దేశంలో సామాన్య, మధ్య తరగతి వర్గాల ప్రజలు రైలు ప్రయాణాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారనే సంగతి తెలిసిందే. ముఖ్యంగా పండగ సమయాల్లో సొంతూళ్లకు వెళ్లడానికి రైళ్లపై ఆధారపడతారు. కరోనా, లాక్ డౌన్ వల్ల దేశంలో పరిమిత సంఖ్యలో రైళ్లు తిరుగుతున్నాయి. దీంతో సొంతూళ్లకు ఎలా వెళ్లాలో చాలామందికి అర్థం కావడం లేదు. రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తామని చెప్పినా ప్రజల అవసరాలకు సరిపోయే సంఖ్యలో రైళ్లు అందుబాటులోకి రావడం కష్టమే.
రైల్వే శాఖ పండుగల సందర్భంగా 100కు పైగా రైళ్లను నడపబోతుందని తెలుస్తోంది. అయితే రైల్వే శాఖ తాజాగా ప్రయాణికులకు భారీ ఝలక్ ఇచ్చింది. ప్రత్యేక రైళ్లను నడపడం వల్ల ప్రజలకు ప్రయోజనం చేకూరినప్పటికి ఈ రైళ్లకు సాధారణ రైళ్లతో పోలిస్తే టికెట్ రేట్లు ఎక్కువగా ఉంటాయని తెలుస్తోంది. సాధారణ రైళ్లతో పోలిస్తే 30 శాతం ఎక్కువ ఛార్జీలను రైల్వే శాఖ ప్రత్యేక రైళ్ల ప్రయాణికుల నుంచి వసూలు చేయనుందని సమాచారం.
రైల్వే శాఖ భారీగా డిమాండ్ ఉన్న రూట్లలో మాత్రమే ప్రత్యేక రైళ్లను తిప్పనుంది. మరో రెండు మూడు రోజుల్లో ప్రత్యేక రైళ్లకు సంబంధించిన జాబితా విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం రైల్వే శాఖ రైళ్ల జాబితాను తయారు చేసే పనిలో ఉంది. రైల్వే శాఖ సైతం అధిక మొత్తంలో ప్రయాణికుల నుంచి వసూలు చేస్తుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కరోనా, లాక్ డౌన్ వల్ల రైల్వే శాఖకు సైతం నష్టాలు వస్తున్నాయి. అందువల్లే పండుగ సమయంలో టికెట్ రేట్ల పెంపు ద్వారా ఆదాయం సమకూర్చుకోవాలని కేంద్రం భావిస్తోంది. అయితే కరోనా, లాక్ డౌన్ వల్ల ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రజలకు రైల్వే శాఖ నిర్ణయం వల్ల అదనపు భారం పడుతోంది. మరోవైపు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో కూడా ఛార్జీలు భారీగా పెరగడంతో ప్రయాణికులు బెంబేలెత్తిపోతున్నారు.