
Kanna Lakshminarayana: బీజేపీని వీడిన కన్నా లక్ష్మీనారాయణ పొలిటికల్ అడుగులు ఎటువైపు వేస్తారా? అన్న చర్చ నడుస్తోంది. తొలుత జనసేన వైపు మొగ్గుచూపినా.. అందుకు కన్నా వెనక్కి తగ్గారు. కానీ అన్ని పార్టీలు ఆయనకు ఆహ్వానం పలికాయి. పార్టీలో చేరితే సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చాయి. కానీ కన్నా మాత్రం ఆచీతూచీ అడుగులు వేస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో చేరేందుకే దాదాపు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఆదివారం అభిమానులు, అనుచరులతో సమావేశమైన కన్నా ఫైనల్ డెసిషన్ కు వచ్చినట్టు తెలుస్తోంది. వివిధ పార్టీల నుంచి వచ్చిన ఆహ్వానాలు, ఆఫర్లు గురంచి కార్యకర్తల వద్ద ప్రస్తావించినట్టు తెలిసింది. ఇప్పటికే రెండు టర్మ్ లు పవర్ పాలిటిక్స్ కు దూరమైనందున.. ఈసారి మంచి నిర్ణయం తీసుకోవాలని అనుచరులు సూచించారు దీంతో ఆయన టీడీపీలోకి వెళ్లేందుకు డిసైడ్ అయినట్టు సమాచారం.
తనను బీజేపీ రాష్ట్ర చీఫ్ నుంచి తొలగించిన నాటి నుంచే కన్నా ఓకింత అసహనంతో ఉన్నారు. పైగా తనకు గిట్టని సోము వీర్రాజుకు ఇచ్చేసరికి అసంతృప్తికి గురయ్యారు. అయినా ఎన్నికల వరకూ వేచి ఉండేందుకు మొగ్గుచూపారు. ఇప్పుడు ఎన్నికలకు ఏడాదే ఉండడంతో ఏదో పార్టీలో చేరి.. సరైన నియోజకవర్గాన్ని ఎంచుకోవాలన్న భావనతో ఉన్నారు. తొలుత జనసేనలో చేరుతారని భావించారు. ఆ పార్టీ కీలక నేత నాదేండ్ల మనోహర్ చర్చలు జరపడంతో అంతా జనసేనలో చేరతారని భావించారు. ఇంతలో బీఆర్ఎస్ అధినాయకత్వం కన్నాను ఆశ్రయించింది. తమ పార్టీలో చేరితే ఏపీ నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తామని ఆఫర్ చేసింది. అయితే ఒక్క ఆర్థిక వనరులను చూసుకుంటే పొలిటికల్ కెరీర్ పనంగా పెట్టాల్సి వస్తుందని..పైగా కాపు సామాజికవర్గంలో చీలికకు తాను ప్రధాన కారకుడి కాకూడదని కన్నా భావించారు. అయితే ఒకానొక దశలో వైసీపీ నేతలు సైతం కన్నాను సంప్రదించినట్టు తెలిసింది.

2014 వరకూ కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రాతినిధ్యం వహించిన ప్రతిసారి కన్నా లక్ష్మీనారాయణ మంత్రి పదవి చేపడుతూ వచ్చారు. చివరిగా కిరణ్ కుమార్ కేబినెట్ లో లో మంత్రిగా వ్యవహరించారు. గత పదేళ్లుగా పవర్ పాలిటిక్స్ కు దూరంగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి చేపట్టాలని భావిస్తున్నారు. అదే సమయంలో చంద్రబాబు ఆఫర్ ఇచ్చినట్టు ప్రచారం సాగుతోంది. ఎమ్మెల్యే టిక్కెట్ తో పాటు డిప్యూటీ సీఎం కట్టబెడతారన్న టాక్ ఉంది. సత్తెనపల్లి నుంచి కానీ.. గుంటూరు పశ్చిమ నియోజకవర్గాల నుంచి కన్నాను పోటీలో దిగనున్నట్టు తెలుస్తోంది. ఆ రెండు నియోజకవర్గాల్లో గతంలో ఎమ్మెల్యేగా పోటీచేయడం, టీడీపీ కూడా అక్కడ రిజర్వ్ లో పెట్టడం కన్నా కోసమేనన్న ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో కన్నా టీడీపీలో ఎంట్రీకి దాదాపు మార్గం సుగమం అయినట్టే. ఆయన ఈ నెల 23న టీడీపీలో చేరడానికి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తోంది.