
AP MLC Elections Results 2023: ఉత్తరాంధ్రలో వైసీపీకి ఎదురుగాలి వీస్తోంది. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికతో అది స్పష్టమవుతోంది. టీడీపీ ఆవిర్భావం నుంచి ఉత్తరాంధ్ర ఆ పార్టీకి కంచుకోట. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి వేవ్ లో సైతం ఉమ్మడి ఏపీలో టీడీపీ పరువును నిలపగలిగింది. నాడు కాంగ్రెస్ తో సమానంగా నిలబడింది. అటువంటి టీడీపీని జవసత్వాలు లేకుండా పెకిలించడంలో జగన్ సక్సెస్ అయ్యారు. విజయనగరంతో పాటు విశాఖ రూరల్ లో టీడీపీ ఖాతా కూడా తెరవలేదు. విశాఖ నగరంలో పర్వాలేదనిపించినా.. శ్రీకాకుళంలో మాత్రం రెండు నియోజకవర్గాలకే పరిమితమైంది. కానీ నాలుగేళ్లు తిరిగే సరికి సీన్ మారుతోంది. ప్రత్యర్థులంతా ఏకం కావడం, ఓ ప్రధాన సామాజికవర్గం వైసీపీకి దూరం కావడంతో ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి.
ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్థానానికి అందరి కంటే ముందుగా అభ్యర్థిని ప్రకటించింది వైసీపీనే. ఆరు నెలల ముందునే బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సీతంరాజు సుధాకర్ ను అభ్యర్థిగా ప్రకటించారు. ఉత్తరాంధ్రలోని అన్ని నియోజకవర్గాల శ్రేణులకు గ్రాండ్ గా పరిచయం చేశారు. ఊరూవాడా ప్రచారం చేశారు. వలంటీరు, సచివాలయ వ్యవస్థల ద్వారా ప్రచారం చేశారు. కానీ పట్టభద్రుల అభిమానాన్ని మాత్రం చూరగొనలేకపోయారు. అటు వైవీ సుబ్బారెడ్డి నుంచి మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు, రాజన్నదొర, అమర్నాథ్, ముత్యాలనాయుడు.. ఇలా పార్టీ సైన్యం అంతా రంగంలోకి దిగింది. దీనికి అధికార దర్పం తోడైంది. కానీ వారొకటి తలిస్తే పట్టభద్రులు ఒకటి తలచారన్నట్టు.. ఓటమి అంచులో వైసీపీ అభ్యర్థి నిలబడ్డారు.
అయితే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో ఉత్తరాంధ్రలో రాజకీయ సమీకరణలు శరవేగంగా మారే చాన్స్ కనిపిస్తోంది. విపక్షాలు, ప్రధానంగా టీడీపీ దూకుడు పెంచే చాన్స్ ఉంది. ఉత్తరాంధ్రలోని 32 నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో ఆరు నియోజకవర్గాలకే టీడీపీ పరిమితమైంది. రాయలసీమ, కోస్తాంధ్రతో పోల్చుకుంటే ఇక్కడే అధిక స్థానాలు వచ్చాయి. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి గెలుపొందితే మాత్రం పూర్వ వైభవం ఖాయమని తెలుగుదేశం పార్టీ నేతలు బలంగా నమ్ముతున్నారు. ఇదే స్ఫూర్తిని వచ్చే ఎన్నికల వరకూ కొనసాగించాలని భావిస్తున్నారు.

వాస్తవానికి టీడీపీ బలపరచిన వేపాడ చిరంజీవిరావు అనూహ్యంగా తెరపైకి వచ్చారు. తొలుత టీడీపీ అభ్యర్థిగా భీమిలి మునిసిపల్ మాజీ చైర్ పర్సన్ గాడు చిన్నకుమారి లక్ష్మిని టీడీపీ హైకమాండ్ ఎంపిక చేసింది. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఆమె పరిచయ కార్యక్రమం జరిగింది. అయితే విద్యాధికుడు, ఆపై కాపు సామాజికవర్గానికి చెందిన వేపాడ చిరంజీవిరావు అయితే గెలుపు సునాయాసమవుతుందని భావించి ఆయన పేరును తెరపైకి తెచ్చారు. పార్టీ అభ్యర్థి మార్పు చేశారు. ఈ హఠాత్ పరిణామంతో టీడీపీ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. కానీ చంద్రబాబు మాత్రం నాయకులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. దీంతో ఉత్తరాంధ్ర టీడీపీ నాయకులు సమన్వయంతో పనిచేశారు. నియోజకవర్గ బాధ్యులు బాధ్యత తీసుకున్నారు. పట్టభద్రులను కలుసుకొని ప్రభుత్వ విధానాలు తెలియజెప్పారు. వారి అభిమానాన్ని చూరగొన్నారు. వైసీపీ గట్టి దెబ్బకొట్టగలిగారు.