Homeఆంధ్రప్రదేశ్‌CM Jagan: టన్నుల్లో భయం.. ఆత్మరక్షణలో జగన్

CM Jagan: టన్నుల్లో భయం.. ఆత్మరక్షణలో జగన్

CM Jagan
CM Jagan

CM Jagan: కలిసి వచ్చే కాలంలో ఏంచేసినా చెల్లుబాటు అవుతుంది. అదే ప్రతికూలత ఎదురైనప్పుడు ఏ పనిచేసినా అడ్డంకులు ఎదురవుతుంటాయి. ఆ సమయంలో నిలదొక్కుకుంటేనే మనకు మనం రాటుదేలగలం. అయితే కలిసొచ్చిన కాలంలో విర్రవీగితే దానికి మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇప్పుడు ఏపీ సీఎం జగన్ కు అదే ఎదురైంది. ఏకంగా పార్టీ ఎమ్మెల్యేలనే హెచ్చరించారు. మారకుంటే మార్చేస్తానని సంకేతాలిచ్చారు. గ్రాఫ్ పడిపోయిందంటూ వారిని చులకన చేసి మాట్లాడారు. ప్రజలు నన్ను చూసి ఓట్లు వేస్తారు తప్ప మిమ్నల్ని చూసి కాదంటూ హేళన చేశారు. జస్ట్ మీరు భగవంతుడికి, భక్తుడికి మధ్య పూజారి పాత్ర పోషించండంటూ సెలవిచ్చారు. అయితే ఇదంతా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ముందు. ఇప్పుడేమో పూర్తిగా సీన్ మారిపోయింది. ఏ ఎమ్మెల్యేను, కార్యకర్తనూ వదులుకోలేను. మరీ కాదు కూడదు తప్పదంటే, మార్పు అనివార్యమైతే ఎమ్మెల్సీతో పాటు ఇతర నామినేటెడ్ పోస్టులు కేటాయిస్తానని చెప్పుకొస్తున్నారు. నాటి హెచ్చరికలు బదులు బుజ్జగింపులకు దిగడం చూస్తున్న వైసీపీ ఎమ్మెల్యేలు ఆశ్చర్యానికి లోనవుతున్నారు. రాజకీయం తెలిసిన వారు కావడంతో.. మనవాడికి భయం పట్టుకుంది అంటూ అంతర్గత సమావేశాల్లో చర్చించుకోవడం మొదలుపెట్టారు. టన్నుల్లో భయం కనిపిస్తోందని.. జగన్ ఆత్మరక్షణలో పడిపోయారంటూ ప్రత్యర్థులు ఒక అంచనాకు వస్తున్నారు.

ఎటువంటి హెచ్చరికలు లేకుండా..
వైనాట్ 175 అంటూనే జగన్ గత ఏడాది కాలంగా అలెర్ట్ గా ఉన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను విపక్షాలు ప్రజల్లోకి బలంగా తీసుకువెళుతున్న నేపథ్యంలో ప్రభుత్వపరంగా ఓ కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్లాన్ చేశారు. అందులో భాగంగానే గడపగడపకూ వైసీపీ ప్రభుత్వం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతీ ఇంటికి వెళ్లి ప్రజలను పలకరించాలని ఎమ్మెల్యేలను ఆదేశించారు. మీ పనితీరుకు అదే కొలమానమని.. దాని ప్రాతిపదికగా తీసుకొని మార్కులు వేస్తానని తేల్చిచెప్పారు. వర్కుషాపు నిర్వహించి మదింపు చేస్తానని ప్రకటించారు. అయితే గత డిసెంబరు 16న నిర్వహించిన వర్కుషాపులో 67 మంది ఎమ్మెల్యేలకు ఫెయిల్ మార్కులిచ్చారు. మరో అవకాశమిస్తున్నానని..మారండి అంటూ పేర్లు పెట్టి మరీ హెచ్చరించారు. ఫిబ్రవరి 13న మరో వర్క్ షాపు పెట్టారు. అందులో ఓ 64 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదని చెప్పారు. కానీ 30 మంది పేర్లు చదవి వినిపించారు. మారండని గట్టి హెచ్చరికలే పంపారు. ఇప్పుడు తాజా వర్కుషాపులో మాత్రం పేర్లు చదవడాలు, హెచ్చరికలకు కాస్తా మినహాయింపు ఇచ్చారు. బుజ్జగింపులకే అధిక సమయం కేటాయించారు.

ఖుషీ అవుతున్న ఎమ్మెల్యేలు..
ఏది జరిగినా మన మంచికేనంటూ వైసీపీ ఎమ్మెల్యేలు తెగ ఖుషీ అవుతున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి తమకు రూట్ క్లీయర్ చేసిందని ఆనందపడుతున్నారు. సీఎం జగన్ కనీసం 50 మంది ఎమ్మెల్యేల పనితీరుపై అసంతృప్తిగా ఉన్నారని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. ఆయన స్ట్రెయిట్ ఫార్వాడ్ గా ఉన్నారు. తన వెంట ఎంత కాలం నుంచి ఉన్నారు.. పార్టీకి ఎంత విధేయులు అన్నది తాను పట్టించుకోనని.. గెలుపు గుర్రాలు అనుకుంటేనే టిక్కెట్లు ఇస్తానని చెబుతున్నారు. చివరికి ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ జరుగుతున్న రోజున తనను కలిసిన ఎమ్మెల్యేలతోనూ అదే చెప్పారని అంటున్నారు. అయితే ఎమ్మెల్యేలతో జరిగిన సమీక్షలో మాత్రం పూర్తిగా రివర్స్‌లో వ్యాఖ్యలు చేశారు. ఒక్క ఎమ్మెల్యేను.. ఒక్క కార్యకర్తను కూడా వదులుకోనని అందర్నీ గెలిపించుకుంటానని చెప్పారు. దీంతో జగన్‌లో భయం కనిపించిందని కొంత మంది ఎమ్మెల్యేలు సెటైర్లు వేసుకుంటున్నారు. భయం నుంచి పూర్తి విముక్తి అయినట్టు మాట్లాడుతున్నారు.

CM Jagan
CM Jagan

మూల్యం తప్పదన్న భయం…
మంత్రివర్గ విస్తరణ తేనె తుట్టను జగన్ కదిలించదలచుకోలేదు. ఇప్పటికే చేసిన మార్పులతో చేతులు కాల్చుకున్నారు. మళ్లీ అదే పనిచేస్తే మూల్యం చెల్లించుకోక తప్పదన్న వాస్తవాన్ని గుర్తించారు. గతంలోలా జగన్ ఏది చెబితే అదే రైట్ అనే పరిస్థితి మారడంతో .. పార్టీ అధినేతగా ఆలోచించి ఆయన రియలైజ్ అయ్యారన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ జరిపితే అది కుంపటి పెట్టుకోవడేనని సీఎం జగన్‌కు గుర్తుకొచ్చింది. అందుకే ఆగిపోయారు. ముందస్తు ఎన్నికల విషయంలోనూ ఏ స్పష్టతా ఇవ్వలేకపోయారు. మొత్తంగా సీఎం జగన్ లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఇన్నాళ్లకు ఆయన నేలకు దిగారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. అటు ప్రజా వ్యతిరేకత పెరుగుతుండడం, ఎమ్మెల్యేలు ధిక్కరిస్తుండడంతో బెదిరించడం కంటే బుజ్జగించడమే శ్రేయస్కరమని భావిస్తున్నారు. ప్రస్తుతం సీఎం జగన్ లో భయం తప్ప.. మరొకటి కనిపించడం లేదని విశ్లేషకులు సైతం భావిస్తున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular