
Jagan- Chandrababu: వాత పెట్టాలి.. వెన్న పూయాలి.. ఇది తెలిసిన వాడు ఎక్కడైనా రాణించేస్తాడు. ముఖ్యంగా రాజకీయాల్లో ఈ ఫార్ములాను తప్పకుండా అప్లయ్ చేయాలి. లేకుంటే ఇప్పటి రాజకీయాలను అధిగమించడం చాలా కష్టం. అయితే దీనిని బాగా వంటపట్టించుకున్న చంద్రబాబు చాలా సందర్భాల్లో సక్సెస్ అయ్యారు. జగన్ మాత్రం ఫెయిల్యూర్ ను సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా పదవులు, టిక్కెట్ల పంపకంలో చంద్రబాబు పాటించే ఎత్తుగడ గమ్మత్తుగా ఉంటుంది. ముందస్తు వ్యూహం దాగి ఉంటుంది. ఎదుటి వారిని నొప్పించినా.. నొప్పి తెలియకుండా ఒప్పించగల నేర్పు, సామర్థ్యం చంద్రబాబు సొంతం. అయితే జగన్ మాత్రం ఎదుటి వారిని నొప్పించే సమయంలో తప్పుకు దొరికిపోతారు. మూల్యం చెల్లించుకుంటారు. నష్టాన్ని చేజేతులా కొని తెచ్చుకుంటారు.
ఆ నలుగరితో చెప్పించే నేర్పరి…
చంద్రబాబు చుట్టూ ఎప్పుడూ నాయకులు ఉంటారు. అది ఏ సమావేశమైనా ఆ నేతలు కనిపిస్తుంటారు. దానిని కోటరి అనే కంటే ఒక వ్యూహంలో భాగమే అనవచ్చు. పార్టీ టిక్కెట్లు కేటాయించినప్పుడు, పదవులు ఇచ్చేటప్పుడు ఆ చుట్టూ ఉన్న నలుగురే పాత్రధారులు. ఎవరైనా ఒక ఆశావహుడు చంద్రబాబును కలిసేందుకు వస్తే ఆ నలుగురు నాయకులు తమ అభినయాన్ని స్టార్ట్ చేస్తారు. సార్.. మీ గురించే మాట్లాడుతున్నారు. అప్పుడే మీరు వచ్చారంటూ కూల్ చేస్తారు. అంతా బాగుంది కానీ.. రకరకాల ఇక్వేషన్స్ అడ్డు వస్తున్నాయని చెబుతారు. అప్పుడే చంద్రబాబు లోపలికి వెళ్లిపోతారు. ఇంతలో ఆ నలుగురు వైట్ వాష్ చేస్తారు. సార్ కి మీమీద గుడ్ ఒపీనియన్ ఉంది కానీ.. చాలా మంది ప్రముఖుల ఒత్తిడి ఉందని.. ఈసారి నో చాన్స్ అని.. వెయిట్ చేస్తే మంచి అవకాశాలు వస్తాయని భ్రమ కల్పిస్తారు. ఇంతలో చంద్రబాబు వచ్చి మీ సీనియార్టీ, సిన్సియార్టీ గొప్పదని లెక్చర్ ఇస్తారు. దీంతో సదరు ఆశావహుడు మనసులో బాధగా ఉన్నా.. అధినేత చెప్పినదే సహేతుకమే కదా అని లోలోపల సర్దుకుంటాడు.
ముఖం మీద చెప్పే మనస్తత్వం జగన్ ది…
అయితే సీఎం జగన్ అలా కాదు. ఒక కచ్చితమైన అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటారు. సదరు ఆశావహుడు కలిసినప్పుడు ముఖం మీద చెప్పేస్తారు. అనుకూల నిర్ణయం అయితే సదరు ఆశావహుడు ఆనందపడతాడు. లేకుంటే నిరాశతో వెనుదిరుగుతాడు. మదినిండా అసంతృప్తి నింపుకొని బయటికి వెళ్లిపోతాడు. ఇప్పటి వైసీపీ సిట్యువేషన్ కు అదే కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. జగన్ తన సోలో పెర్ఫార్మెన్స్ తో చేజేతులా కష్టాలు తెచ్చుకుంటున్నారని అభిప్రాయపడుతున్నారు. మొన్నటికి మొన్న ఎమ్మెల్యే కోటా కింద జరిగిన ఎన్నికల ముందు జరిగిన ఎపిసోడ్ లో ఇదే జరిగింది. ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సీఎం జగన్ ను కలిశారు. తమ రాజకీయ భవిష్యత్ గురించి సీఎంను అడిగారు. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు కన్ఫర్మ్ చేయాలని కోరారు. కానీ దానికి జగన్ వెంటనే రిప్లయ్ ఇచ్చినట్టు తెలిసింది. నో చెప్పారని తెలియడంతో వారు చిన్నబుచ్చుకొని ఎమ్మెల్సీ ఎన్నికల్లో వ్యతిరేకంగా వ్యవహరించారని టాక్ ఉంది. ఇలాంటి ఘటనతో సీఎం జగన్ చాలామంది నాయకులను దూరం చేసుకున్నారు. నొప్పించే వారిని ఒప్పించేందుకు చంద్రబాబులా వ్యూహం లేదన్నది వైసీపీలోనే ఒక టాక్.

రాజకీయం మార్చితేనే ఫలితం…
రాజకీయంగా చంద్రబాబు సీనియర్. ఎన్నో ఎత్తూ పల్లాలను, మైళ్ల రాళ్లను దాటుకుంటూ వచ్చారు. పైగా ఆయన వ్యూహాలు ఎక్కువసార్లు విజయానికి దారి చూపించాయి. అయితే జగన్ ఇప్పటివరకూ రాజకీయంగా సక్సెస్ అయినా.. అది తండ్రి చరిష్మ, లేకుంటే తన సంక్షేమ చరిష్మ తప్ప మరి ఇంకా ఏమీకాదు. తాను అధినేతగా ఉండి.. మిగతా నాయకులను గుర్తించి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తే కానీ మున్ముందు రాజకీయాలు చేయలేని పరిస్థితి. సలహదారులో, లేక వ్యూహాకర్తలపై ఆధారపడి రాజకీయాలు చేస్తే మొన్నటి ఎమ్మెల్సీ ఫలితాల్లాగే పరిస్థితి ఉంటుంది. అందుకే అధిగమించి రాజకీయాలు చేయాలి. వ్యూహాలు లేకుండా ఎదుటివారిని నొప్పించి తనవైపు ఉంచుకోవడం చాలా కష్టం. ఇది గుర్తెరిగిన నాడు చంద్రబాబు వలే జగన్ కూడా పరిణితి చెందే చాన్స్ ఉంది.