Viral News : పడవ అన్నాక చిల్లులు.. సంసారం అన్నాక గొడవలు కామన్.. వెనుకటికి ఓ తెలుగు సినిమాలో ఫేమస్ అయిన ఓ డైలాగు ఇది. ఈ డైలాగ్ లాగే సాగుతోంది ఈ దంపతుల సంసారం. వారిది ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం. వారికి ఇటీవలే వివాహం జరిగింది. వారిది పెద్దలు కుదిరించిన వివాహం. అమ్మాయికి అబ్బాయి, అబ్బాయికి అమ్మాయి నచ్చడంతో పెళ్లి చేయాలని పెద్దలు నిర్ణయించారు. రెండు కుటుంబాలు కూడా ఆర్థికంగా స్థితిమంతమైనవి కావడంతో ఘనంగా జరిపించారు. వచ్చిన బంధువులకు దర్జాగా విందుపెట్టారు. దాదాపు వారం పాటు వివిధ కార్యక్రమాలతో సందడి గా గడిపారు. వధూవరుల మధ్య తొలిరాత్రి కూడా జరిగింది. ఆ తర్వాత వారి సంసారం కొద్ది రోజులపాటు పాలు తేనెలాగా సజావుగా సాగిపోయింది. మొదట్లో ఉన్న మురిపెం తగ్గడం మొదలైంది. ఫలితంగా దంపతుల మధ్య విభేదాలు మొదలయ్యాయి.
పెద్దమనుషులు ఎంట్రీ ఇచ్చినప్పటికీ
చిన్న చిన్న విషయాలకే ఆ దంపతులు తగాదాలు పెట్టుకోవడం మొదలుపెట్టారు.. ఒకరినొకరు తిట్టుకోవడం ప్రారంభించారు. అది కాస్త రచ్చ రచ్చ అయిపోయింది. దీంతో ఎడమొహం పెడ మొహం పెట్టుకున్నారు. కొద్దిరోజులకు ఆ భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది. భర్త కూడా ఏదో పోగొట్టుకున్న వాడిలా జీవించడం మొదలుపెట్టాడు. చివరికి పెద్దమనుషులు రంగ ప్రవేశం చేశారు. ఇద్దరి మధ్య నెలకొన్న పంచాయతీకి పరిష్కార మార్గం చూపించే బాధ్యతను భుజాలకు ఎత్తుకున్నారు. చివరికి ఒకే చోట ఉండేలాగా నిర్ణయించారు.అయితే ఆ పంచాయతీ జరుగుతున్నప్పుడు భార్యాభర్తలిద్దరూ తెరపైకి ఒక వితండవాదాన్ని తీసుకొచ్చారు. ” మా ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయి. కాకపోతే అవి మా వల్ల జరిగినవి కావు. దీని అంతటికి కారణం పంతులు పెట్టిన ముహూర్తమే. అందులో బలం లేదు. అందువల్లే మా ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి. వీటి నివారణకు ఏం చేయాలో మాకు తెలియడం లేదు. ఆ ముహూర్తం లో బలం లేదు కాబట్టి.. పంతులును కచ్చితంగా వివరణ అడగాలి. దానికి తగ్గట్టుగా పరిహారం వసూలు చేయాలని” వారిద్దరు పేర్కొన్నారు. వారు చేసిన వితండవాదానికి వచ్చిన పెద్దమనుషుల ఫ్యూజులు ఎగిరిపోయాయి. దీంతో వారు ఆ దంపతులను ఏగాదిగా చూసి.. వారి దారిన వారు వెళ్ళిపోయారు. ఉత్తరప్రదేశ్లో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా ప్రచారంలో ఉంది. అయితే ఆ తర్వాత ఆ దంపతులు ఆ పంతులు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో బయటకు తెలియ రాలేదు.