PM Kisan: పీఎం కిసాన్ లింక్ క్లిక్ చేస్తే.. మీ వాట్సాప్ హ్యాక్ అయినట్టే

మూడవసారి బిజెపి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత.. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన పథకానికి సంబంధించిన నిధులను విడుదల చేస్తామని పీఎం నరేంద్ర మోదీ ప్రకటించారు.

Written By: Anabothula Bhaskar, Updated On : June 17, 2024 6:05 pm

PM Kisan

Follow us on

PM Kisan: రోజురోజుకు సైబర్ మోసాలు పెరిగిపోతున్నాయి. సైబర్ నేరగాళ్లు రకరకాల వ్యక్తులతో అమాయకులను మోసం చేస్తున్నారు. ఇప్పటివరకు రకరకాల లింక్ లతో మోసం చేసిన సైబర్ మాయగాళ్లు.. ఇప్పుడు కొత్త ఎత్తులకు పాల్పడుతున్నారు. ఇందుకు ప్రభుత్వ పథకాలనే పావులుగా వాడుకుంటున్నారు. అందులో ప్రమాదకరమైన వైరస్ లేదా ఇతర హ్యాకింగ్ సాఫ్ట్ వేర్ ను జోడించి దర్జాగా మోసం చేస్తున్నారు. అయితే ఇలాంటి మోసమే ఇప్పుడు ఒకటి వెలుగులోకి వచ్చింది. దీంతో సైబర్ పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేస్తున్నారు.

మూడవసారి బిజెపి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత.. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన పథకానికి సంబంధించిన నిధులను విడుదల చేస్తామని పీఎం నరేంద్ర మోదీ ప్రకటించారు. జూన్ 18న దేశవ్యాప్తంగా రైతుల ఖాతాల్లో పెట్టుబడి సహాయం కింద రెండు వేల రూపాయలు జమ చేస్తామని అన్నారు. సరిగ్గా దీనినే తమకు అనుకూలంగా మలుచుకున్నారు సైబర్ మోసగాళ్లు. “పీఎం కిసాన్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫామ్” అనే పేరుతో ఒక ఏపీకే ఫైల్ ను సృష్టించారు. ఇది గత కొద్దిరోజులుగా పలు వాట్సాప్ గ్రూప్ లలో తెగ చక్కర్లు కొడుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సిరికొండ గ్రామానికి చెందిన కొన్ని వాట్సాప్ గ్రూప్ లలో ఈ లింక్ తెగ చక్కర్లు కొట్టింది. దీనిని కొంతమంది క్లిక్ చేయగా వారి వాట్సాప్ హాక్ అయింది. దీంతో వారి ఖాతాలు సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లిపోయాయి. దీంతో వారు లబోదిబో మంటున్నారు. ఈ విషయం స్థానికంగా కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి హ్యాక్ అయిన వారి ఖాతాలను పరిశీలించారు. వారు క్లిక్ చేసిన లింక్ ను చూశారు. హ్యాకర్లు ఏపీకే ఫార్మాట్లో వైరస్ ను ఇన్ బిల్ట్ చేసినట్టు గుర్తించారు. వెంటనే వారి ఖాతాల వివరాలను సెంట్రల్ సైబర్ పోలీసు విభాగానికి బదిలీ చేశారు.

అయితే ఇలాంటి ఏపీకె ఫైల్ ను క్లిక్ చేయడం వల్ల వాట్సప్ హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లిపోతుంది. ఆ తర్వాత వారు నెమ్మదిగా వ్యక్తిగత బ్యాంకు ఖాతాల వివరాలను కూడా తనిఖీ చేస్తారు. అందులో ఏమైనా నగదు ఉంటే.. వారు తమ ఖాతాల్లోకి బదిలీ చేసుకుంటారు. అందువల్ల ఇలాంటి ఫైల్స్ ను ఎట్టి పరిస్థితుల్లో క్లిక్ చేయొద్దని పోలీసులు చెప్తున్నారు. బాధితులు వెంటనే 1930 టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేయాలని సూచిస్తున్నారు.. సైబర్ నేరగాళ్లు ఒక్కసారి వాట్సప్ ను తమ చేతుల్లోకి తీసుకుంటే.. రకరకాల మోసాలకు పాల్పడతారని.. అందువల్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఆ 10 మందికి సంబంధించిన బ్యాంకు ఖాతాల నుంచి నగదు హ్యాకర్ల ఖాతాల్లోకి బదిలీ కాకుండా పోలీసులు నిరోధించినట్టు తెలుస్తోంది.