Madhya Pradesh High Court: ఇది ఏం కాలం? టెక్నాలజీ కాలం.. అరచేతిలో ప్రపంచం ఇమిడిపోతున్న కాలం. ఈ తరం యువతీయువకులు అందులోనే మునిగి తేలుతుండటంతో వారికి ప్రతీ విషయం మీద అవగాహన సులువుగా కలుగుతోంది. అయితే అపరిమితమైన డాటా, అంతకుమించిన వ్యక్తిగత స్వేచ్ఛ వల్ల వారు మంచి కంటే చెడు వైపే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. తీరా నష్టం జరిగాక అప్పుడు తేరుకుంటున్నారు. అప్పుడు తల్లీదండ్రులు నెత్తినోరు మొత్తుకున్నా ఉపయోగం ఉండటం లేదు. ఇలాంటప్పుడే కోర్టులు జోక్యం చేసుకుంటున్నాయి. చట్టాలు సవరించాలనే అభిప్రాయానికి వస్తున్నాయి. అనేక విభిన్నమైన తీర్పులు ఇస్తున్నాయి.
మనదేశంలో లైంగిక సంబంధమైన కేసులకు సంబంధించి న్యాయస్థానాలు ఒక్కోరకమైన తీర్పు ఇస్తున్నాయి. ఓ కోర్టు వివాహేతర సంబంధం తప్పు కాదంటుంది. మరో న్యాయస్థానం ఇష్టం లేకుండా భార్యతో బలవంతపు సంసారం సాగించడం సరికాదని చెబుతుంది. ఒక మహిళ తన మనసుకు నచ్చిన వారితో గడపొచ్చని, దీనికి ఎవరి అనుమతి అక్కర్లేదని మరో కోర్టు తీర్పు ఇస్తుంది. ఇలాంటి తీర్పుల వల్ల గందరగోళానికి గురయ్యేది సామాన్య మానవులే. ఎందుకంటే పెద్ద పెద్ద సెలబ్రిటీలు చేసినవి ఎలాగూ బయటకు రావు. ఒకవేళ బయటకు వచ్చినా వారిని కాపాడేందుకు అనేక వ్యవస్థలున్నాయి. లైంగికపరమైన కేసుల్లో తీర్పులు ఇచ్చే న్యాయస్థానాలు ఎందుకు అలా వ్యవరిస్తాయనేది ఇప్పటికీ అర్థం కాని విషయం.
తాజాగా ఇలాంటి కేసులోనే మధ్యప్రదేశ్ హైకోర్టు ఓ విభిన్నమైన తీర్పు ఇచ్చింది. ఆ రాష్ట్రానికి చెందిన ఓ యయు(18), యువకుడు(18) ప్రేమించుకున్నారు. తర్వాత ఏకాంతంగా గడిపారు. ఏం జరిగిందో తెలియదు కానీ మనస్పర్థలు తలెత్తాయి. దీంతో ఇద్దరూ విడిగా ఉంటున్నారు. అయితే ఈ విషయం అమ్మాయి తల్లిదండ్రులకు తెలిసింది. ఫలితంగా పోలీస్‌స్టేషన్‌లో ఆ అమ్మాయి ద్వారా ఫిర్యాదు చేయించారు. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడిని కోర్టులో హాజరు పరిచారు. ఈ కేసు విచారణకు రావడంతో మధ్యప్రదేశ్ హైకోర్టు విభిన్నమైన తీర్పు ఇచ్చింది. ‘ ప్రస్తుత సాంకేతిక కాలంలో పిల్లలకు అన్నీ తెలిసిపోతున్నాయి. ఇలాంటి సందర్భంగా లైంగిక సమ్మతి వయసును 18 నుంచి 16 ఏళ్లకు తగ్గించాల్సిన అవసరం ఉందని’ కోర్టు అభిప్రాయపడింది. దీనిని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లింది. అంతే కాదు ఆ యువతి, యువకుడు పరస్పరం ఏకాంతంగా గడిపినప్పుడు అందులో ఆ యువకుడి తపు లేదని కోర్టు అభిప్రాయపడింది. లైంగిక సమ్మతి వయసు 18 ఏళ్లుగా ఉండటం వల్ల చాలా మంది యువకులు కేసుల్లో ఇరుక్కుపోతున్నారని కోర్టు వ్యాఖ్యానించింది.