Lucknow: ICU లో తండ్రి.. ఆస్పత్రిలో కూతుళ్ళ పెళ్లి..

పెళ్లి అనేది ఎవరి జీవితంలోనైనా ఒక మధురానుభూతి.. అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకోవాలి. బంధువుల సమక్షంలో సందడి చేయాలి. తల్లిదండ్రుల దీవెనలు పొందాలి అని అనుకుంటారు.

Written By: Anabothula Bhaskar, Updated On : June 17, 2024 6:01 pm

Lucknow

Follow us on

Lucknow: తామొకటి తెలిస్తే.. దైవం ఒకటి తలచినట్టు.. అనే సామెత విని ఉంటాం కదా. అది వీరి జీవితంలో నిజమైంది. అయినప్పటికీ వారు తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. తల్లిదండ్రుల సమక్షంలో, బంధువుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకోవాలి అనే వీరి కల నెరవేరలేదు. పెళ్లికి ఏర్పాట్లు ఘనంగానే జరిగినప్పటికీ.. తండ్రి అనుకోకుండా ఆసుపత్రి పాలు కావడంతో వారి ఆశలు అడియాసలయ్యాయి. దీంతో వారు తీసుకున్న నిర్ణయం సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే..

పెళ్లి అనేది ఎవరి జీవితంలోనైనా ఒక మధురానుభూతి.. అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకోవాలి. బంధువుల సమక్షంలో సందడి చేయాలి. తల్లిదండ్రుల దీవెనలు పొందాలి అని అనుకుంటారు. ఈ ఆడపిల్లలు కూడా అలానే అనుకున్నారు. కూతుళ్ళ ఆలోచనలకు తగ్గట్టుగానే వారి తండ్రికి కూడా అలానే ఏర్పాట్లు చేశాడు. వారి చదువు, ఇతర గుణగణాలకు సరిపోయే వ్యక్తులను చూసి పెళ్లి నిశ్చయం చేశాడు. ఫంక్షన్ హాల్ మాట్లాడాడు. బంధువులకు, ఇతర సన్నిహితులకు పెళ్లి కార్డులు పంపిణీ చేశాడు.. ఇక కొద్ది రోజుల్లో పెళ్లి అనగా.. ఆయన ఒక్కసారిగా ఛాతి ఇన్ఫెక్షన్ కు గురయ్యాడు. తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యాడు. ప్రస్తుతం చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. తండ్రి ఆరోగ్య పరిస్థితి చూసి ఆ పిల్లలు గుండెలు అవిసేలాగా రోదిస్తున్నారు. తమ తండ్రి కంటే గొప్పదైవం ఎవరూ లేరని భావించి.. ఆస్పత్రిలో అతడి బెడ్ ఎదుటే.. తమకు కాబోయే వారితో పెళ్లి చేసుకున్నారు. తండ్రి ఆశీస్సులు అందించే స్థాయిలో లేకపోయినప్పటికీ.. ఆయన ఎదుట పెళ్లి చేసుకున్నామనే సంతృప్తిని వారు పొందారు.

ముంబై నగరానికి చెందిన సూఫీ సయ్యద్ అనే వ్యక్తికి ఇద్దరు కూతుర్లు. (వారిద్దరూ కవలలు అని చెబుతుంటారు) ఉన్నత చదువులు చదివారు, అదే స్థాయిలో ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ క్రమంలో వారిద్దరికీ పెళ్లి చేయాలని సయ్యద్ భావించాడు. ఆ ఇద్దరు కూతుర్ల అర్హతలకు తగ్గట్టుగా పెళ్లి సంబంధాలు చూశాడు. వారిద్దరికీ నచ్చడంతో.. ఆ సంబంధాలను ఖాయం చేశాడు. జూన్ 22న పెళ్లి చేసేందుకు ముహూర్తం ఖరారు చేశాడు.. అనుకోకుండా ఛాతీ ఇన్ ఫెక్షన్ కు గురయ్యాడు. ప్రస్తుతం ముంబైలోని డాక్టర్ దర్శా తాంజీలా ఆసుపత్రిలో చేరాడు. అతడి ఆరోగ్యం అత్యంత విషమంగా ఉంది. వెంటిలేటర్ పై ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. తండ్రి పరిస్థితి చూసి చలించిపోయిన ఆ పిల్లలు.. ఆయన ఎదుటే పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. తమకు కాబోయే వారిని ఆసుపత్రికి తీసుకెళ్లి.. తన తండ్రి బెడ్ ఎదుట దండలు మార్చుకున్నారు. ముస్లిం సంప్రదాయాన్ని పాటించి వివాహ క్రతువును పూర్తి చేసుకున్నారు. దీనికి ఆస్పత్రి సిబ్బంది కూడా పూర్తిగా సహకరించారు. ఆస్పత్రి ప్రధాన వైద్యులు దగ్గరుండి మరి ఈ పెళ్లి క్రతువు పూర్తి చేశారు. యుక్త వయసుకు రాగానే తల్లిదండ్రులను కాదనుకొని.. ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకుంటున్న ఉదంతాలు జరుగుతున్న నేటి కాలంలో.. ఈ పిల్లలు చేసిన పని పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. సయ్యద్ త్వరగా అనారోగ్యాన్ని జయించి రావాలని నెటిజన్లు కోరుతున్నారు.