https://oktelugu.com/

Bhopal : టాయిలెట్‌ కోసం వందే భారత్‌ ఎక్కాడు.. తర్వాత రూ.6 వేలు కట్టాడు..! 

అబ్దుల్‌కు అర్జెంట్‌గా మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఫ్లాట్‌ఫామ్‌పై ఉన్న ఇండోర్‌ వెళ్లే వందే భారత్‌ రైలులోని టాయిలెట్‌లోకి వెళ్లాడు. మూత్ర విసర్జన అనంతరం బయటకు రావడంతో.. అప్పటికే రైలు డోర్లు మూసుకుపోయి భోపాల్‌ స్టేషన్‌ నుంచి కదిలింది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : July 21, 2023 7:43 pm
    Follow us on

    Bhopal : ప్రస్తుతం దేశంలో వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ల కాలం నడుస్తోంది. వేగంగా ప్రయాణించగలిగే ప్రత్యేకత కలిగిన ఈ సెమీ హైస్పీడ్‌ రైలుకీ రోజురోజుకీ వీటికి ప్రజాదరణ పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాల మధ్య కూడా ఇప్పటికే రెండు వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్లు నడుస్తున్నాయి. రాళ్లు రువ్వడం, ఆవు, గేదేలు గుద్దుకొని రైలు దెబ్బతినడం వంటి విషయాలతో తరుచూ వందే భారత్‌ రైలు వివాదాల్లో నిలుస్తుంది. తాజాగా కొన్ని మార్పులతో ఆధునిక సౌకర్యాలతో కొత్త రైళ్లను పట్టాలెక్కించేందుకు రైల్వేశాఖ కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ మరోసారి వార్తల్లో నిలిచింది.. మూత్ర విసర్జన కోసం వందే భారత్‌ రైలు ఎక్కిన ఓ వ్యక్తి ఏకంగా రూ.6 వేల మూల్యం చెల్లించుకున్నాడు. మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌ రైల్వే స్టేషన్‌లో ఈ సంఘటన జరిగింది.


    బాధితుడు హైదరాబాద్‌ వాసే.. 
    అబ్దుల్‌ ఖాదిర్‌ అనే వ్యక్తి హైదరాబాద్‌లో నివాసముంటూ డ్రైఫ్రూట్‌ బిజినెస్‌ చేస్తూంటాడు. ఇతనికి హైదరాబాద్‌తోపాటు సొంత ఊరైన మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలీలో షాపులున్నాయి. జూలై 15న తన భార్య, 8 ఏళ్ల కొడుకుతో కలిసి హైదరాబాద్‌ నుంచి భోపాల్‌కు వెళ్లాడు. అక్కడి నుంచి సొంతూరు సింగరౌలీకి రాత్రి 8.20కు రైలు ఎక్కాల్సి ఉంది. దీంతో స్టేషన్‌లోని ఫ్లాట్‌ఫాంపై వేచి ఉన్నారు. అయితే ఆ సమయంలో అబ్దుల్‌కు అర్జెంట్‌గా మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఫ్లాట్‌ఫామ్‌పై ఉన్న ఇండోర్‌ వెళ్లే వందే భారత్‌ రైలులోని టాయిలెట్‌లోకి వెళ్లాడు. మూత్ర విసర్జన అనంతరం బయటకు రావడంతో.. అప్పటికే రైలు డోర్లు మూసుకుపోయి భోపాల్‌ స్టేషన్‌ నుంచి కదిలింది.
    సాయం కోసం సంప్రదిస్తే.. 
    ఆందోళన చెందిన అబ్దుల్, టీసీలు, కోచ్‌ల్లోని పోలీస్‌ సిబ్బందిని సంప్రదించి సాయం కోరాడు. అయితే ట్రైన్‌ డ్రైవర్‌ మాత్రమే డోర్స్‌ తెరిచేందుకు వీలు ఉంటుందని చెప్పడంతో అతడు డ్రైవర్‌ వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించగా వారు అడ్డుకున్నారు. చివరకు టికెట్‌ లేకుండా రైలు ఎక్కినందుకు అబ్దుల్‌ రూ.1,020 జరిమానా చెల్లించాల్సి వచ్చింది. తర్వాత స్టేషన్‌ ఉజ్జయినిలో రైలు ఆగిన తర్వాత దిగి.. భోపాల్‌కు రూ.750 చెల్లించి బస్సులో వెళ్లాడు.
    స్టేషన్‌లోనే ఉండిపోయిన భార్య, కొడుకు..
    మరోవైపు భోపాల్‌ రైల్వే స్టేషన్‌లో వేచి ఉన్న అబ్దుల్‌ భార్య, కుమారుడు సైతం ఈ విషయం తెలుసుకుని ఆందోళన చెంది సొంతూరు సింగ్రౌలీ వెళ్లే రైలు ఎక్కకుండా ఆగిపోయారు. ఈ నేపథ్యంలో వారు బుక్‌ చేసిన రూ.4 వేల విలువైన రిజర్వేషన్‌ టిక్కెట్లు వినియోగించకపోవడంతో వృథా అయ్యాయి.
    మొత్తంగా మూత్ర విసర్జన కోసం వందే భారత్‌ రైలు ఎక్కిన అబ్దుల్‌ ఖాదిర్‌ ఈ విధంగా సుమారు రూ.6 వేలు మూల్యం చెల్లించుకున్నాడు.