Janasena Yuvashakti: ‘రణ’స్థలి సిద్ధమైంది. రాష్ట్రం యావత్తూ రణస్థలం వైపే చూస్తోంది. అందరి అడుగులు రణస్థలం వైపే పడుతున్నాయి. జనసేన యువశక్తి కార్యక్రమం కొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమ నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జాతీయ రహదారి చెంతనే 35 ఎకరాల ప్రైవేటు స్థలంలో వేదిక సిద్ధమైంది. పవన్ తో పాటు 100 మంది యువ ప్రతినిధులు వేదికపై కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. వీఐపీలు,వీర మహిళలు, కీలక నాయకులకు వేర్వేరుగా గ్యాలరీలు ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి లక్షలాది మంది యువత వస్తారన్న అంచనాల నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేశారు. తొక్కిసలాటలకు అవకాశం లేకుండా బారికేడ్లు ఏర్పాటుచేశారు. అటు సభకు వచ్చేవారికి భోజనం, తాగునీరు, ఇతరత్రా వసతులను సమకూర్చనున్నారు. గురువారం వేకువజాము నుంచే ఆహార తయారీ ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి.

.ఇప్పటికై పవన్ ఉత్తరాంధ్రకు చేరుకున్నారు. బుధవారం అర్ధరాత్రి విజయనగరం జిల్లా భోగాపురంలోని సన్ రే రిసార్ట్స్ లో పవన్ బస చేశారు. సాయంత్రం ప్రత్యేక విమానంలో విశాఖ చేరుకున్న పవన్ కు ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం లభించింది. అక్కడ నుంచి రోడ్డు మార్గం గుండా సన్ రే రిసార్ట్స్ కు పవన్ చేరుకున్నారు. పవన్ షెడ్యూల్ ఖరారు కావడంతో వేలాది మంది యువత, జన సైనికులు రిసార్ట్స్ వద్దకు చేరుకున్నారు. పవన్ కు ఘన స్వాగతం పలికారు. అందరికి అభివాదం చేస్తూ పవన్ ముందుకు సాగారు. ఉదయం 11 గంటలకు రిసార్ట్స్ నుంచి బయలుదేరి పవన్ సభా వేదికకు చేరుకోనున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకూ యువశక్తి కార్యక్రమంలో పవన్ పాల్గొనున్నారు.

ఉత్తరాంధ్ర నుంచే కాకుండా రాష్ట్రం నలుమూలల నుంచి జన సైనికులు రణస్థలానికి చేరుకున్నారు. ఎటుచూసిన జనమే కనిపిస్తున్నారు. ఇటు విశాఖ, అటు శ్రీకాకుళం వైపు కిలోమీటర్ల మేరవాహనాలు బారులుదీరుతూ కనిపించాయి. చాలా మంది బుధవారం సాయంత్రానికి విశాఖ, శ్రీకాకుళం చేరుకున్నారు. లాడ్జిలు, హోటళ్లలో విడిది చేశారు. గురువారం ఉదయం 7 గంటలకే సభా ప్రాంగణానికి చేరుకోవడం కనిపించింది. ఉత్తరాంధ్రలోని 33 నియోజకవర్గాల నుంచి ప్రత్యేక వాహనాల్లో జనసేన శ్రేణులు తరలివస్తున్నారు. కార్యక్రమ నిర్వహణకు సంబంధించి రవాణా, భద్రత, ఆహార, ఆహ్వాన కమిటీలను ఏర్పాటుచేశారు. కీలక నాయకులకు ఆ బాధ్యతలు అప్పగించారు. వేలాది మంది వలంటీర్లు సేవలందిస్తున్నారు. ఎక్కడా ఎటువంటి లోపాలకు తావివ్వకుండా ఏర్పాట్లు చూస్తున్నారు.