Pawan Kalyan: రణస్థలంలో రణన్నినాదం మోగనుంది. వంద గొంతుకుల గర్జనకు వేదిక కానుంది. కళింగాంధ్ర కష్టాలను ఎలుగెత్తి చాటనుంది. ఉద్దానం భాదను, వేదనను ప్రపంచానికి చాటనుంది. యువతరం కళింగాంధ్ర వైపు కదం తొక్కుతోంది. జనసేనాని గొంతుతో గొంతు కలిపేందుకు యువశక్తి కదిలి వస్తోంది. ఏపీలోని అన్నిదారులూ రణస్థలం వైపే. అడ్డంకులను గడ్డిపోచవలే విసిరికొడుతున్నారు. రణస్థలం నుంచి ఎన్నికల యుద్ధానికి సమరశంఖం ఊదనున్నారు. జనసేనానిని అడుగులో అడుగేయడానికి, భుజంతో భజం కలపడానికి యువశక్తి శ్రీకాకుళం జిల్లా రణస్థలం వైపు తరలివస్తోంది.

ఉత్తరాంధ్ర దశాబ్ధాలుగా వెనుకబాటుకు గురైంది. పాలకుల నిర్లక్ష్యం ఉత్తరాంధ్రాను అభివృధ్ధికి ఆమడ దూరంలో నెట్టింది. ఉద్దానం సమస్య పాలకులకు ఎన్నికల కోణంలో కనిపిస్తోంది. తొలిసారిగా ఓ ప్రతిపక్ష నాయకుడు ఉద్దానంలో ప్రతి గడపను తొక్కారు. ప్రతి తలుపును తట్టారు. బాధితుల ఆవేదనను విన్నారు. బాధితుల బాధను తన బాధగా ప్రపంచానికి ఎలుగెత్తి చాటారు. జనసేనాని పవన్ కళ్యాణ్ పర్యటనతో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం దిగొచ్చింది. బాధితులకు వైద్యం చేయిస్తామని హామీ ఇచ్చింది. ప్రతిపక్ష నాయకుడు పోరాటానికి ప్రభుత్వం తలవంచి బాధితులకు న్యాయం చేసే ప్రయత్నం చేయడం చాలా అరుదేమో. 2019 తర్వాత ఉద్దానం బాధితుల గోడు, ఉత్తరాంధ్ర ప్రజల వెతలు పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.
కులాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం ప్రతి సందర్భంలో జరుగుతున్న సందర్భంలో.. కులాలను, మతాలను కలిపే ఆలోచన విధానం తమదంటూ జనసేనాని దిక్కులు పెక్కటిల్లేలా నినదించారు. సామాజిక విచ్ఛిన్నకారులకు సవాల్ విసిరారు. ప్రతి కులానికి, మతానికి అండగా ఉంటామని, ప్రజారాజకీయం చేస్తామని జనసేనాని హామీ ఇచ్చారు. ఒకే రాష్ట్రంలో మూడు రాజధానుల పేరుతో వికృత క్రీడకు నాంది పలికిన నేపథ్యంలో.. రాజధానులు కాదు రాష్ట్రంలోని ప్రజల ఈతిబాధలు తీర్చమని పవన్ కళ్యాణ్ ప్రభుత్వానికి సూచించారు.

కోస్తాంద్రా, ఉత్తరాంధ్ర, రాయలసీమ.. మూడు ప్రాంతాల్లోనూ మూడు రహస్య ఎజెండాతో పరిపాలిస్తున్న ప్రభుత్వాన్ని యువశక్తి ప్రోగ్రాం వేదికగా ప్రశ్నించనున్నారు. రాజధానితో ఉత్తరాంధ్ర బాగుపడదని, కూడు, గూడు, గుడ్డ, చదువు, వైద్యం అందిస్తేనే ఉత్తరాంధ్ర బతికి బట్టకడుతుందని తేల్చిచెప్పారు. అధికార పార్టీ స్వప్రయోజనాల కోసమే మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడుతున్నారనేది జనసేనాని విమర్శ. చిత్తశుద్ధి ఉంటే ఉద్దానం సమస్యను ఎందుకు తీర్చలేకపోయిందని ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్నారు.
ఎన్నికల సమయంలో వైసీపీ ఉద్దానం కిడ్నీ బాధితులకు అనేక హామీలు ఇచ్చింది. అధికారంలోకి వచ్చాక హామీలు నీటిమూటలు మారాయి. ఉద్దానాన్ని పలకరించే నాథుడే లేడు. ఉత్తరాంధ్రను కనికరించే పాలకుడేలేడు. ఇసుక, మైనింగ్, లిక్కర్, గంజాయి మాఫియా మీదున్న శ్రద్ధ .. ఉత్తరాంధ్ర ప్రజల పై పాలకులకు లేకుండాపోయింది. ఫలితంగా ఉత్తరాంధ్ర జనం బతుకు నానాటికి తీసికట్టుగా మారిపోతోంది.

ఉత్తరాంధ్రను ఉద్దరించాలంటే ప్రత్యేక రాష్ట్రం చేయాలని మంత్రి ధర్మాన ప్రసాద్ రావ్ మాట్లాడారు. ఇన్నేళ్లు ఆయన మంత్రిగా ఉండి ఉత్తరాంధ్రను, ఉద్ధానాన్ని ఉద్ధరించిన కార్యక్రమం ఏదైనా ఉంటే చెప్పాలని జనసేన ప్రశ్నిస్తోంది. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం, ఆ మంటల్లో చలికాచుకోవడం వైసీపీ లక్ష్యంగా కనిపిస్తోందనేది జనసేన వాదన. అధికారంలో ఉన్నవారే ప్రాంతాల మధ్య చిచ్చపెట్టడమంటే అభివృద్ధిని గాలికి వదిలేయడమనే కదా అర్థం.