Minister Dharmana Prasadarao: ‘సందర్భావసరములను బట్టి క్షేత్రభీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము ఏ నాడో కులహీనమైనది..కాగా నేడు కులము కులము అన్న వ్యర్థ వాదములెందుకు’.. డీవీఎస్ కర్ణ సినిమాలో దుర్యోధునిడి పాత్రదారి అయిన ఎన్టీఆర్ చెప్పే పవర్ ఫుల్ డైలాగు ఇది. ఏపీలో మీడియాకు అచ్చు గుద్దినట్టు సరిపోతుంది . సందర్భం బట్టి, పార్టీలు ఇచ్చే ప్యాకేజీలు బట్టి తెలుగు మీడియా తన విధానాలను మార్చుకున్న సంగతి అందరికీ విదితమే. నచ్చిన ప్రభుత్వాలు, పార్టీలు ఉంటే ఒకలా… నచ్చకపోతే ప్రజల్లో వ్యతిరేకత వచ్చేలా వండి వార్చే కథనాలు ప్రచురించడం ఎప్పటి నుంచో ఉన్నదే. కానీ అదేదో కొత్తగా వచ్చినట్టు, ఇటీవలే అటువంటి విధానాలకు మీడియా దిగజారినట్టు ప్రబోధిస్తున్నారు ఏపీ సీనియర్ మంత్రి ధర్మాన ప్రసాదరావు. తనపై పనిగట్టుకొని అవినీతి ఆరోపణలు చేస్తున్న మీడియా సంస్థల పేర్లు చెప్పకుండానే తన మనసులోని బాధను వ్యక్తపరిచారు. తనకు, వైసీపీ ప్రభుత్వానికి కొన్ని మీడియా సంస్థలు శత్రువులుగా తేల్చేశారు.

తాను ఒక బాధ్యతాయుతమైన మంత్రినని.. తమ ప్రభుత్వం ప్రజలకు మంచే చేస్తోందని ధర్మాన చెప్పుకొచ్చారు. తన మీద అవినీతిపరుడు అని ముద్ర వేస్తున్న టీవీ చానళ్ల మీద ఆయన మండిపడ్డారు. రెవిన్యూ మంత్రిగా సెంటు భూమి కూడా కేటాయించే అధికారం తనకు ఉండదని ..అలాంటిది తాను భూములు ఎలా దోచుకుంటానో సదరు టీవీ చానళ్ళు చెప్పాలని డిమాండ్ చేశారు. నామీద అనవసరంగా బురద జల్లుతున్నారని.. తాను అవినీతి చేసినట్టు రుజువు చేయగలిగితే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని కూడా సవాల్ విసిరారు. ప్రజల కోసం జగన్ పరితపిస్తుంటే దానిని పక్కనపెట్టి.. సర్కారు అవినీతి చేస్తోందని తప్పుడు రాతలు రాయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
సహజంగా మీడియా సంస్థలు బీట్ రిపోర్టింగ్ కు ప్రాధాన్యమిస్తాయి. పార్టీపరంగా రిపోర్టర్లకు బాధ్యతలు అప్పగిస్తాయి. దానిని కూడా ధర్మాన తప్పుపట్టారు. తామ కోసం పనిగట్టుకొని రిపోర్టర్లను ఏర్పాటుచేస్తున్నారని చెప్పుకొచ్చారు. తమ ప్రసంగాలను ఎడిటింగ్ చేస్తున్నారని.. యధాలాపంగా అన్న మాటలను వక్రీకరిస్తున్నారని చెప్పుకొచ్చారు. ప్రభుత్వానికి కొన్ని మీడియా సంస్థలు శత్రువులుగా మారిపోయాయని.. తాము ప్రత్యర్థి పార్టీలతోనే కాకుండా మీడియా సంస్థలపై ఫైట్ చేయాల్సి వస్తోందని కూడా ఆవేదన వ్యక్తం చేశారు.

వైసీపీ ప్రభుత్వంతో పాటు ఎమ్మెల్యేలపై యాంటీ మీడియా ప్రభావం అధికంగా ఉందని ధర్మాన చెప్పడం చర్చనీయాంశంగా మారింది. అయితే మీడియా వాచ్ అనేది ఎప్పటి నుంచో ఉంది. కానీ ఇప్పుడే వైసీపీ ప్రభుత్వంపై అధికంగా ఉందని చెప్పే ప్రయత్నం చేయడం మాత్రం విమర్శలపాలవుతోంది.మరి ఇన్నాళ్లూ సాక్షి మీడియా చేసిన పని ఏమిటన్నది ఆయన మరిచిపోయినట్టున్నారని విపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి. ఏపీలో ఎల్లో మీడియా, పచ్చ మీడియా, నీలి మీడియా, తటస్థ మీడియా అని రకరకాలుగా డివైడ్ అయ్యింది. కానీ దాని గురించి ప్రస్తావించని ధర్మాన ఇప్పుడు వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక మీడియా గురించి గగ్గోలు పెట్టడం ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత మీడియా పుణ్యమేనని ఆయన గట్టిగా నమ్ముతున్నారు కాబోలు.. సదరు మీడియా సంస్థల పేర్లు ప్రస్తావించకుండా తన ఆవేదనను వెలిబుచ్చారు. ఆ మీడియా వల్లే రాజకీయాలు భ్రష్ణు పట్టాయన్న అర్ధమొచ్చేలా మాట్లాడారు.