Vande Bharat Train: సికింద్రాబాద్, విశాఖపట్నం మధ్య వందే భారత్ రైలు ఈనెల 19న ప్రారంభం కానుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దీన్ని ప్రారంభించనున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా ప్రకటించారు వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి మీదుగా విశాఖపట్నం చేరుకుంటుంది. చెన్నైలోని ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీలో తయారయ్యే వందే భారత్ ఎక్స్ ప్రెస్ గరిష్టంగా 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సామర్థ్యం కలిగి ఉంది. ఇలాంటి రైళ్లు ఇప్పటివరకు నాలుగు నడుస్తున్నాయి. ఐదో రైలు మైసూర్-బెంగుళూరు-చెన్నై మధ్య గత ఏడాది పట్టాలు ఎక్కిన విషయం తెలిసిందే. దక్షిణ భారతదేశంలో ఇదే తొలి రైలు. దేశంలో ఆరో వందే భారత్ రైలు కావడం గమనార్హం.

వందే భారత్ రైలులో 16 కోచ్ లు, 1128 సీట్లు ఉన్నాయి. ఇందులో ఆటోమేటిక్ డోర్లు ఏర్పాటు చేశారు. జీపీఎస్ బేస్డ్ ఆడియో విజువల్ ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అందుబాటులో ఉంది. దీంతో ఎంటర్ టైన్ మెంట్ కోసం హాట్ స్పాట్ ఉపయోగించుకోవచ్చు. ఎగ్జిక్యూటివ్ క్లాస్ బోగీల్లో రొటేటింగ్ చైర్లను అమర్చారు. బయోవ్యాక్యూమ్ టైప్ టాయిలెట్స్ దివ్యాంగులకు అనుకూలంగా వాష్ రూమ్స్ సౌకర్యం కల్పించారు. ప్రయాణికుల భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రతి కోచ్ కు ప్యాంట్రీ సదుపాయం ఉంది. 500 కిలోమీటర్ల నుంచి 600 కిలోమీటర్ల దూరం ప్రయాణించే వందే భారత్ రైళ్లలో స్లీపర్ బెర్తులు అందుబాటులోకి రానున్నాయి.
రెండు నగరాల మధ్య అత్యంత వేగంగా నడిచే రైలు కావడంతో 8-9 గంటల్లోనే చేరుకునే అవకాశం ఉంది. రెండు నగరాల మధ్య ఎన్నో స్టేషన్లున్నా కేవలం తొమ్మిది స్టేషన్లలోనే ఆగనుంది. దీంతో తొందరగా వెళ్లాలనుకునే వారికి వందే భారత్ రైలు సౌకర్యంగా మారనుంది. రెండు రాష్ట్రాల మధ్య రెండు ప్రధాన నగరాలు కావడంతో జనం కూడా ఎక్కువగానే ఉపయోగించుకోనున్నారు. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న కల నెరవేరే సమయం రావడంతో ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది. తక్కువ సమయంలో చేరుకునేందుకు మరో అద్భుత అవకాశంగా భావిస్తున్నారు.

వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రజల సౌకర్యార్థం కేంద్రం ప్రవేశపెట్టింది. దీంతో దీన్ని ప్రజలు వినియోగించుకుని లాభం పొందాలని సూచిస్తున్నారు. త్వరలో హైదరాబాద్ వందే భారత్ రైళ్లకు హబ్ గా మారనుందని కూడా చెబుతున్నారు. ఇటీవల కాలంలో వందే భారత్ రైళ్ల సంఖ్య కూడా పెంచేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇప్పటికే ఇది ఆరో రైలు కావడంతో ఇంకా వీటి సంఖ్య పెంచి ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు ముమ్మర కసరత్తులు చేస్తున్నట్లు చెబుతున్నారు.