నారు. కొందరైతే ప్లేట్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ సర్కులేట్ అవుతోంది.
ఇదే ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల వేడుకలో రసగుల్లా వడ్డించలేదని కొంతమంది కొట్టుకున్నారు.. పోలీస్ స్టేషన్ దాకా వెళ్లారు. పరస్పరం కేసులు పెట్టుకున్నారు. అప్పట్లో ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. డీఎస్పీ స్థాయి అధికారి ఇరు వర్గాలకు నచ్చచెప్పడంతో వివాదం సద్దుమణిగింది. ఇక అదే ఉత్తర ప్రదేశ్ లోని లక్నో ప్రాంతంలో భోజనాల వద్ద కుర్చీల కోసం బంధువులు కొట్టుకోవడం.. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ సర్క్యూలేట్ కావడంతో నెటిజన్లు స్పందిస్తున్నారు. భోజనాల వద్ద కుర్చీల కోసం కొట్టుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. 200 ఖర్చు చేస్తే బయట హోటల్స్ లో కడుపునిండా రుచికరమైన ఆహారాన్ని ఆరగించవచ్చని హితవు పలుకుతున్నారు. పెళ్లి వేడుక చూడకుండా భోజనాల వద్ద కుర్చీల కోసం ఇలా పోట్లాడుకుంటున్నారంటే వారు మనుషులు కాదు అని సెటైర్లు వేస్తున్నారు.