Homeట్రెండింగ్ న్యూస్Odisha Thief: గీతోపదేశం.. దొంగను మార్చిన భగవద్గీత!

Odisha Thief: గీతోపదేశం.. దొంగను మార్చిన భగవద్గీత!

Odisha Thief: భగవద్గీత.. హిందువుల పవిత్ర గ్రంథం. మహాభారత సంగ్రామం సందర్భంగా దాయాదులతో యుద్ధం చేయలేనని అర్జునుడు అస్త్రసన్యాసం చేసిన సందర్భంగా శ్రీకృష్ణపరమాత్ముడు చేసిన బోధన మతంతో సంబంధం లేకుండా మానసిక ప్రశాంతత, మనిషిలో మార్పును తీసుకురావడానికి తోడ్పడుతుంది. అయితే ఈ గ్రంథాన్ని పవిత్రంగా భావించే హిందువుల్లో చాలా మందికి దానిని చదవివే ఓపిక మాత్రం ఉండడం లేదు. కొంతమంది అది తాము చదివేది కాదని, పండితులు, పూజారులు, అర్చకులు మాత్రమే చదివే గ్రంథమని దూరం పెడుతున్నారు. అదేదో అంటరాని పుస్తకంగా భావిస్తున్నారు. కానీ, ఈ గ్రంథం చదివిన ఓ దొంగ తాను చేసిన తప్పులను దిద్దుకున్నాడు. 9 ఏళ్ల క్రితం దొంగతనం చేసిన సొమ్మును తిరిగి అప్పగించాడు.

గీతా పఠనంతో మార్పు..
పవిత్ర గ్రంథం భగవద్గీత ఒడిశాలోని ఓ దొంగలో మార్పు తీసుకొచ్చింది. దీంతో తొమ్మిదేళ్ల క్రితం ఓ ఆలయంలో చోరీ చేసిన విలువైన నగల్ని అతడు తిరిగి ఇచ్చేశాడు. అంతేకాకుండా తాను చేసిన ఈ పనికి క్షమాపణలు కోరుతూ ఆలయ పూజారికి లేఖ రాసి అక్కడ వదిలి వెళ్లాడు. ఈ ఘటన స్థానికంగా అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. భువనేశ్వర్‌లోని గోపీనాథ్‌పూర్‌ రాధాకృష్ణ ఆలయంలో 2014 మే నెలలో చోరీకి గురైన శ్రీకృష్ణుడి ఆభరణాలు ఓం సంచితోపాటు ప్రత్యక్షమయ్యాయి. దీంతో పాటు క్షమాపణలు కోరుతూ లేఖ, జరిమానా కింద రూ.300 ఆలయ ముఖద్వారం వద్ద లభ్యమయ్యాయి. అయితే, ఇటీవల భగవద్గీత చదివానని.. తన మార్గం తప్పని తెలుసుకొని రూ.లక్షల విలువ చేసే ఆభరణాలను వెనక్కి ఇచ్చేస్తున్నట్టు దొంగ పేర్కొన్నాడు.

తొమ్మిదేళ్ల క్రితం చోరీ..
2014లో యజ్ఞశాలలో ఆభరణాల్ని చోరీ చేసినప్పట్నుంచి తనకు పీడకలలు వస్తున్నాయని.. అనేక సమస్యలు తనను చుట్టుముట్టినట్టు లేఖలో పేర్కొన్నాడు. మరోవైపు, తొమ్మిదేళ్ల క్రితం చోరీకి గురైన ఆభరణాలు తిరిగి దొరకడంతో ఆలయ అధికారులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై ఆలయ పూజారి దేబేష్‌ చంద్ర మహంతి మాట్లాడుతూ.. శ్రీకృష్ణుడి కిరీటం, చెవిపోగులు, కంకణాలు, వేణువు తదితర ఆభరణాలతో బ్యాగును గుర్తు తెలియని వ్యక్తులు ఆలయ ముఖద్వారం వద్ద వదిలి వెళ్లిపోయారని తెలిపారు. అతడు చేసిన పనికి క్షమాపణలు కోరుతూ.. ఆ బ్యాగులో రూ.300 కూడా ఉంచాడన్నారు. చోరీకి గురైన ఆభరణాలు ఇలా మళ్లీ దొరకడం అద్భుతమేనన్నారు. ఆభరణాలు మళ్లీ ఇలా కనిపిస్తాయని తాము అనుకోలేదని చెప్పారు. చోరీ తర్వాత దేవతామూర్తులకు తాము కొత్త ఆభరణాలు చేయించామన్నారు. ఇది దైవ ప్రమేయం వల్లే జరిగిందన్నారు.

భగవద్గీత మనిషిలో మార్పు తెస్తుందనడానికి అనేక ఘటనలు జరిగాయి. కానీ, ఎవరూ ఈ విషయం బయటకు చెప్పరు. తమలోని మార్పును గమనిస్తుంటారు. ప్రవర్తన తీరును మార్చుకుంటుంటారు. కానీ ఇక్కడ దొంగ మాత్రం జీవితంలో మార్పును ఆస్వాదించి గతంలో చేసిన తప్పులను సైతం అంగీకరించాడు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular