Homeఅంతర్జాతీయంPakistan: ప్రజల బాధలు.. సైన్యం దోపిడి..ఇదీ పాకిస్తాన్ కథ

Pakistan: ప్రజల బాధలు.. సైన్యం దోపిడి..ఇదీ పాకిస్తాన్ కథ

Pakistan: ‘ప్రతి దేశానికీ సైన్యం ఉంటుంది, కానీ పాకిస్థాన్‌ సైన్యానికి ఒక దేశం ఉంది‘ అనే సామెత పాకిస్థాన్‌లోని సైనిక ఆధిపత్యాన్ని సూచిస్తుంది. దేశ రాజకీయ, ఆర్థిక వ్యవస్థలపై సైన్యం తన పట్టును బలపరచుకుంది. దశాబ్దాలుగా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పాలన సాగిస్తూ, పాకిస్థాన్‌ను ఆర్థిక సంక్షోభం, పేదరికం, అస్థిరతలోకి నెట్టింది. సైనిక ఉన్నతాధికారులు వ్యాపార సామ్రాజ్యాలను నిర్మించుకుని, దేశ వనరులను దోచుకుంటున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Also Read: పతాకస్థాయి బలూచిస్థాన్‌ స్వాతంత్య్ర ఉద్యమం.. పాక్ కు మూడినట్టే..

పాకిస్థాన్‌ సైన్యం ఫౌజీ ఫౌండేషన్, ఆర్మీ వెల్ఫేర్‌ ట్రస్ట్‌ (AWT), షహీన్‌ ఫౌండేషన్, బహ్రియా ఫౌండేషన్‌ వంటి సంస్థల ద్వారా రియల్‌ ఎస్టేట్, బ్యాంకింగ్, ఎరువులు, సిమెంట్, ఇంధనం, విద్య, రవాణా రంగాల్లో గుత్తాధిపత్యం సాధించింది. ఫౌజీ ఫౌండేషన్‌ 35కు పైగా అనుబంధ సంస్థలను నడుపుతుంది. వీటిలో ఫౌజీ ఫర్టిలైజర్, అస్కారీ బ్యాంక్‌ ప్రముఖమైనవి. AWT ఇన్వెస్ట్‌మెంట్స్, చక్కెర కర్మాగారాలు, వస్త్ర రంగంలో కూడా పెట్టుబడులు ఉన్నాయి. ఈ సంస్థలు పన్ను మినహాయింపులు, ప్రభుత్వ కాంట్రాక్టులతో జవాబుదారీతనం లేకుండా నడుస్తాయి, ఆదాయంలో సింహభాగం ఉన్నతాధికారుల జేబుల్లోకి వెళ్తుంది.

భూమి ఆక్రమణ, రియల్‌ ఎస్టేట్‌
రక్షణ గృహ నిర్మాణ ప్రాధికార సంస్థ (DHA) ద్వారా సైన్యం పాకిస్థాన్‌లో అతిపెద్ద ల్యాండ్‌ డెవలపర్‌గా ఆవిర్భవించింది. లాహోర్, ఇస్లామాబాద్, కరాచీ వంటి నగరాల్లో విలాసవంతమైన గేటెడ్‌ కమ్యూనిటీలను నిర్మిస్తోంది. జాతీయ భద్రత పేరుతో పౌరుల నుంచి నామమాత్ర ధరలకు భూములను బలవంతంగా సేకరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వ్యవసాయ భూములను ఆహార భద్రత పేరుతో కైవసం చేసుకుని, వాణిజ్య లాభాలు ఆర్జిస్తోంది. విశ్లేషకురాలు ఆయేషా సిద్దిఖా ప్రకారం, దేశంలో 12% భూమి సైన్యం నియంత్రణలో ఉంది, దీనిలో ఎక్కువ భాగం సీనియర్‌ అధికారుల కబ్జాలో ఉంది.

ఆర్థిక సంక్షోభం..
పాకిస్థాన్‌ ఆర్థిక వ్యవస్థ దివాళా అంచున ఉంది. విదేశీ అప్పు 126 బిలియన్‌ డాలర్లు దాటింది. బడ్జెట్‌లో 40% అప్పుల చెల్లింపుకే సరిపోతోంది. దేశ జనాభాలో 40% దారిద్య్ర రేఖ కింద ఉన్నారు. బలూచిస్థాన్‌లో పేదరికం 70%కి చేరుకుంది. ఆర్థిక వృద్ధి రేటు 2.4%కి పరిమితమై, విదేశీ మారక నిల్వలు క్షీణించాయి. ఆకలి సూచీలో పాకిస్థాన్‌ అట్టడుగున ఉంది. అయితే, సైన్యం 20% బడ్జెట్‌ను రక్షణ రంగానికి కేటాయించుకుంటూ, విద్య (2%), ఆరోగ్యం (1.3%) రంగాలను నిర్లక్ష్యం చేస్తోంది. 22.8 మిలియన్‌ పిల్లలు పాఠశాలలకు దూరంగా ఉన్నారు.

మాదకద్రవ్యాలు, ఉగ్రవాద లింకులు
పాకిస్థాన్‌ సైన్యం, దాని గూఢచర్య సంస్థ ISI ద్వారా మాదకద్రవ్యాల వ్యాపారంలో ప్రమాదకర పాత్ర పోషిస్తోంది. సోవియట్‌–అఫ్ఘన్‌ యుద్ధం నాటి నుంచి హెరాయిన్‌ ఉత్పత్తి, స్మగ్లింగ్‌లో ఐఎస్‌ఐ హస్తం ఉంది. అఫ్ఘనిస్థాన్‌ నుంచి బలూచిస్థాన్, ఖైబర్‌ పఖ్తూన్‌ఖ్వా ద్వారా మాదకద్రవ్యాలను తరలిస్తారు. హక్కానీ నెట్వర్క్, లష్కరే తోయిబా, జైషే మహమ్మద్‌ వంటి ఉగ్రవాద సంస్థలకు హవాలా ద్వారా నిధులు అందిస్తారు. పండోరా పేపర్స్‌లో మాజీ ఐఎస్‌ఐ చీఫ్‌ జావెద్‌ నసీర్‌ వంటి సైనికాధికారుల పేర్లు బ్లాక్‌ మనీ వ్యవహారాల్లో వెలుగులోకి వచ్చాయి.

రాజకీయ పెత్తనం
సైన్యం రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తుంది, ప్రజాస్వామ్యం నామమాత్రంగా మిగిలింది. నచ్చిన రాజకీయ పార్టీలకు నిధులు అందిస్తూ, వ్యతిరేక పార్టీలను అణచివేస్తుంది. మాజీ జనరల్‌ కామర్‌ జావెద్‌ బజ్వా, ఆసిమ్‌ సలీమ్‌ బజ్వా వంటి అధికారులు తక్కువ కాలంలో కోటీశ్వరులుగా మారినట్లు ఆరోపణలు ఉన్నాయి. సైనిక ఆస్తులు 2011–2015 మధ్య 78% పెరిగాయి, ఇవి ఎక్కువగా ఉన్నతాధికారుల కబ్జాలో ఉన్నాయి.

పాకిస్థాన్‌ సైన్యం ఒక రక్షణ శక్తి కంటే కార్పొరేట్, రాజకీయ సామ్రాజ్యంగా రూపాంతరం చెందింది. దేశ వనరుల దోపిడీ, మాదకద్రవ్యాల వ్యాపారం, ఉగ్రవాద నిధులతో దేశాన్ని సంక్షోభంలోకి నెట్టింది. సామాన్య ప్రజలు పేదరికంలో మగ్గుతుండగా, సైనికాధికారులు విలాసవంతమైన జీవనం సాగిస్తున్నారు. ఈ సమస్యకు పరిష్కారం కావాలంటే, సైన్యం రాజకీయ, ఆర్థిక జోక్యాన్ని తగ్గించి, పారదర్శక జవాబుదారీతనం అవసరమని విశ్లేషకులు సూచిస్తున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version