Savitri- Jamuna: మరో నట శిఖరం నేలకొరిగింది. లెజెండరీ యాక్ట్రెస్ జమున కన్నుమూశారు. దశాబ్దాల పాటు చిత్ర పరిశ్రమకు సేవలు అందించిన జమున మరణం చిత్ర వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని అభిమానులు, ప్రముఖులు కోరుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ సంతాపం తెలియజేస్తున్నారు. 86 ఏళ్ల జమున కొన్నాళ్లుగా వయో సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. శరీరం సహకరించకపోవడంతో ఇంటికే పరిమితం అవుతున్నారు.

నేడు ఉదయం హైదరాబాద్ లోని తన నివాసంలో జమున తుదిశ్వాస విడిచారు. జమున మరణాన్ని కుటుంబ సభ్యులు ధృవీకరించారు. ఆమెకు కొడుకు, కూతురు సంతానంగా ఉన్నారు. సుదీర్థ సినిమా ప్రస్థానంలో జమున చేరుకున్న మజిలీలు ఎన్నో ఉన్నాయి. జమున సావిత్రి సమకాలీనురాలు. సావిత్రి స్టార్ హీరోయిన్ గా ఉన్న రోజుల్లో ఆమె తర్వాత స్థానం జమునదే. ఇద్దరికీ విడదీయరాని అనుబంధం ఉండేది. ఓ ఇంటర్వ్యూలో జమున సావిత్రి బయోపిక్ గా తెరకెక్కిన మహానటి చిత్రంపై అసహనం వ్యక్తం చేశారు.
కారణం మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ సావిత్రి బయోపిక్ కోసం చాలా రీసెర్చ్ చేశారు. సావిత్రి కుటుంబ సభ్యులతో పాటు ఆమెతో పాటు నటించిన ఆ కాలం నటులను కలిసి సమాచారం సేకరించారు. అసలు సావిత్రి జీవితంలో సగభాగంగా మెలిగిన జమునను కలవలేదట. సావిత్రి బయోపిక్ తెరకెక్కిస్తున్నారని కూడా జమునకు తెలియదట. ఆ విషయం ఆమెను బాధకు గురిచేసిందట. ఓ ఇంటర్వ్యూలో జమున ఈ విషయాన్ని వెల్లడించారు.

జమున మాట్లాడుతూ… సావిత్రి నేను అక్క-చెల్లెళ్ళ వలె ఉండేవాళ్ళం. మిస్సమ్మ మూవీలో సిస్టర్స్ గా నటించాము. కలిసి అనేక చిత్రాలు చేశాము. నేను సావిత్రిని అక్క అని పిలిచేదాన్ని. సావిత్రి జీవితంలోని ప్రతి కోణం నాకు తెలుసు. సావిత్రి అన్ని విషయాలు నాతో చెప్పేవారు. ఆమె జీవితం ఏమిటనేదని నాకు తెలిసినంతగా వేరొకరికి తెలియదు. అలాంటి నన్ను సంప్రదించకుండా సావిత్రి బయోపిక్ తీశారు. మహానటి మూవీ నేను చూడలేదు. అయితే చాలా బాగుందని తెలిసి సంతోషించాను, అని జమున తన అభిప్రాయం వెల్లడించారు.