Bengaluru Airport: ప్రేమకు, గులాబీ పూలకు అవినాభావ సంబంధం ఉంటుంది. ఇష్టపడిన వ్యక్తికి గులాబీ పువ్వు ఇచ్చి మన ప్రేమను వ్యక్తం చేస్తే ఆ కిక్ వేరే లెవెల్ లో ఉంటుంది. సాధారణంగా గులాబీ పూలు చాలా అందంగా ఉంటాయి. మనసుకు నచ్చిన వారికి గులాబీ పూలు ఇచ్చి ఇట్టే ఆకట్టుకోవచ్చు. వారి ప్రేమను పొందొచ్చు. విలువైన బహుమతుల కంటే అందమైన గులాబీ పువ్వు ఇస్తే ఆ ప్రేమ మరింత బలంగా ఉంటుందని ప్రేమికులు నమ్ముతుంటారు. అందుకే ప్రేమికుల దినోత్సవం రోజున గులాబీ పూలు ఇచ్చిపుచ్చుకుంటారు. ఈ ప్రపంచంలో అన్ని ప్రాంతాల్లో గులాబీ మొక్కలు పెరగవు. మరీ ముఖ్యంగా అరుదైన గులాబీలకు కొన్ని నేలలు మాత్రమే అనుకూలం. అలాంటి నేలలు మనదేశంలో బెంగళూరు ప్రాంతంలో విస్తారంగా ఉంటాయి. ఆ నేలల్లో సాగయ్యే అరుదైన గులాబీలు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. అందుకే వాటికి మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఈ ప్రేమికుల దినోత్సవం రోజున బెంగళూరు ప్రాంతం గులాబీ పూల రవాణాతో పండగ చేసుకుంది. ప్రేమికులకు గులాబీలు అందించి సరికొత్త రికార్డు సృష్టించింది.
ప్రేమికుల దినోత్సవం రోజు గులాబీ పూల రవాణాలో బెంగళూరు విమానాశ్రయం సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. ఏకంగా 12,22,860 కిలోల బరువున్న 2.9 కోట్ల గులాబీ పూలను ఎగుమతి చేసింది. బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ గత ఏడాదితో పోలిస్తే ప్రాసెస్ చేసిన గులాబీ పూల రవాణాలో 108 శాతం పెరుగుదలను నమోదు చేసింది. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో గులాబీ పూలను విస్తారంగా సాగు చేస్తారు. దేశంలోనే అరుదైన పూల సాగుకు బెంగళూరు ప్రాంతం పేరు పొందింది.. ఇక్కడ అరుదైన గులాబీ పూలు, మల్లెలు, విరజాజులు, గ్లాడి యోలస్ పూలు సాగవుతాయి. విదేశాలలో బెంగళూరు పువ్వులకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఈ ప్రాంతం నుంచి ఇతర ప్రాంతాలకు గులాబీ పూలు ఎగుమతి అవుతాయి. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా బెంగళూరు ప్రాంతం నుంచి అంతర్జాతీయ మార్కెట్లకు 90 లక్షల పువ్వులను రవాణా చేశారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి 14 శాతం అధికంగా పువ్వులను ఎగుమతి చేశారు. ఇక దేశీయంగా రెండు కోట్ల వరకు పువ్వులు ఎగుమతి చేశారు. ఇది గత ఏడాదితో పోలిస్తే దాదాపు 148 శాతం అధిక పెరుగుదలను నమోదు చేసింది.
బెంగళూరు ప్రాంతం నుంచి గులాబీ పూలు మలేషియాలోని కౌలాలంపూర్, సింగపూర్, కువైట్, మనీలా, షార్జా ప్రాంతాలకు ఎగుమతి అవుతాయి. ఇక దేశీయంగా ఢిల్లీ, కోల్ కతా, ముంబై, గౌహతి, జైపూర్ ప్రాంతాలకు రవాణా అవుతాయి. సాధారణంగా గులాబీ పూలు అత్యంత సుకుమారమైనవి. అవి ఒక నిర్ణీత ఉష్ణోగ్రతలోనే తాజాగా ఉంటాయి. ఈ నేపథ్యంలో బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో రియల్ టైం ట్రాకింగ్ సిస్టంలో ఈ గులాబీ పూలను నిల్వ ఉంచి ఇతర ప్రాంతాలకు విమానాల ద్వారా రవాణా చేశారు. ఏటికేడు ఎగుమతులు పెరుగుతున్న నేపథ్యంలో కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తన శీతల నిల్వ సామర్థ్యాన్ని పెంచుకుంటున్నది. ఈ సంవత్సరం సుమారు 80,000 మెట్రిక్ టన్నుల వస్తువులను నిల్వ ఉంచుకునేందుకు డబ్ల్యూ ఎఫ్ ఎస్ బెంగళూరు ప్రైవేట్ లిమిటెడ్, మెన్జీస్ ఏవియేషన్ అనే సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. గతంతో పోలిస్తే శీతల గిడ్డంగుల సామర్థ్యాన్ని మరింత పెంచుకుంది. దీనివల్ల విలువైన వస్తువులను శీతల ప్రాంతంలో నిల్వ ఉంచి, త్వరగా ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తోంది.. కాగా ప్రేమికుల దినోత్సవం రోజు భారీగా గులాబీ పూలను అంతర్జాతీయంగా, దేశీయంగా రవాణా చేసి బెంగళూరు విమానాశ్రయం సరికొత్త రికార్డు సృష్టించింది.