Nambala Keshava Rao: భారీ ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మృతి చెందిన సంగతి తెలిసిందే. సాధారణ సభ్యుడిగా ప్రస్థానాన్ని ప్రారంభించిన కేశవరావు సుదీర్ఘ కాలం వివిధ హోదాల్లో పని చేశారు. మావోయిస్టు అగ్ర నాయకుడిగా ఎదిగారు. సారధ్య బాధ్యతలు తీసుకున్నారు. అయితే దేశవ్యాప్తంగా కీలక ఆపరేషన్లు చేపట్టారు. మావోయిస్టు పార్టీ సెంట్రల్ మిలటరీ కమిషన్ కార్యదర్శి హోదాలో.. చాలా ఆపరేషన్లు చేశారు. ఆయనపై రివార్డులు పెరుగుతూ వచ్చాయి. ఆయన మరణించే నాటికి ఉన్న రివార్డు అక్షరాల రెండు కోట్ల రెండు లక్షల రూపాయలు.
Also Read: భారత్–పాక్ దౌత్య ఉద్రిక్తతలు.. ఢిల్లీలో మరో పాక్ అధికారుల బహిష్కరణ
* ఆ దాడులు వెనుక..
మావోయిస్టులు దేశవ్యాప్తంగా చేపట్టిన ఆపరేషన్ల వెనుక ఉన్నది కేశవరావు. ప్రముఖులపై దాడులతో పాటు భద్రతా దళాలపై సైతం దాడులు చేయించడంలో ఆరితేరిపోయారు కేశవరావు.ఏపీ సీఎం చంద్రబాబు పై నక్సలైట్లు దాడి చేసిన సంగతి తెలిసిందే. 2003 అక్టోబర్ 1న తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్తున్న చంద్రబాబుపై నక్సలైట్లు అలిపిరి వద్ద దాడి చేశారు. క్లైమోర్ మైన్స్ తో చంద్రబాబు కారును పేల్చే ప్రయత్నం చేశారు. కానీ అదృష్టవశాత్తు చంద్రబాబు ఉన్న కారు బుల్లెట్ ప్రూఫ్ కావడంతో ఆయన బతికి బయట పడ్డారు. ఈ ఘటనకు సైతం సూత్రధారి కేశవరావు.
* 2008 జూన్ 28న బలిమెల రిజర్వాయర్ వద్ద మావోయిస్టుల దాడిలో 36 మంది గ్రేహౌండ్స్ కమాండోలు మృతి చెందిన సంగతి తెలిసిందే. కూంబింగ్ ఆపరేషన్స్ చేపట్టి బలిమెల రిజర్వాయర్ మీదుగా లాంచ్ లో తిరుగు ప్రయాణమై వస్తున్న గ్రేహౌండ్స్ కమాండోలపై మావోయిస్టులు దాడి చేశారు. ఈ దాడి వ్యూహరచన, అమలు బాధ్యతలు అన్ని కేశవ రావే చూశారు.
* మావోయిస్టుల చరిత్రలోనే అతిపెద్ద దాడి ఘటన 2010 ఏప్రిల్ లో దంతేవాడ జిల్లాలో జరిగింది. ఏకంగా 76 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు చనిపోయారు. ఇది కూడా కేశవరావు మార్గదర్శకంలోనే జరిగింది.
* 2018 సెప్టెంబర్ లో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ మావోయిస్టులు చేతిలో హతమయ్యారు. ఈ ఘటన వెనుక ఉన్నది కూడా కేశవ రావే.
* చత్తీస్గడ్ లో మావోయిస్టులకు వ్యతిరేకంగా సల్వా జూడుం ఉద్యమం వచ్చిన సంగతి తెలిసిందే. దీని వ్యవస్థాపకుడు, కాంగ్రెస్ నేత మహేంద్ర కర్మను మావోయిస్టులు చంపేశారు. మందు పాతర పేల్చడంతో ఆయనతోపాటు 27 మంది చనిపోయారు. దీనికి కూడా కేశవ రావే వ్యూహకర్త అని చెబుతారు.