Nambala Keshava Rao: ఆయనది శ్రీకాకుళం జిల్లాలోని( Srikakulam district) ఓ కుగ్రామం. కానీ తుపాకీ గొట్టం ద్వారా సమాజంలో మార్పు తెచ్చేందుకు అడవి బాట పట్టాడు. సుదీర్ఘకాలం మావోల ఉద్యమంలో పనిచేసి.. అదే సంస్థకు దళపతిగా మారారు. ఉద్యమంలోనే నేలకొరిగారు మావోయిస్టు అగ్రనేత కేశవరావు అలియాస్ బసవరాజు. భారీ ఎన్కౌంటర్లో పెద్ద ఎత్తున మావోయిస్టులు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆ బృందంలో మావోయిస్టు అగ్రనేత కేశవరావు సైతం ఉన్నారు. దేశంలో మావోయిస్టు ఉద్యమానికి సారథ్యం వహిస్తున్నారు కేశవరావు. ఆయన మరణంతో మావోయిస్టు ఉద్యమ ఉనికికే ప్రమాదం ఏర్పడింది. కేశవరావు మృతితో నక్సలిజం అంతం దిశగా గొప్ప విజయం సాధించామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ట్వీట్ చేశారంటే కేశవరావు స్థాయి ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు.
Also Read: భారత్–పాక్ దౌత్య ఉద్రిక్తతలు.. ఢిల్లీలో మరో పాక్ అధికారుల బహిష్కరణ
* శ్రీకాకుళంలోని ఓ కుగ్రామం..
నంబాల కేశవరావు ది శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం జియన్నపేట( Jiyyannapeta) . 1955లో జన్మించారు కేశవరావు. తండ్రి వాసుదేవరావు సాధారణ ఉపాధ్యాయుడు. తల్లి లక్ష్మీనారాయణమ్మ సాధారణ గృహిణి. ప్రస్తుతం ఇద్దరూ చనిపోయారు. ఆయనకు సోదరుడు తో పాటు ఇద్దరు అక్కచెల్లెళ్లు ఉన్నారు. కేశవరావు ప్రాథమిక విద్య స్వగ్రామంలో పూర్తి చేశారు. నౌపడలో పదో తరగతి వరకు చదువుకున్నారు. టెక్కలి ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ పూర్తి చేశారు. డిగ్రీ లో బిఏ మొదటి సంవత్సరం చదివాక వరంగల్ ఆర్ఇసిలో ఇంజనీరింగ్ సీటు రావడంతో వెళ్లిపోయారు.
* వరంగల్ లో అలా..
కేశవరావు ఆర్ఇసిలో చదివే సమయంలో రాడికల్ స్టూడెంట్స్ యూనియన్( radical Students Union) ఉద్యమం బలంగా నడుస్తోంది. అప్పట్లో ఏబీవీపీల తో రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ కు విభేదాలు ఉండేవి. తీవ్ర ఘర్షణలు జరిగేవి. రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ లో బలంగా పనిచేసేవారు కేశవరావు. ఈ క్రమంలో బీటెక్ విద్యార్థి జాన్ హత్యకు గురయ్యారు. ఈ హత్య కేసులో కేశవరావును పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. 1980లో బెయిల్ పై విడుదలయ్యారు కేశవరావు. అటు తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లారు. వివిధ ప్రజా సంఘాల్లో పనిచేశారు. అక్కడ నుంచి మావోయిస్టు ఉద్యమం వైపు అడుగులు వేశారు. అంచలంచెలుగా ఎదిగి మావోయిస్టు ఉద్యమ అగ్రనేతగా మారారు.
* అంచెలంచెలుగా ఎదుగుతూ..
1983- 85 మధ్య విశాఖ జిల్లా కమిటీ( Visakha district committee ) సభ్యుడుగా ఎంపికయ్యారు కేశవరావు. ఏడాది తిరగకముందే జిల్లా కమిటీ కార్యదర్శి స్థాయికి ఎదిగారు. అప్పటి తూర్పు డివిజన్ అటవీ కమిటీ సభ్యుడుగాను పనిచేశారు. మరో దళానికి కమాండర్ గా ఉన్న శారదను 1990లో వివాహం చేసుకున్నారు. అయితే ఆమె వ్యక్తిగత కారణాలతో 2010లో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఉద్యమంలోకి వెళ్ళాక కేశవరావు గ్రామానికి వచ్చింది ఒకేసారి. అది కూడా తమ్ముడు వివాహం 1993లో జరిగింది. వివాహానికి కేశవరావు తప్పకుండా హాజరవుతారని భావించి పోలీసులు మోహరించారు. కానీ ఆ సమయంలో ఆయన పోలీసుల కళ్ళుగప్పి పశువుల కాపరి రూపంలో వచ్చారు. ఆ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. అటు తరువాత ఇప్పటివరకు కేశవరావు స్వగ్రామానికి వచ్చింది లేదు. అయితే కుమారుడిపై బెంగతో కేశవరావు తండ్రి 1997 జనవరి 23న మృతి చెందారు.