
Dogs Scared Leopard : కుక్కలను గ్రామ సింహాలంటారు. వాటిలో కూడా కొన్నిసార్లు ఐక్యత వస్తుంది. కొన్ని సమయాల్లో వాటికి అవే గొడవ పడుతాయి. కానీ ఏదైనా ఇతర జంతువు వస్తే మాత్రం అన్ని మూకుమ్మడిగా దాడికి తెగబడతాయి. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఓ సంఘటన ఆశ్చర్య పరచింది. ఓ చిరుతను కుక్కలు తరమడంతో రక్షణ కోసం చెట్టు ఎక్కడంతో దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
ఉత్తర ప్రదేశ్ లోని పిలిజిత్ టైగర్ రిజర్వ్ లోని పురాన్ పూర్ ప్రాంతంలోని ఓ గ్రామంలో ఓ చిరుతపులి కుక్కలకు భయపడి చెట్టుపైకి ఎక్కింది. చెట్టుపై ఎక్కిన చిరుతపులిని గ్రామస్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. అడవిలో నుంచి వచ్చిన చిరుతపులిని కుక్కలు వెంబడించడంతో అది పరుగు లంకించుకుని బతుకు జీవుడా అని చెట్టు ఎక్కింది.
మొదట ఒకే కుక్క కనిపించడంతో దాన్ని భయపెట్టాలని చూసింది చిరుతపులి. కానీ తొందరలోనే మొత్తం కుక్కల గుంపు చేరడంతో ఆందోళన చెందింది. వాటి నుంచి తప్పించుకునేందుకు చెట్టును ఆశ్రయించింది.దీంతో గ్రామస్తులు చేరి వీడియోలు తీశారు. చిరుతపులిని చూసేందుకు గ్రామస్తులు అధిక సంఖ్యలో గుమిగూడారు. విషయం అటవీశాఖ అధికారులకు తెలిసింది.
క్రూర జంతువులు గ్రామాల బాట పట్టడం కొత్తేమీ కాదు. గతంలో కూడా చాలా సంఘటనలు జరిగాయి. గ్రామసింహాలకు జడిసిన చిరుతపులి ఉదంతం ఇప్పుడు వైరల్ గా మారింది. కుక్కలు చిన్న పిల్లలనే టార్గెట్ చేసుకుని దాడులు చేయడం చూస్తున్నాం. చిరుతను సైతం భయపెట్టి అది చెట్టు ఎక్కేలా చేసిన కుక్కల విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.