
Kavitha- ED: ఢిల్లీ లిక్కర్ స్కాం విషయంలో.. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు బిడ్డ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ వెంటాడుతోంది. ఇన్నాళ్లూ కవితను సాక్షిగానే పిలుస్తుందని అందరూ భావించారు. కానీ, గురువారం ప్రత్యేక కోర్టుకు కవిత కూడా అనుమానితురాలే అని తెలిపింది. ఆమెను అరుణ్‌పిళ్లైతో కలిపి విచారణ చేయాల్సి ఉందని పేర్కొంది. ఈనెల 20న హాజరు కావాలని నోటీసులు ఇచ్చింది. దీంతో బీఆర్‌ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత మరోసారి సుప్రీంకోర్టు గడప తొక్కనున్నారు. ఈడీ విచారణను నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని శుక్రవారం అత్యవసర పిటీషన్ వేయనున్నారు.
మళ్లీ పిలుపుతో..
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ మద్యం కుంభకోణంతో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలను ఎదుర్కొంటోన్న భారత్ రాష్ట్ర సమితి శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత ఇప్పటికే దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారుల విచారణకు వ్యతిరేకంగా పిటీషన్ వేశారు. దీన్ని సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ నెల 24వ తేదీన లిస్టింగ్ చేసింది. ఆ రోజున విచారిస్తామని తెలిపింది. అయితే గురువారం విచారణకు వెళ్లాలన్సిన కవిత గైర్హాజరయ్యారు. దీంతో ఈడీ మళ్లీ నోటీసులు ఇచ్చింది. ఈనెల 20న రావాలని కోరింది. దీంతో ఈ నెల 24వ తేదీన లిస్టింగ్ అయిన విచారణను శుక్రవారమే చేపట్టాలని కోరుతూ కవిత తాజాగా మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు. ఆమె తరఫు న్యాయవాది వందన సెహగల్ ఈ మేరకు అర్జంట్ పిటీషన్ దాఖలు చేయనున్నారు. అత్యవసరంగా దీనిపై విచారణ చేపట్టాలని మరోసారి అభ్యర్థించనున్నారు. దీనిపై సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుందనేది ఆసక్తి రేపుతోంది.
11న ఈడీ ముందుకు..
ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవిత ఈ నెల 11న ఈడీ విచారణకు హాజరయ్యారు. సుమారు తొమ్మిది గంటల పాటు ఆమెను విచారించారు ఈడీ అధికారులు. మొదటి విడతలోనే చాలా ఆధారాలను ఈడీ కవిత ముందు పెట్టినట్లు తెలుస్తోంది. అందుకే రెండో విడతలో 16న విచారణకు హాజరు కావాల్సి ఉన్నప్పటికీ.. భయంతో తప్పించుకునేందుకు చట్టపరంగా అన్ని దారులు వెతికారు. చివరకు ఈడీ నోటీసుల్లో దొరికిన చిన్న లోపాన్ని పట్టుకున్నారు ఆమె తరపున్యాయవాదులు. 16న వ్యక్తిగతంగా హాజరు కావాలని ఎక్కడా పేర్కొనలేదని, అందుకే తన సహాయకుడిని పంపించానని లేఖద్వారా న్యాయవాదిని పంపించారు. మరోవైపు సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్‌లో ఉన్నందున తాను హాజరుకాలేనని స్పష్టం చేశారు.

మళ్లీ రావాల్సిందే..
ఈడీకే షాక్ ఇచ్చిన కవిత కాస్త ఉపశమనం పొందారు. కానీ ఇది ఎంతోసేపు నిలవలేదు. విచారణ తప్పించుకున్న ఆనందంతో ౖహె దరాబాద్ బయల్దేరదామనుకుంటున్న సమయంలో ఈడీ షాక్ ఇచ్చింది. ఈనెల 20న విచారణకు రావాల్సిందే అంటూ నోటీసులు ఇచ్చింది. అందులో పొరపాటు దొర్లకుండా వ్యక్తిగతంగా హజరు కావాలని, అరుణ్‌పిళ్లైతో కలిపి విచారణ చేస్తామని స్పష్టం చేసింది. దీంతో అప్రమత్తమైన కవిత హైదరాబాద్ ప్రయాణం రద్దు చేసుకున్న ఆమె ఢిల్లీలోనే ఉండిపోయారు. న్యాయనిపుణులతో తాజా నోటీసులపై చర్చించారు. నోటీసుల్లో ఎక్కడా లోపం లేకపోవడంతో మళ్లీ సుప్రీంను ఆశ్రయించాలని నిర్ణయించారు. ఈ నెల 24వ తేదీన లిస్టింగ్ అయిన తన పిటీషన్ పై విచారణను శుక్రవారమే చేపట్టాలని అభ్యర్థించనున్నారు. తాజా అభ్యర్థనపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఎలా స్పందిస్తుంది అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.