Jana Sena: విశాఖ జిల్లాలో జనసేన పట్టుబిగుస్తోంది. సాగర నగరంలో ప్రబలమైన శక్తిగా మారుతోంది. జిల్లాలో పవన్ ఫాలోయింగ్ అధికం. పైగా కాపులతో పాటు బీసీ వర్గాలు కూడా ఎక్కువగా ఉన్నారు. అందుకే గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ విశాఖ నగరంలోని గాజువాక నియోజకవర్గం నుంచి పోటీచేశారు. కానీ ఓటమిపాలయ్యారు. అయితే గత ఎన్నికల తరువాత మారిన రాజకీయ పరిస్థితులు నేపథ్యంలో జనసేన గ్రాఫ్ భారీగా పెరిగింది. అటు గాజువాకలో సైతం స్థానికులు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నారు. చేజేతులా పవన్ ను దూరం చేసుకున్నామని భావిస్తున్నారు. వైసీపీ జిమ్మిక్కులకు మోసపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోసారి పవన్ గాజువాక నుంచే పోటీచేయాలని కోరుతున్నారు.

గ్రేటర్ విశాఖ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సైతం జనసేన సత్తాచాటింది. ఒంటరిగా బరిలోకి దిగి మూడు స్థానాలు సాధించింది. పదుల సంఖ్యలో డివిజన్లలో రెండో స్థానం నిలిచింది. 98 డివిజన్లు ఉన్న గ్రేటర్ విశాఖలో అధికార వైసీపీ 58 చోట్ల విజయం సాధించింది. టీడీపీ 30 స్థానాలను దక్కించుకోగా.. బీజేపీ, సీపీఐ, సీపీఎం చెరో స్థానాల్లో సరిపెట్టకున్నాయి. మరో నాలుగుచోట్ల ఇండిపెండెంట్ అభ్యర్థులు విజయం సాధించారు. జనసేన నుంచి గెలుపొందిన కార్పొరేటర్లు ప్రజా సమస్యలపై గట్టిగానే పోరాటం చేస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ సభ్యుల కంటే వాయిస్ బాగా వినిపిస్తున్నారు. అటు పవన్ సైతం విశాఖ కేంద్రంగా చేసుకొని ప్రభుత్వ ప్రభుత్వ వ్యతిరేక వైఖరిపై ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ గ్రాఫ్ గణనీయంగా పెరిగింది. దీంతో విశాఖ నగరం నుంచి జనసేనలో చేరికల సంఖ్య భారీగా పెరుగుతోంది.

తాజాగా జీవీఎంసీ 32 వ వార్డు వైసీపీ కార్పొరేటర్ కందుల నాగరాజు జనసేనలో చేరారు. దీంతో గ్రేటర్ విశాఖలో జనసేన బలం నాలుగు స్థానాలకు చేరుకుంది. గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన నాగరాజు వైసీపీ నేత విజయసాయిరెడ్డి ఒత్తిడితో వైసీపీలో చేరారు. కానీ అక్కడ ఇమడలేకపోయారు. నేరుగా తన అనుచరులతో మంగళగిరిలోని కేంద్ర కార్యాలయానికి వెళ్లి పవన్ సమక్షంలో జనసేనలో చేరిపోయారు. దీంతో వైసీపీ వర్గాల్లో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది. నాగరాజు బాటలో మరికొందరు కార్పొరేటర్లు ఉన్నట్టు తెలుస్తోంది. గ్రేటర్ విశాఖ పరిధిలోని అన్ని నియోజకవర్గాల నుంచి జనసేనలో చేరికలు పెరిగే చాన్స్ కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో పవన్ విశాఖ నుంచి బరిలో దిగితే మాత్రం రాజకీయ సమీకరణలు మారిపోయే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. విశాఖపై పవన్ టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారు. బస్సు యాత్ర సమయానికి భారీగా చేరికలు ఉంటాయని సమాచారం.