Teenmar Mallanna : మీడియా సంస్థ అధినేతగా.. అక్రమాలపై ప్రశ్నించడమే లక్ష్యంగా తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ ముందుకు సాగుతున్నారు. రాజకీయాల్లోకి రాకముందు నుంచే ఆయన తన మీడియా వేదికగా ప్రభుత్వాలను నిలదీశారు. ఆ తరువాత రాజకీయాల్లోకి వచ్చాక కూడా తన నిలదీతలు మాత్రం కొనసాగిస్తూనే ఉన్నారు. గతంలో బీజేపీ చేరిన ఆయన.. గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా విజయం సాధించారు. ఈ క్రమంలో ఈ మధ్య ఆయన తన న్యూస్ అనాలసిస్ ప్రోగ్రాం ద్వారా బీసీల నినాదాన్ని ఎత్తుకున్నారు. బీసీలకు రాజ్యాధికారం కావాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీసీలకు ఏకతాటిపైకి తెచ్చి.. బీసీలంతా ఒక్కటేనని చాటేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా బీసీ నేతలందరినీ ఇప్పటికే ఏకతాటిపైకి తేవడంలో ఆయన సక్సెస్ అయ్యారు. పార్టీలకతీతంగా అందరితో కలిసి బీసీ సమావేశాలు నిర్వహిస్తున్నారు.
ఇదే క్రమంలో తీన్మార్ మల్లన్న సొంత పార్టీ అయిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సైతం నిలదీస్తున్నారు. దాంతో ఆయన స్వపక్షంలో విపక్షంలా తయారయ్యారని అందరి అభిప్రాయం. కేబినెట్‌లోని ఒకరిద్దరి మంత్రులను టార్గెట్ చేసి విమర్శలు సంధిస్తున్నారు. తనకు రెడ్డీలు తనకు ఎవరూ ఓట్లు వేయరని, వారి ఓట్లు కూడా తనకు అవసరం లేదంటూ బాహాటంగానే చెప్పారు. అప్పుడప్పుడు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను సైతం వ్యతిరేకిస్తున్నారు. తాజాగా.. ప్రభుత్వ అధికారిక కార్యక్రమ ఆహ్వాన పత్రికలో తీన్మార్ మల్లన్న పేరు లేకపోవడంపై తన చానెల్‌లో చెప్పుకుంటూ ప్రశ్నించారు. ఇతర పార్టీల ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల పేర్లు ఉన్న పత్రికలో తన పేరు ఎందుకు లేదని అడిగారు. దీనికి కలెక్టర్ సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఇన్విటేషన్‌లో తన పేరు లేదంటే.. ఇక తనను రావొద్దు అన్నట్లేగా అని ప్రశ్నించారు. తాను వస్తే సమస్యలపై నిలదీస్తానన్న భయంతోనే పిలవడం లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే.. దీని వెనుక మరో టాక్ కూడా వినిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద గెలిచి.. ప్రభుత్వాన్ని నిలదీస్తుండడంపై పార్టీ ఓర్చుకోలేకపోతోందని, అందుకే దూరం పెడుతున్నదా అన్న వాదన సైతం నడుస్తోంది.
కులగణన దగ్గర నుంచి ప్రతి విషయంలోనూ మల్లన్న రేవంత్‌ను, కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా రెడ్డి సామాజికవర్గానికి చెందిన నేతలను దూషిస్తున్నారు. తాను బీసీల చాంపియన్ అంటూ సభలు పెడుతూ ఏ జిల్లాకు వెళ్తే అక్కడి జిల్లా నేతలను లక్ష్యంగా చేసుకుంటూ రాజకీయం నడుపుతున్నారు. అంతేకాదు.. తనకు తానుగా తానే కాబోయే ముఖ్యమంత్రిని అంటూ ప్రకటనలు చేస్తున్నారు. ఇక అలాంటప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తనను విజయాలకు పిలిస్తే ఎంత..? పిలవకపోతే ఎంత..? అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. తీన్మార్ మల్లన్న అంటేనే ముందు నుంచి కాంట్రవర్సీలకు కేరాఫ్ అన్నట్లుగా పేరుంది. గత ప్రభుత్వం హయాంలో ఆయన తిట్లకు ఎన్నోసార్లు గత పాలకులు కేసు నమోదు చేసి జైలుకు పంపించారు. తన చానల్ ద్వారా బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు దండుకున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అలా చాలాకాలం పాటు జైలులో ఉన్నారు. బీజేపీలో చేరే ఒప్పందంతో బెయిల్ తెచ్చుకున్నారు. తరువాత ఆ పార్టీలో ఉండలేక కాంగ్రెస్ గూటికి చేరారు. ఇప్పుడు సొంత పార్టీనే టార్గెట్ చేస్తూ ప్రశ్నిస్తున్నారు.