Madhya Pradesh Father: భారత దేశం అభివృద్ధి చెందుతున్న దేశం.. ప్రపంచంలోని పేద దేశాలకు సాయం చేసే స్థితిలో ఉన్న దేశం. ఇలా సాయం చేసిన సందర్భాలు ఎన్నో. కానీ, దేశంలోని పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఇంట గెలిచి.. రచ్చ గెలవాలన్నది నానుడి. కానీ, మోదీ ప్రభుత్వం బయట శభాష్ అనిపించుకుంటోంది. ఇంటి సమస్యలను మాత్రం గాలికి వదిలేసింది. ఇందుకు మధ్యప్రదేశ్‌లో జరిగిన తాజా ఘటనే నిదర్శనం. వైద్యులు అంబులెన్స్ ఇవ్వడానికి నిరాకరించడంతో కూతరు మృతదేహాన్ని బైక్‌పై 70 కిలోమీటర్లు తీసుకెళ్లిన హృదయ విదారక సంఘటన తాజాగా వెలుగు చూసింది.
సోషల్ మీడియాలో వైరల్..
మధ్యప్రదేశ్‌లోని షాడోల్‌లోని కోట గ్రామానికి చెందిన లక్ష్మణ్ సింగ్ అనారోగ్యంతో బాధపడుతున్న తన కుమార్తె మాధురి(13)ని 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న జిల్లా కేంద్రమైన షాడోల్‌లోని ఆస్పత్రిలో చేర్పించాడు. సోమవారం రాత్రి ఆ బాలిక మరణించింది. దీంతో మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు అంబులెన్స్ ఏర్పాటు చేయాలని కోరగా.. అందుకు ఆస్పత్రి సిబ్బంది నిరాకరించారు. 15 కి.మీల పరిధి దాటితే రావడం కుదరదని చెప్పారు.
స్థోమత లేక.. బైక్‌పై..
అంబులెన్స్ డ్రైవర్ అడిగినత డబ్బులు ఇచ్చే పరిస్థితి లక్ష్మణ్‌సింగ్‌కు లేదు. దీంతో ఇదే అదనుగా భావించిన అంబులెన్స్ డ్రైవర్ నిబంధనల పేరుతో ఇబ్బంది పెట్టాడు. భారీగా డబ్బులు డిమాండ్ చేశాడు. అయితే డబ్బులు చెల్లించే పరిస్థితి లక్ష్మణ్‌సింగ్ దగ్గర లేదు. దీంతో తన కూతురు మృతదేహాన్ని మోటర్‌సైకిల్‌పై తీసుకెళ్లేందుకు ఏర్పాటు చేశారు. తర్వాత ఊరికి బయల్దేరాడు..
కలెక్టర్ చలించి..
అయితే, గ్రామానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉండగా షాడోల్ కలెక్టర్ వందనా వైద్య చూసి.. చలించిపోయారు. ఎక్కడి నుంచి వస్తున్నారు.. ఏమైంది అనే విరాలు తెలుసుకున్నారు. తర్వాత మృతదేహం తరలించేందుకు వాహనాన్ని ఏర్పాటు చేశారు.
విచారణకు ఆదేశం..
మృతదేహాన్ని తరలించేందుకు అంబులెన్స్ ఇవ్వకపోవడంపై ఆ«శ్చర్యపోయారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని, తాజాగా జరిగిన ఘటనతో అయిన వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందిలో మార్పు రావాలని ఆదేశించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. దీంతో ఉద్యోగుల్లోనూ టెన్షన్ నెలకొంది. ఏం జరుగుతుందో చూడాలి.