
Nara Lokesh- NTR: తెలుగుదేశం పార్టీతో జూనియర్ ఎన్టీఆర్ అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇందుకు చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ తో ఉన్న విభేదాలే కారణమన్న కామెంట్స్ ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. అటు ఎన్టీఆర్ సన్నిహితులు పిలుచుకునే వారు సైతం ఎన్టీఆర్ ను కార్నర్ చేసుకొని చంద్రబాబు, లోకేష్ లపై విమర్శలు గుప్పిస్తుంటారు. జూనియర్ ను తొక్కేశారని కూడా ఆరోపణలు చేస్తుంటారు. అందుకే జూనియర్ టీడీపీకి దూరమయ్యారని చెబుతుంటారు. లోకేష్ కోసమే చంద్రబాబు జూనియర్ ను పట్టించుకోవడం మానేశారని.. ఎన్టీఆర్ వస్తే లోకేష్ తెరమరుగవుతారన్నకామెంట్స్ కూడా చేస్తుంటాయి. అయితే ఇప్పుడు అదే లోకేష్ జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని పిలుపునివ్వడం అనూహ్య పరిణామం. పొలిటికల్ గా ఇది చర్చనీయాంశమవుతోంది.
ప్రస్తుతం లోకేష్ యువగళం పాదయాత్ర చిత్తూరులో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో నందమూరి అభిమానుల్లో ఉన్న కుతూహలాన్ని లోకేష్ బయటపెట్టేశారు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. మంచి మనసుతో వస్తే తప్పేంటని ప్రశ్నించారు. లోకేష్ నోట ఆ మాటలు వచ్చేసరికి టీడీపీ శ్రేణులు, నందమూరి అభిమానులు తెగ ఖుషీ అయ్యారు. జూనియర్ కు తానే అడ్డంకిగా నిలుస్తున్నానని వచ్చిన కామెంట్స్ కు చెక్ పడేలా లోకేష్ వ్యాఖ్యానాలు ఉన్నాయి. దీంతో దీనిపై రకరకాల చర్చలు ప్రారంభమయ్యాయి. అనూహ్యంగా లోకేష్ జూనియర్ గురించి మాట్లాడడం మాత్రం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ కుటుంబం చంద్రబాబు కుటుంబానికి దగ్గరైనట్టు వార్తలు వస్తున్నారు. ఇటువంటి తరుణంలో లోకేష్ కామెంట్స్ ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
అయితే లోకేష్ ఒక్క జూనియర్ ఎన్టీఆర్ తో విడిచిపెట్టలేదు. పాదయాత్రలో పవన్ కోసం సైతం ప్రస్తావించారు. ఆయనలో గొప్ప మంచి మనసు ఉందని ఆకాశానికి ఎత్తేశారు. అది 2014 ఎన్నికల సమయంలో చూశానని చెప్పుకొచ్చారు. ఇలాంటివారు రాజకీయాల్లో ఉండాలన్నారు. వైసీపీ ప్రభుత్వ అసమర్థత వల్లే పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయని మండిపడ్డారు. జగన్ పాలనలో అన్నివర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని గుర్తుచేశారు. ఇటువంటి పాలనకు చరమగీతం పాడాలంటే ప్రతిఒక్కరూ ముందుకు రావాలన్నారు. వచ్చే ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు.

మంత్రిగా ఉండి మంగళగిరిలో ఓడిపోయానని వైసీపీ నేతలు ఎద్దేవా చేస్తున్న విషయాన్ని లోకేష్ గుర్తుచేశారు. టీడీపీ ఆవిర్భావం తరువాత 1983, 85 ఎన్నికల్లో మాత్రమే ఆ నియోజకవర్గంలో టీడీపీ గెలిచిన విషయాన్ని ప్రస్తావించారు. అందుకే అక్కడ రికార్డును చెరిపేందుకు సాహస నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. మొదటిసారి ఫెయిలయ్యానని.. తనలో ఫైర్ మాత్రం తగ్గలేదని.. 2024లో మాత్రం గెలిచి రికార్డు సృష్టిస్తానని చెప్పారు. అందరూ కలిసికట్టుగా వెళితేనే నియంత పాలనను అంతమొందించగలమన్నారు. మొత్తానికైతే యువగళం పాదయాత్రలో జూనియర్ ఎన్టీఆర్, పవన్ ల పేర్లు లోకేష్ ప్రస్తావిస్తూ మాట్లాడిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.