
Manchu Manoj- Mounika: ఈ మధ్య కాలంలో మంచు మనోజ్ రెండో వివాహం అతిపెద్ద టాపిక్ అని చెప్పాలి. గత ఏడాది వినాయక చవితి పండుగ సమయంలో మనోజ్ తన ప్రేయసి భూమా మౌనికను పరిచయం చేశారు. అప్పటి నుండి అనేక ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. ఎట్టకేలకు 2023 మార్చి 3న మనోజ్-మౌనిక పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. మౌనికను పెళ్లి చేసుకోవడం మోహన్ బాబుకు ఇష్టం లేదన్న ప్రచారం జరిగింది. ఈ క్రమంలో మౌనికతో మనోజ్ కి బంధం ఎలా కుదిరింది. అది పెళ్ళికి ఎలా దారితీసిందో కొత్త దంపతులు స్వయంగా వెల్లడించారు.
స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ హోస్ట్ గా ఉన్న ‘అలా మొదలైంది’ టాక్ షోలో మనోజ్-మౌనిక పాల్గొన్నారు. ఈ సందర్భంగా మనోజ్ మాట్లాడుతూ… మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్. 15 ఏళ్లకు పైగా ఇరు కుటుంబాల మధ్య రాకపోకలు ఉన్నాయి. మా దారులు వేరు. జీవితంలో ఎదురైన కష్టాలకు నేను కృంగిపోయాను. ఆ సమయంలో మౌనిక కష్టాలు చూసి నావి చాలా చిన్న సమస్యలు అనిపించాయి. అప్పుడే ‘నువ్వంటే ఇష్టం, పెళ్లి చేసుకుందాం’ అని చెప్పాను. సమాజం గురించి ఆలోచించావా? ఇంట్లో ఒప్పుకుంటారా? అని మౌనిక అడిగింది.
నా మాట ఇంట్లో కాదనరు. వాళ్ళను ఒప్పిస్తానని హామీ ఇచ్చాను. అయినా అది నా సమస్య నాకు వదిలేయ్ అన్నాను. శివుడికి వినాయకుడిలా బాబు దొరికాడు. అప్పుడు మా వనవాసం మొదలైంది. ఉప్పెన మూవీలో ‘ఈశ్వరా’ సాంగ్ లో వలె ఊళ్లు పట్టుకుని తిరిగాము. ఈశ్వరా సాంగ్ ఐదు నిమిషాలు మాత్రమే. మేము చాలా కాలం బాధలు అనుభవించాము. అవి చెప్పుకుంటూ పోతే రెండో సీజన్ కూడా మా షోనే నడుస్తుంది. రోజుకో కథ చెప్పగలను. అయితే మాటల్లో చెప్పినంత ఈజీ కాదు. ఎన్ని డోర్లు ముస్తారో మూయండని మొండిగా ముందుకు వెళ్ళాము… అని అన్నాడు.

మనోజ్ మాటలను పరిశీలిస్తే భూమా మౌనికను వివాహం చేసుకోవాలన్న నిర్ణయం ఆయన్ని సమస్యల్లోకి నెట్టింది. కుటుంబ సభ్యుల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. చివరికి ఇద్దరినీ కలుసుకోకుండా కూడా చేసారనిపిస్తుంది. ఎన్ని అడ్డుగోడలు కట్టినా బద్దలు కొట్టుకొని ఒకటైనట్లు పరోక్షంగా చెప్పారు. మౌనికతో వివాహం మోహన్ బాబు, విష్ణులకు ఇష్టం లేదని మొదటి నుండి ప్రచారం జరుగుతుంది. మనోజ్ చెప్పింది కూడా అదే. మోహన్ బాబుకు ఇష్టం లేకపోతే అక్కయ్య మంచు లక్ష్మి మనోజ్ వివాహం తన నివాసంలో చేసింది. చేసేది లేక చివరి నిమిషంలో మోహన్ బాబు పెళ్ళికి హాజరయ్యారు.