Man Climbs UP Electric Tower : అవసరాలు ఎవరినైనా ఎంతకైనా తెగించేలా చేస్తాయి. తనకు కూడు పెట్టే తోపుడు బండి కోసం ఓ వ్యక్తి తెగించిన తీరు వైరల్ అవుతోంది. ఏకంగా ప్రాణాలు ఫణంగా పెట్టి హైటెన్షన్ కరెంట్ తీగల టవర్ ఎక్కి అందరినీ కంగారు పెట్టాడు. పోలీసులు ఆ వ్యక్తి వీడియోను షేర్ చేయడంతో సోషల్ మీడియాలో ఇప్పుడు చర్చనీయాంశమైంది.

తన తోపుడు బండిని ఎవరో దొంగిలించారని దాన్ని తెచ్చి ఇవ్వాలని ఓ వ్యక్తి విద్యుత్ టవర్ ఎక్కి హల్ చల్ చేశాడు. విద్యుత్ సరఫరా ఉండడం వల్ల అతడిని కిందకి దింపేందుకు పోలీసులు, స్థానికులు నానా ప్రయాసలు పడ్డారు. చివరకు పోలీసులు జోక్యంతో అతడు దిగి రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
హైదరాబాద్ అంబర్ పేటలో ఓ వ్యక్తి హల్ చల్ చేశాడు. తన తోపుడు బండిని ఎవరో దొంగిలించారని ఆరోపిస్తూ స్థానికంగా నివసించే మోహన్ బాబు హైటెన్షన్ టవర్ ఎక్కాడు. స్థానికులు ఎంతగా ప్రాధేయపడ్డా కిందకు దిగలేదు.
సమాచారం అందుకున్న పోలీసులు, కుటుంబ సభ్యులు అతడిని కిందకు దింపేందుకు నానా తంటాలు పడ్డారు. నచ్చజెప్పే ప్రయత్నాలు చేశారు. పోలీసులు కొత్త తోపుడు బండిని ఇప్పిస్తామని చెప్పడంతో అతడు టవర్ దిగాడు. దీంతో అక్కడున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు.