
YCP- AP MLC Elections: ఏపీలో అధికార వైసీపీపై ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. గత ఎన్నికల్లో వైసీపీ సంపూర్ణ విజయంలో ఈ రెండు వర్గాలదే కీలక పాత్ర. కానీ అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ ఈ రెండు వర్గాలపై నిర్లక్ష్యం చూపారు. వారికి న్యాయబద్ధంగా రావాల్సిన ఉద్యోగ ఫలాలను దక్కకుండా చేశారు. దీంతో వారు ప్రభుత్వ వ్యతిరేకులుగా మారిపోయారు. ఇటువంటి తరుణంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీల్లో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయోనన్న చర్చ నడుస్తోంది. ఏపీలో తొమ్మిది స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు, మూడు పట్టభద్రుల స్థానాలు, రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. గవర్నర్ కోటా కింద మరో రెండు ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయనున్నారు. ఈ నెల 23 వరకూ నామినేషన్ల స్వీకరణ, 27న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. మార్చి 13న ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో పట్టభద్రులు, ఉపాధ్యాయ స్థానాలు తప్పించి.. మిగతావన్నీ అధికార వైసీపీ దక్కించుకునే చాన్స్ ఉంది. కానీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీల విషయానికి వచ్చేసరికి మాత్రం ఆ పార్టీకి ప్రతికూల ఫలితాలు వచ్చే చాన్స్ ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి రెండు స్థానాలు రాయలసీమ పరిధిలోనివే. ఇందులో ఒకటి ప్రకాశం – నెల్లూరు -చిత్తూరు జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నిక కాగా.. రెండోది కడప -అనంతపురం -కర్నూలు జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నిక. ఈ రెండు ఎన్నికలూ దాదాపుగా గ్రేటర్ రాయలసీమ ప్రాంతాన్ని కవర్ చేస్తున్నాయి. ఆరు ఉమ్మడి జిల్లాలు, ప్రస్తుత జిల్లాల వారీగా చూస్తే దాదాపు 11 జిల్లాల్ని ఇవి కవర్ చేయబోతున్నాయి. ఆయా జిల్లాల్లో ఉపాధ్యాయుల పల్స్ వీటితో తేలబోతోంది. దీంతో వైసీపీ ప్రభుత్వానికి ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. గత ఎన్నికల్లో రాయలసీమలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. కానీ మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీన్ మారనుంది.
పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం నుంచి సిట్టింగ్ కత్తినరసింహారెడ్డి ఉన్నారు. మరోసారి ఆయన బరిలో దిగనున్నారు. అలాగే తూర్పు రాయలసీమ నుంచి మరో సిట్టింగ్ విఠపు బాలసుబ్రహ్మణ్యం ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరిద్దరూ మరోసారి పోటీచేయనున్నారు. అయితే ఈసారి వైసీపీ అనూహ్యంగా బరిలో దిగింది. పశ్చిమ రాయలసీమ నుంచి ఎంవీ రామచంద్రారెడ్డి, తూర్పు నుంచి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పేర్లను వైసీపీ ప్రకటించింది. వీరిద్దరి గెలుపు కోసం సర్వశక్తులూ ఒడ్డుతోంది. కానీ వర్కవుట్ అయ్యేలా పరిస్థితి కనిపించడం లేదు. ప్రభుత్వం మాత్రం సామ, వేద దండోపాయాలను ప్రయోగిస్తోందన్న ప్రచారం జరుగుతోంది.

జగన్ సర్కారుపై ఉపాధ్యాయులు గుర్రుగా ఉన్నారు. విద్యాసంస్కరణల్లో భాగంగా తమను ఇబ్బందులు పెట్టడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. నాడునేడు పథకంలో భాగస్థులను చేయడం, విద్యేతర పనులు చేయించడం, పాఠశాలల విలీన ప్రక్రియ, వేతన బకాయిలు, రాయితీల్లో జాప్యం, జీతాలు ఆలస్యం కావడం, ప్రభుత్వ పెద్దల అనుచిత వ్యాఖ్యలు వంటి వాటితో ప్రభుత్వానికి వ్యతిరేకులుగా మారిపోయారు. ఈ తరుణంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పావులు కదపడం ఖాయమని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. అదే జరిగితే సమాజంలోని ఓ వర్గం వారు దూరమైనట్టే. ఆ ప్రభావం వచ్చే ఎన్నికలపై చూపుతుందని.. ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశముందని విశ్లేషణలు వెలువడుతున్నాయి.