
Janasena- YCP: విశాఖ జిల్లాలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ నుంచి క్రియాశీలక నేతలు, కార్యకర్తలు జనసేనలోకి క్యూకడుతున్నారు. భారీ అనుచరులతో పార్టీలో చేరుతున్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన గెలుపే లక్ష్యంగా కృషిచేస్తామని చెబుతున్నారు. దీంతో అధికార పార్టీ కలవరపాటుకు గురవుతోంది. విశాఖ జిల్లాలో ఇటీవల పవన్ గ్రాఫ్ పెరిగింది. జనసేన బలం కూడా అమాంతం పెంచుకుంది. ఇక్కడ పవన్ అభిమానులు అధికం. ఆపై కాపుల ప్రభావం ఎక్కువ. గత ఎన్నికల్లో జనసేన ఓట్ల షేర్ సాధించిన జిల్లాలో విశాఖ ముందంజలో ఉంది. గత నాలుగేళ్లలో పార్టీ గ్రాఫ్ గణనీయంగా పెరుగుతూ వస్తోంది. అందుకే ఇక్కడ చేరికల సంఖ్య పెరుగుతోంది. దాదాపు ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి వివిధ పార్టీల నేతలు చేరుతుండడంతో జనసేనలో జోష్ నెలకొంది.
తాజా మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వహిస్తున్న భీమిలి నియోజకవర్గం నుంచి వైసీపీ నుంచి జనసేనలోకి చేరికలు పెరిగాయి. పీఆర్పీ సమయం నుంచి అవంతి శ్రీనివాసరావు వెంట నడిచిన వారు సైతం జనసేన బాట పడుతున్నారు. ముఖ్యంగా అవంతికి ప్రధాన అనుచరుడిగా ఉన్న ఈడుముడి నాగసూర్య చంద్రరావు పవన్ సమక్షంలో జనసేనలో చేరారు. మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో పవన్ చంద్రరావు మెడలో కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు. ఇన్నాళ్లు తన వెంట నడిచిన చంద్రరావు జనసేన గూటికి చేరడం అవంతికి షాక్ కు గురిచేసింది. మంత్రిగా ఉన్నప్పుడు పవన్ పై దూకుడుగా వ్యవహరించే అవంతి ఇటీవల కాస్తా తగ్గారు. ఎక్కడా నోరు మెదపడం లేదు. ఇటువంటి సమయంలో చంద్రరావు ఝలక్ ఇవ్వడాన్ని అవంతి తట్టుకోలేకపోతున్నారు.
భీమిలి నియోజకవర్గానికి చెందిన మరో కీలక నేత అక్కరమాని దివాకర్ వైసీపీని వీడారు. ఈయన భీమిలి మునిసిపల్ మాజీ చైర్ పర్సన్, వీఎంఆర్ డీఏ చైర్మన్ అక్కరమాని విజయనిర్మల సమీప బంధువు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా విశాఖ నగరం నుంచి బరిలో దిగేందుకు విజయనిర్మల ప్లాన్ చేస్తున్నారు. ఇటువంటి తరుణంలో ఆమె స్వయాన బావ కుమారుడు, వైసీపీలో యాక్టివ్ రోల్ పోషించే దివాకర్ దూరం కావడం గట్టి దెబ్బేనని విశ్లేషకులు భావిస్తున్నారు. విశాఖ నగరంలోని కీలక మైన మధురవాడకు చెందిన బిల్డర్ నక్క శ్రీధర్ జనసేన గూటికి చేరారు. వీరితో పాటు వందలాది మంది జనసేనలో జాయిన్ అయ్యారు. ఇది వైసీపీకి గట్టి దెబ్బేనని విశ్లేషకులు భావిస్తున్నారు.

గత ఎన్నికల్లో అవంతి శ్రీనివాసరావు అనూహ్యంగా భీమిలి నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. సరిగ్గా ఎన్నికలకు ముందు టీడీపీ అభ్యర్థిగా మాజీ మేయర్ సబ్బం హరి తెరపైకి వచ్చారు. కానీ జనాదరణ పొందలేకపోయారు. ఆయన మరణానంతరం ఇక్కడ టీడీపీకి సరైన నాయకత్వం దొరకలేదు. దీంతో మంత్రిగా ఉన్న అవంతి శ్రీనివాసరావు అగడాలు పెచ్చుమీరాయి. పవన్ పై అవాకులు, చెవాకులు పేలుతూ వచ్చారు. ఇది వైసీపీలో మెజార్టీ కేడర్ కు నచ్చలేదు. దీంతో మనస్తాపంతోనే పార్టీలో గడుపుతూ వచ్చారు. అవంతికి మంత్రి పదవి ఊడిపోవడం, ఎన్నికలు సమీపిస్తుండడంతో నాయకులు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. జనసేనలో చేరుతున్నారు. అయితే ఇది వైసీపీ హైకమాండ్ కు మింగుడుపడడం లేదు. భీమిలి నియోజకవర్గంలో ఏం జరుగుతోందని ఆరాతీసే పనిలో పడింది.