
MLA Vallabhaneni Vamsi: గన్నవరంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి, విధ్వంసం వెనుక స్థానిక ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ ఉన్నారా? ఆయన డైరెక్షన్ లోనే వైసీపీ శ్రేణులు దాడులకు తెగబడ్డారా? వైసీపీలో అసమ్మతి నాయకుల నుంచి ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయా? అందుకే ఉనికి చాటుకునేందుకు ఈ దాడులకు వ్యూహరచన చేశారా? వచ్చే ఎన్నికల్లో వైసీపీ టిక్కెట్ దక్కించుకునేందుకే ఈ పన్నాగం పన్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. గత రెండు రోజులుగా ఆయన వ్యవహార శైలి, చేస్తున్న కామెంట్స్ అనుమానాలకు నిజం చేకూరుస్తున్నాయి. అయితే ఓ వ్యూహం ప్రకారం చేసిన ఈ విధ్వంసం వెనుక కారణాలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి.
గత ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన వల్లభనేని వంశీ పార్టీ ఫిరాయించారు. వైసీపీకి అనుబంధ సభ్యుడిగా కొనసాగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగాలని భావిస్తున్నారు. కానీ వంశీ రాకను వైసీపీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న రామచంద్రరరావు, యార్లగడ్డ వెంకట్రావు వ్యతిరేకిస్తున్నారు. అటు పార్టీ హైకమాండ్ సైతం ఏ విషయమూ తేల్చడం లేదు. దీంతో వంశీలో అసహనం పెరుగుతోంది. అలాగని టీడీపీలోకి బ్యాక్ స్టెప్ వేయలేని పరిస్థితి. వచ్చే ఎన్నికల్లో వైసీపీ టిక్కెట్ దక్కాలంటే బలమైన ఈష్యూ జరగాలి. అందులో భాగంగానే టీడీపీ కార్యాలయంపై దాడిచేయించినట్టు ఆరోపణలున్నాయి.
గన్నవరంలో తెలుగుదేశం పార్టీపై దాడి చేసినప్పుడు వంశీ స్థానిక పార్టీ కార్యాలయంలోనే ఉన్నారు. ఆయన డైరెక్షన్ తోనే జరిగినట్టు స్పష్టమైన సంకేతాలను ఆయనే ఇచ్చారు. ఘటన తరువాత వంశీ మీడియాతో మాట్లాడిన తరుణంలో ఇంతటితో దాడులు ఆగుతాయా అని ప్రశ్నించిన విలేఖర్లకు వంశీ నర్భగర్భంగా మాట్లాడారు. స్టార్ట్ చేసింది తాను కాదని.. ఎవరో బయట నేతలు రెచ్చగొడితేనే తన అనుచరులు స్పందించారని వెనుకేసుకొచ్చారు. అయితే ఒకప్పుడు తన కారులో వేలాడిన వారు.. కాల్ మనీ కేసులో నిందితులు అక్కడికి రా.. ఇక్కడికి రా అని సవాల్ చేయడంతోనే గొడవ జరిగిందని..తాను ఎక్కడికి వెళ్లానని.. వస్తే మాత్రం గన్నవరంలోనే తేల్చుకుంటానని స్పష్టం చేశారు.

అయితే ఈ వ్యాఖ్యలు చేసింది పట్టాభి. కొద్దిరోజుల కిందట గన్నవరం నుంచి తాను పోటీకి సిద్ధంగా ఉన్నానని ఆయన ప్రకటించారు. డిపాజిట్లు రాకుండా గన్నవరం నుంచి తరిమికొడతానని కూడా సవాల్ చేశారు. దీంతో పట్టాభి దూకుడుకు కళ్లెం వేయడంతో పాటు సొంత పార్టీలోని ప్రత్యర్థులకు హెచ్చరికల సంకేతాలు పంపేలా వంశీయే ఈ ఘటన వెనుక ఉన్నారన్న ఆరోపణలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ ఘటనలో పాల్గొన్న వారు గత రెండు రోజులుగా వంశీ వెంటే నియోజకవర్గంలో తిరుగుతున్నారు. బాధితులైన టీడీపీ నేతలు మాత్రం కటకటాలపాలయ్యారు.