
AP MLC Elections- YCP: ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి నెలకొంది. తొమ్మిది స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్నింటినీ వైసీపీ గెలుచుకునే చాన్స్ ఉంది. దాదాపు అన్ని జిల్లాల్లో వైసీపీకి ఏకపక్షంగా స్థానిక సంస్థల ప్రతినిధులు ఉన్నారు. దీంతో వీరి ఎన్నిక లాంఛనమే. అయితే ఎన్నికల ముంగిట ఏ చాన్స్ వదులుకోకూడదని భావిస్తున్న టీడీపీ అభ్యర్థులను బరిలో దించే ప్రయత్నం చేసింది. కొంతమంది స్వతంత్ర అభ్యర్థులతో నామినేషన్ వేయించింది. అయితే చివరి నిమిషంలో ఎక్కడికక్కడే ‘అధికార’ ముద్ర కనిపించింది. అధికార వైసీపీ బెదిరింపులకు దిగినట్టు వార్తలు వస్తున్నాయి. కొన్నిచోట్ల అభ్యర్థులు పోలీసు సహకారంతో నామినేషన్ వేయవలసి వచ్చింది. అయితే వైసీపీ మాత్రం తొమ్మిది స్థానాలకుగాను ఐదింట ఏకగ్రీవం చేసుకుంది. ఈ నెల 27 వరకూ విత్ డ్రాలకు సమయం ఉండడంతో మిగతా వారితో నామినేషన్లు ఉపసంహరించేందుకు వైసీపీ ప్రయత్నిస్తోంది.
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తగినంత సంఖ్యాబలం లేనందున టీడీపీ సైలెంట్ అవుతుందని ఆశించారు. కానీ అధికార వైసీపీలో ఎక్కడికక్కడే విభేదాలున్నాయి. అటు మండలాలు, పంచాయతీల స్థాయిలో కూడా ఇవి కొనసాగుతున్నాయి. దీంతో ఆ పార్టీని మరింత గందరగోళంలో నెట్టేసేందుకు ఎమ్మెల్సీ ఎన్నికలను ఉపయోగించుకోవాలని టీడీపీ భావించింది. అయితే ఎక్కడ హైకమాండ్ జోక్యం చేసుకోకుండా జిల్లాల నాయకత్వానికే ఆ బాధ్యతలు అప్పగించారు. దీంతో నామినేషన్ల చివరి రోజున టీడీపీ స్వతంత్ర అభ్యర్థులను రంగంలోకి దించింది. అనంతపురం, చిత్తూరు, తూర్పు గోదావరి జిల్లాల్లో అభ్యర్దులను బరిలోకి దించింది. కానీ, నామినేషన్ల పరిశీలనలో పలు ప్రాంతాల్లో స్వతంత్ర అభ్యర్దుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. ఫలితంగా ఎన్నికలు జరుగుతున్న తొమ్మిది నియోజవకర్గాల్లో అయిదు స్థానాల్లో ఏకగ్రీవం అయ్యాయి. కడప, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, తూర్పు గోదావరి స్థానాలను వైసీపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది.

కొన్ని జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముద్ర చాటాలని టీడీపీ నాయకులు భావించినా సాంకేతిక కారణాలతో నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. సీఎం సొంత జిల్లాలో తలపడాలని టీడీపీ భావించింది. ఓ స్వతంత్ర అభ్యర్థికి మద్దతు తెలిపింది. కానీ అభ్యర్ధి సంతకాల్లో ఫోర్జరీగా తేల్చిన అధికారులు నామినేషన్ తిరస్కరించారు. దీంతో అక్కడ వైసీపీ అభ్యర్థి రామసుబ్బారెడ్డి ఏకగ్రీవం దాదాపు ఖాయమైంది. అనంతపురం జిల్లాలో వైసీపీని అడ్డుకునేందుకు జేసీ ప్రభాకర్ రెడ్డి చివరి వరకూ ప్రయత్నించారు. తన అనుచరుడి రంగయ్యతో నామినేషన్ దాఖలు చేయించారు. కానీ నామినేషన్ స్క్రూటినీలో తిరస్కరణకు గురైంది. ఫలితంగా అక్కడ వైసీపీ అభ్యర్ధి మంగమ్మ ఏకగ్రీవమైనట్టే. చిత్తూరులో స్వతంత్ర అభ్యర్ధి నామినేషన్ తిర్కరించటం తో వైసీపీ అభ్యర్ధి సిపాయి సుబ్రమణ్యం ఏకగ్రీవం దాదాపు ఖాయం. నెల్లూరులో స్వతంత్ర అభ్యర్ధి దేవారెడ్డి నాగేంద్రప్రసాద్ ను బలపర్చిన స్థానిక సంస్థల ప్రతినిధులు సంతకాలు తాము చేయలేదని ఫిర్యాదు చేయటంతో ఆ నామినేషన్ ను తిరస్కరించారు. అక్కడ మేరుగ మురళీధర్ ఎన్నికైనట్టే.
అయితే ఈసారి వైసీపీకి పట్టున్నట్టు భావిస్తున్న కర్నూలులో వైసీపీ పాచిక పారలేదు. అక్కడ ఏకంగా ముగ్గురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. శ్రీకాకుళం జిల్లాలో స్వతంత్ర అభ్యర్థి అన్నెపు రామక్రిష్ణ పోటీలో నిలిచారు. ఇక్కడ వైసీపీ బలపరచిన అభ్యర్థిగా నర్తు రామారావు ఉన్నారు. అయితే జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీని తూర్పుకాపులకు కేటాయించాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. వైసీపీ మాత్రం యాదవ సామాజికవర్గానికి చెందిన రామారావును బరిలో దించడంతో తూర్పుకాపులు రామక్రిష్ణతో పోటీ చేయిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం ఏడుగురు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అయితే అధికార వైసీపీ మాత్రం ఈ నాలుగు స్థానాలను సైతం ఏకగ్రీవం చేసేందుకు అన్నిరకాల ప్రయత్నాలు చేస్తోంది.