Siddharth Anand- Prabhas: దేశం పఠాన్ ఫీవర్ తో ఊగిపోతోంది. షారుక్ ఖాన్ నటించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ వసూళ్ల వరద పారిస్తుంది. హిందీలో పఠాన్ బాహుబలి 2, కెజిఎఫ్ 2 రికార్డ్స్ బద్దలు చేసింది. రోజుకు వంద కోట్ల వసూళ్లతో ట్రేడ్ వర్గాలను విస్మయ పరుస్తుంది. ఇక షారుక్ ఖాన్ హిట్ దాహం తీర్చిన సినిమాగా పఠాన్ ని చెప్పుకోవచ్చు. సక్సెస్ లేక నాలుగేళ్లు సిల్వర్ స్క్రీన్ కి దూరమైన షారుక్ అందుకున్న అరుదైన విజయం ఇది. దీపికా పదుకొనె హీరోయిన్ గా నటించగా జాన్ అబ్రహం విలన్ రోల్ చేశారు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కింది.

ఇక పఠాన్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ పేరు గట్టిగా వినిపిస్తోంది. పఠాన్ సక్సెస్ నేపథ్యంలో ఆయనతో మూవీ చేసేందుకు బడా స్టార్స్, ప్రొడ్యూసర్స్ ఆసక్తి చూపిస్తున్నారు. కాగా సిద్ధార్థ్ ఆనంద్-ప్రభాస్ కాంబినేషన్ లో మూవీ సెట్ అయ్యిందన్న ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కిస్తున్నారు. వందల కోట్ల బడ్జెట్ తో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ప్లాన్ చేస్తున్నారట. మైత్రీ మూవీ మేకర్స్ అధినేతల్లో ఒకరైన నవీన్ యెర్నేని సిద్ధార్థ్ ఆనంద్ ని కలవడం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది.
నవీన్ యెర్నేని పఠాన్ డైరెక్టర్ ని కలిసి అభినందనలు చెప్పారు. అలాగే వీరి మధ్య ప్రభాస్ మూవీపై చర్చలు జరిగాయట. సానుకూలంగా చర్చలు ముగిసిన నేపథ్యంలో సిద్ధార్థ్ ఆనంద్ తో ప్రభాస్ మూవీ దాదాపు సెట్ అయిందంటున్నారు. కాగా ఇదే డైరెక్టర్ తో హ్రితిక్ రోషన్-ప్రభాస్ ల మల్టీస్టారర్ తెరకెక్కనుందంటూ ఒక ప్రచారం జరుగుతుంది. ఈ మల్టీస్టారర్ కి ప్రభాస్ ఓకే చెప్పారని రెమ్యూనరేషన్ గా రూ. 150 కోట్లు డిమాండ్ చేస్తున్నారనే కథనాలు వెలువడుతున్నాయి.

కాగా సిద్ధార్థ్ ఆనంద్ తో ప్రభాస్ మూవీ సెట్ అయినప్పటికీ అది పట్టాలెక్కడానికి చాలా సమయం పడుతుంది. సిద్దార్థ్ ప్రస్తుతం హృతిక్ రోషన్ తో ఫైటర్ టైటిల్ తో ఓ మూవీ చేస్తున్నారు. ఇది షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ప్రభాస్ విషయానికి వస్తే ఒకటికి నాలుగు ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీగా ఉన్నాడు. సలార్, ప్రాజెక్ట్ కే, డీలక్స్ రాజా చిత్రాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ టైటిల్ తో ఓ మూవీ ప్రకటించారు.