Manchu Manoj : నిన్నటి నుండి మీడియా లో మంచు కుటుంబం లో జరుగుతున్న గొడవలు గురించి లైవ్ టెలికాస్ట్ లు వేస్తున్న విషయాన్ని మనమంతా గమనిస్తూనే ఉన్నాం. గత కొంతకాలంగా ఆస్తి విషయంలో మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య చిన్నపాటి మనస్పర్థలు ఎదురైనా సంగతి అందరికీ తెలిసిందే. గోప్యంగా నాలుగు గోడల మధ్య ఉండాల్సిన ఈ వ్యవహారాన్ని మనోజ్ సోషల్ మీడియా ద్వారా కోట్లాది మంది అభిమానుల ముందు పెట్టాడు. అప్పటి నుండి మంచు కుటుంబం లో ఎదో పెద్ద అంతర్యుద్ధమే నడుస్తుందని అందరికీ అర్థమైపోయింది. అయితే ఆస్తి పంపకాల విషయం లో నిన్న మరోసారి మనోజ్ తో చర్చించడానికి మోహన్ బాబు తన ఇంటికి పిలిపించాడని. కానీ ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో గొడవలయ్యాయి అని, మోహన్ బాబు తన మనుషుల చేత నాపైన, నా భార్య పైన దాడి చేయించాడని మనోజ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసాడు.
అయితే నాలుగు గోడల మధ్య ఉండాల్సిన వ్యవహారం బహిర్గతమై కుటుంబ పరువు పోయే పరిస్థితి రావడంతో మీడియా లో ప్రచారమవుతున్న వార్తలు పూర్తిగా అవాస్తవం అని మోహన్ బాబు పీఆర్వో టీం స్పందించింది. కానీ మనోజ్ పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన కంప్లైంట్, చెప్పిన కారణాలతో సహా మీడియా బయటపెట్టడంతో ఇక మళ్ళీ దీనిపై స్పందించలేదు మంచు కుటుంబం. ఇదంతా పక్కన పెడితే మనోజ్ నేడు సాయంత్రం హైదరాబాద్ లోని పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ లో మరోసారి నిన్న జరిగిన ఘటనపై ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. రెండు సార్లు కంప్లైంట్ చేయడానికి గల కారణాలు ఏమిటి?, అసలు ఏమి జరుగుతుంది?, మనోజ్ రెండవ సారి కంప్లైంట్ చేయడానికి వెళ్లాడా?, లేకపోతే ఇచ్చిన కంప్లైంట్ ని వెనక్కి తీసుకోవడానికి వెళ్లాడా అనేది పూర్తిగా తెలియాల్సి ఉంది. మరోపక్క మంచు మోహన్ బాబు తన ఇంటి చుట్టూ 40 మంది బౌన్సర్లను దింపాడు.
మనోజ్ కూడా ఆయనకి పోటీగా 30 మంది బౌన్సర్లను దింపాడు. విష్ణు దుబాయి నుండి వస్తున్నాడని, వీళ్లిద్దరి మధ్య పెద్ద గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయని మీడియా కథనాలు ప్రచారం చేసింది. దీనిపై మంచు విష్ణు టీం స్పందిస్తూ ‘విష్ణు దుబాయి లో లేడు..అమెరికా లో ఉన్నాడు. ఈరోజు ఆయన హైదరాబాద్ కి రావడం లేదు..మీడియా లో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం’ అంటూ చెప్పుకొచ్చారు. ఇంత జరుగుతున్నా కూడా మంచు కుటుంబానికి సంబంధించి ఒక్కరు కూడా మీడియా ముందుకు వచ్చి జరుగుతున్న వ్యవహారం పై మాట్లాడకపోవడం గమనార్హం. ప్రతీ విషయం పై సోషల్ మీడియా ద్వారా స్పందించే మనోజ్ కూడా సైలెంట్ గానే ఉన్నాడు. అంటే వీళ్ళ మధ్య నిజంగానే పెద్ద వ్యవహారమే నడుస్తుంది. ఆ వ్యవహారం ఒక్క రోజులోనే ఇన్ని మలుపులు తిప్పుకుంది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.