Pawan Vs YCP : పవన్ విమర్శలపై ఎలా స్పందించాలో వైసీపీ నేతలకు తెలియడం లేదు. వారాహి యాత్రలో పవన్ అధికార పార్టీపై విరుచుకుపడుతున్నారు. పదునైన అస్త్రాలతో దాడిచేస్తున్నారు. అవి డైరెక్ట్ గా అధికార పార్టీ నాయకులకు గుణపంలా గుచ్చుకుంటున్నాయి. వాటి నుంచి బయటపడేందుకు వైసీపీ నేతలు చేయని ప్రయత్నం లేదు. పవన్ కు మించి విమర్శలు చేయాలని ప్రయత్నించి అబాసుపాలవుతున్నారు. తన చెప్పులు పోయాయని పవన్ అనేసరికి పేర్ని నాని మైండ్ బ్లాక్ అయ్యింది. కానీ పేర్ని నాని మీడియా సమావేశంలో తన రెండు చెప్పులు చూపించే వరకూ చాలా మందికి తెలియదు. అది పేర్ని నానిని ఉద్దేశించి పవన్ సెటైర్ వేశారని.. దీంతో నాని తన గోతిని తానే తవ్వుకున్నట్టయ్యింది.
వారాహి యాత్రలో పవన్ ఇలా విమర్శలు చేసింది తరువాయి.. ఒక్కో మంత్రి బయటకు వస్తున్నాడు. తమకిచ్చిన స్క్రిప్ట్ ను చదివి వెళుతున్నారు. ఎప్పుడూ పవన్ వైవాహిక జీవితం, ఓటమి వంటి మాటలతో సరిపెట్టేవారు. ఈసారి మాత్రం జనసేన గుర్తు గాజుగ్లాసుపై పడ్డారు. పవన్ చెప్పులు గుర్తును పెట్టుకోవాలని సూచిస్తున్నారు. పేర్ని నాని, మంత్రులు అప్పలరాజు, దాడిశెట్టి రాజా వంటి వారు ఈ తరహా చీప్ మాటల ప్రస్తావన తీసుకొచ్చారు. పవన్ చేసిన అసలు ఆరోపణలను డైవర్టు చేస్తున్నారు.
ఇటీవల ఎలక్షన్ కమిషన్ రాజకీయ పార్టీ ఫ్రీ సింబల్స్ జాబితాను ప్రకటించింది. అందులో జనసేన గాజు గ్లాసును చేర్చింది. జనసేన పోటీ ఉన్నచోట కచ్చితంగా గాజుగ్లాసునే కేటాయిస్తుంది. పోటీలేని చోట ఇండిపెండెంట్లకు కేటాయించే అవకాశం ఉంది. అది జనసేన అభ్యంతరం పెడితే ఇవ్వకపోవచ్చు కూడా. అయితే అసలు జనసేనకు గాజు గ్లాసు గుర్తే పోయిందంటూ వైసీపీ బ్యాచ్ ప్రచారం చేయడం ప్రారంభించింది. ఇప్పుడు పవన్ విమర్శలకు తట్టుకోలేక.. పిల్లాడి చాక్లెట్ తగువు మాదిరిగా గుర్తు తగదాను తెరపైకి తెచ్చిందన్న మాట.
తమ పార్టీకి గుర్తుతో పనేమిటని ప్రశ్నిస్తున్నారు జన సైనికులు. మా పార్టీ గుర్తు పవన్ కళ్యాణ్ అని చెబుతున్నారు. పవన్ ను చూసి ప్రజలు తమకు ఓట్లు వేస్తారని భావిస్తున్నారు. గుర్తుపోతే తాము బాధపడాలి కానీ.. వైసీపీ మంత్రులు, నేతలు తెగ బాధపడిపోవడం చూసి జాలేస్తోందన్నారు. పవన్ నిందించకపోతే జగన్ అభిమానాన్ని పొందలేమనే ఇటువంటి వ్యాఖ్యలు వేస్తున్నారని సెటైర్లు వేస్తున్నారు. మొత్తానికైతే పవన్ విమర్శలు వైసీపీ నేతలకు చురకత్తుల్లా తగులుతున్నాయి.