Homeట్రెండింగ్ న్యూస్Ottakomban Elephant: దాని పేరు తుంటరి "అరికొంబన్".. ఏనుగుల్లో పోకిరి టైపు..

Ottakomban Elephant: దాని పేరు తుంటరి “అరికొంబన్”.. ఏనుగుల్లో పోకిరి టైపు..

Ottakomban Elephant: ఏనుగు.. ప్రశాంతతకు మారుపేరైన జంతువు. ఎవరి జోలికీ వెళ్లదు. తన మానాన తాను అడవిలో ఆకులు, అలమలు తింటూ బతికేస్తుంది. దీని కొమ్ములకు మంచి డిమాండ్ ఉండటంతో మనుషులు హత మారుస్తూ ఉంటారు. అసాధారణ సందర్భాల్లో తప్ప పులులు కూడా దీనిని వేటాడవు. అలాంటి ఏనుగుకు తిక్క రేగితే తుక్కు రేగ్కొడుతుంది. అంతేకాదు దొరికిన వాటిని దొరికినట్టే నాశనం చేస్తుంది. అడ్డుగా మనుషులు వస్తే తొక్కి పారేస్తుంది. మనకు మొన్నటిదాకా “విస్పర్స్ ఏనుగు” మాత్రమే తెలుసు. ఎందుకంటే అది ఆస్కార్ గెలుచుకొచ్చింది కాబట్టి. కానీ ఇప్పుడు మీరు చదవబోయే ఏనుగు పోకిరి టైపు. అది ఎలాంటి పనులు చేసిందో, కేరళ ప్రభుత్వాన్ని ఎలా ముప్పు తిప్పలు పెట్టిందో మీరూ చదివేయండి.

దాని పేరు అరి కొంబన్

గాడ్స్ ఓన్ కంట్రీ కేరళలో ఏనుగులు చాలా ఎక్కువ ఉంటాయి. పూర్తి అటవీ ప్రాంతం కావడంతో అక్కడ ఏనుగులు తిరిగేందుకు మంచి మంచి ఆవాసాలు ఉంటాయి. కేరళలో ఆలయాలు కూడా ఎక్కువే కాబట్టి దేవతామూర్తులను ఊరేగించేందుకు ఏనుగులను అంబారీలుగా వాడుతూ ఉంటారు. ఇదంతా మనకు తెలిసిన కోణమే. కానీ రెండో కోణం చూపించింది అరి కొంబన్. ఇది అలాంటి ఇలాంటి ఏనుగు కాదు. కేరళ రాష్ట్రాన్ని వణికించింది. రేషన్ దుకాణాల్లోకి, ఇళ్లల్లోకి చొరబడి బియ్యాన్ని బొక్కేసింది. దీని ఆగడాలు శృతిమించుకోవడంతో కేరళ అటవీ అధికారులు ఎట్టకేలకు పట్టుకొని మరోచోటుకు తీసుకెళ్లి వదిలేశారు. ప్రస్తుతం అది ఆరోగ్యంగా ఉందని కేరళ అటవీ అధికారులు చెబుతున్నారు. దాని మెడకు బిగించిన రేడియో కాలర్ ద్వారా టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో ఎక్కడ ఉన్నదీ ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నామని అటవీ అధికారులు చెబుతున్నారు. కేరళ రాష్ట్రంలో ఇడుక్కి ప్రాంతాన్ని రచ్చ రచ్చ చేసిన అరి కొంబన్ గురించి చెప్పమంటే ఆ ప్రాంతవాసులు కథలుగా చెబుతుంటారు.

అరి కొంబన్ నేపథ్యమిది

ఇడుక్కి జిల్లా చిన్న కనల్, సంతన్ పర కొండ ప్రాంతాల్లోని నివాసాల్లో దాదాపు దశాబ్ద కాలంగా అరి కొంబన్ అనే ఏనుగు అక్కడి ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. కేవలం బియ్యం మాత్రమే స్వాహా చేస్తున్న ఈ గజరాజుకు అరి కొంబన్( అరి అంటే మలయాళం లో బియ్యం, కొంబన్ అంటే ఏనుగు) గా పేరు వచ్చింది. అయితే ఈ ఏనుగును ఏం చేయాలనే అంశం పలు వివాదాలకు దారి తీసింది. ఏకంగా కేరళ రాష్ట్ర శాసనసభలో చర్చ జరిగిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ ఏనుగులు పట్టుకుని శిక్షణ ఏనుగుగా మార్చేందుకు చేసిన ప్రయత్నాలను కేరళ హైకోర్టు అడ్డుకుంది. అయితే హైకోర్టు ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ అరి కొంబన్ ను జనావాసాలకు దూరంగా పరంభికులం టైగర్ రిజర్వులో వదిలివేయాలని సూచించింది. అయితే దీనిపై కూడా నిరసనలు వ్యక్తం అయ్యాయి. చివరికి కేరళ ప్రభుత్వ సూచనతో ఆ ఏనుగును వదిలి వేసే ప్రాంతాన్ని చివరి వరకు రహస్యంగా ఉంచాలని ప్రత్యామ్నాయం ఆచరణలోకి వచ్చింది.

మత్తు సూది ఇచ్చారు

ఇక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం అరి కొంబన్ కు మత్తుమందు ఇచ్చేందుకు అటవీశాఖ అధికారులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అది ఫలితాన్ని ఇవ్వకపోవడంతో అరి కొంబన్ కు పోటీదారుగా ఉన్న మరో ఏనుగును తీసుకొచ్చి, అనేక ప్రయాసలు పడి మత్తు ఇంజక్షన్ ఇచ్చారు. ఆ తర్వాత దట్టమైన అడవి ప్రాంతం లోకి అరి కొంబన్ ను ర్యాంప్ మీదుగా వదిలిపెట్టారు. దీంతో ఇడుక్కి ప్రాంత వాసులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ అరి కొంబన్ మొదట్లో బాగానే ఉండేది. అయితే అటవీ ప్రాంతంలో సంచరించే పర్యాటకులు మొదట దానికి బియ్యాన్ని పెట్టేవారు. వాటికి రుచి మరిగి జనావాసాల్లోకి రావడం ప్రారంభించింది. చివరికి పోకిరి ఏనుగుగా మారిపోయింది. ఇప్పుడు టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో కాలం గడుపుతోంది. అన్నట్టు విస్పర్స్ ఏనుగు మనకు ఆస్కార్ తీసుకొస్తే.. ఈ ఏనుగు ఒక రాష్ట్ర ప్రభుత్వానికి కంటిమీద కునుకు లేకుండా చేసింది. బోత్ ఆర్ నాట్ సేమ్.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular