
సాధారణంగా మన దగ్గర లేని వస్తువులు మన స్నేహితుల దగ్గర ఉంటే అవసరానికి తగినట్లుగా అడిగి వినియోగించుకుంటూ ఉంటామనే సంగతి తెలిసిందే. బైక్ లేదా కార్ మన అవసరాన్ని బట్టి స్నేహితుల దగ్గర తీసుకుంటూ ఉంటాం. అయితే మన స్నేహితుడు ఇచ్చిన వాహనాన్ని యథావిధిగా ఇస్తే ఎటువంటి సమస్య ఉండదు కానీ అలా చేయకపోతే మాత్రం గొడవలు జరుగుతాయి.
ఒకవేళ స్నేహితుడు ఇచ్చిన వాహనం ఏదైనా ప్రమాదానికి గురైతే బాధ వర్ణానాతీతం. తాజాగా అలాంటి ఘటన ఒకటి స్పెయిన్ లోని హ్యూయెల్వాలో చోటు చేసుకుంది. షికారు కోసం స్నేహితుడి కారును తీసుకున్న ఒక యువకుడు కారును అతివేగంతో తోలాడు. అయితే వేగం ఎక్కువ కావడంతో అదుపు చేయాలని ప్రయత్నించినా సాధ్యం కాలేదు. వేగంగా వెళ్లిన కారు పవర్ కంట్రోల్ రూమ్ ను ఢీ కొట్టింది.
దీంతో కారు నుజ్జునుజ్జయింది. నుజ్జునుజ్జయిన కారు విలువ 2 కోట్ల రూపాయలు కావడం గమనార్హం. అత్యంత ఖరీదైన లంబోర్ఘిని కారును తీసుకున్న స్నేహితుడు యాక్సిడెంట్ అయిన వెంటనే అక్కడినుంచి పరారయ్యాడు. పోలీసులు కారు నంబర్ ఆధారంగా యజమానిని అదుపులోకి తీసుకోగా తనకే పాపం తెలీదని తన స్నేహితుడికి కారు ఇచ్చానని చెప్పాడు. యజమాని కారు ఇచ్చిన స్నేహితుడికి ఫోన్ చేయగా అతను గాయాలపాలై ఆస్పత్రిలో ఉన్నానని చెప్పాడు. పోలీసులు ఆస్పత్రిలో ఉన్న స్నేహితుడిని అదుపులోకి తీసుకున్నారు. కారు ఢీ కొట్టడం వల్ల పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఆగిపోయిందని సమాచారం.