https://oktelugu.com/

World’s First Floating Tunnel :సండే స్పెషల్: సముద్రపు లోతు నుంచి.. భూమి మీదకు: వాహ్వా.. నార్వే నువ్వు సూపర్ హే

సముద్ర అంతర్భాగంలో తేలియాడే సొరంగాన్ని నిర్మించి, అందులో రోడ్ల ఏర్పాటుకు నడుం బిగించాడు. ప్రపంచ వ్యాప్తంగా దీనిని మొదటిసారిగా నార్వే నిర్మిస్తోంది.

Written By:
  • Rocky
  • , Updated On : June 18, 2023 / 10:26 AM IST
    Follow us on

    World’s First Floating Tunnel : సైకిల్ కనిపెట్టామని సైలెంట్ గా ఉంటే స్కూటర్ వచ్చేదా.. స్కూటర్ తో ఆగిపోతే బైక్ మీద ప్రయాణించే వాళ్ళమా? బైక్ వరకు సంతృప్తి పడితే కారులో తిరగ గలిగే వాళ్ళమా? కారు వరకే ఆగిపోతే హెలికాప్టర్ లో చక్కర్లు కొట్టే వాళ్ళమా? హెలికాప్టర్ వరకే సంతృప్తి పడితే విమానంలో విహరించే వాళ్ళమా? ఎన్ని కనిపెట్టినప్పటికీ.. మానవుడిలో ఇంకా ఏదో సాధించాలన్న తపన.. ప్రకృతిని జయించాలనే కోరిక.. అదే ఇప్పుడు కొత్త అడుగులు వేయిస్తోంది. నేలపై రివ్వున దూసుకెళ్లే వాహనాలు, ఆకాశంలో పక్షుల్లాగా విహరించే విహంగాలు.. అతడికి సంతృప్తిని ఇవ్వడం లేదు. నేల, ఆకాశం మాత్రమే ఎందుకు? సముద్రంలో కూడా సరదాగా దూసుకుపోతే ఎలా ఉంటుంది? ఇలా వచ్చిన ఆలోచన ఇప్పుడు నార్వే దేశాన్ని ప్రపంచంలోనే ప్రత్యేకంగా నిలబెట్టింది. నిలబెట్టడమే కాదు ఆ వైపుగా దానిని అడుగులు వేయించింది. అవి విజయవంతం కావడంతో, మిగతా దేశాలు నార్వే లాగా నడిచేందుకు సిద్ధమవుతున్నాయి.

    ఏమిటీ ప్రయోగం?
    అత్యధిక సాంకేతికత అభివృద్ధి చెందుతోంది. దానికి అనుగుణంగా అవసరమైన మార్గాలను మనిషి రూపొందించుకుంటున్నాడు. వీటి ద్వారా తన జీవనాన్ని మరింత సులభతరం చేసుకోవాలి అనుకుంటున్నాడు. ఇప్పటికే వాయు, జల, భూ రవాణా మార్గాల ద్వారా గణనీయమైన అభివృద్ధి సాధించిన మనిషి.. ఇదే రంగంలో కొత్త ఆవిష్కరణల వైపు అడుగులు వేస్తున్నాడు. సముద్ర అంతర్భాగంలో తేలియాడే సొరంగాన్ని నిర్మించి, అందులో రోడ్ల ఏర్పాటుకు నడుం బిగించాడు. ప్రపంచ వ్యాప్తంగా దీనిని మొదటిసారిగా నార్వే నిర్మిస్తోంది. సముద్ర అంతర్భాగంలో ఇలా తెలియాడే సొరంగాన్ని నార్వే నిర్మించేందుకు ఓ కారణం ఉంది. సముద్ర తీరంలో ఈ దేశం ముక్కలు ముక్కలుగా ఉంటుంది. దీనివల్ల రవాణాకు సంబంధించి ఆ దేశానికి పలు ఆటంకాలు ఎదురవుతున్నాయి. వీటి నిరోధానికే నూతన సముద్ర అంతర్భాగ రవాణాకు తెర లేపింది. ఈ ప్రకారం సముద్రం అంతర్భాగంలో ఒక భూభాగం నుంచి మరొక భూభాగానికి గొట్టాల్లాంటి నిర్మాణాలను చేపట్టి అందులో రహదారి ఏర్పాటు చేస్తోంది. దీనిని పూర్తిస్థాయిలో తేలియాడే విధంగా నిర్మిస్తోంది.
    100 అడుగుల లోతులో
    తక్కువ సమయంలో, ట్రాఫిక్ సమస్య లేకుండా అనేక భూభాగాలను కలుపుతూ పోయే విధంగా ఈ సముద్ర అంతర్భాగ రహదారిని నిర్మిస్తోంది. సముద్ర ఉపరితలం నుంచి కేవలం 100 అడుగుల లోతులో ఉండేలాగా నిర్మిస్తున్నారు. అంతర్గత నీటి సరఫరాకు, అంతర్గత మురుగునీటి సరఫరాకు ఉపయోగించే పైపుల వంటి ఆకారంలో ఉన్న రెండు నిర్మాణాలను సముద్రంలో ఒకదాని వెంబటి మరొకటి పక్కపక్కనే అమర్చారు. ప్రతి గొట్టంలో కూడా రెండు లైన్ల రహదారి నిర్మిస్తున్నారు. తద్వారా ఓవర్ టేకింగ్, ట్రాఫిక్ నియంత్రణ సులభంగా ఉంటుంది. రెండు గొట్టాలను పక్కపక్కనే ఉండేందుకు నీటి  ఉపరితలం మీద తేలియాడే పదార్థానికి ఇరువైపులా బల్లకట్టు విధానం ఉపయోగించి(రెండింటిని అడ్డుకట్ట ద్వారా అనుసంధానం చేయడం) సముద్రంలోకి కావలసిన ప్రదేశాల మధ్య నిర్మిస్తున్నారు. గొట్టాలను పట్టి ఉంచేందుకు వీటిపైన ఉన్న అడ్డుకట్టలకు మధ్య బోల్ట్ విధానం ద్వారా బిగిస్తున్నారు.”ప్రయాణికులు సముద్ర గర్భంలో ఉన్న ఈ సొరంగ మార్గాల మీదుగా ప్రయాణం చేస్తున్నప్పుడు.. సాధారణ సొరంగాలలో ప్రయాణం చేస్తున్న అనుభూతిని పొందుతారు. నార్వే దేశవ్యాప్తంగా సుమారుగా 1150 సొరంగాలు ఉన్నాయి. అందులో 35 సొరంగాల వరకు నీటిలోనే ఉన్నాయి.” అని ఆ దేశ అధికారులు అంటున్నారు. తేలియాడేలా సొరంగం రోడ్డు మార్గాలను నిర్మించినప్పటికీ దీని ద్వారా కొన్ని నష్టాలు ఉన్నాయి. పెద్దపెద్ద నౌకలు, ఓడలు వంటి వాటికి ఇవి ఇబ్బంది కలిగించే అవకాశాలు ఉన్నాయి. అయితే వీటిని నిర్మించే లోతు ఆధారంగా ఈ సమస్యను పరిష్కరించవచ్చు. ఇక ఈ ప్రాజెక్టుకు 25 బిలియన్ డాలర్ల వరకు నార్వే దేశం ఖర్చు చేయబోతోంది.. మరో 12 సంవత్సరాలలో ఇది పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది.