
Telangana BJP: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది. ఈసారి ఎలాగైనా మూడోసారి అధికారంలోకి రావాలని బీఆర్‌ఎస్ శత విధాల ప్రయత్నం చేస్తూ క్షేత్రస్థాయిలో పార్టీ నేతలను రంగంలోకి దింపుతోంది. ఎక్కడికి అక్కడ బలాబలాలను అంచనా వేసుకుంటూ, విజయం సాధించే అభ్యర్థులు ఎవరు? విజయావకాశాలు లేని ప్రజా ప్రతినిధులు ఎవరు? ఏ ఎమ్మెల్యేల పనితీరు బావుంది? ఏ ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదు? అన్న అంశాలను పరిగణలోకి తీసుకొని అభ్యర్థుల విషయంలో ఇప్పటి నుంచే కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే ఈసారి ఎలాగైనా బీఆర్‌ఎస్‌ను గద్దె దించాలని ప్రయత్నాలు చేస్తున్న ప్రతిపక్ష పార్టీలు మాత్రం వచ్చే ఎన్నికల్లో అభ్యర్థుల విషయంలో పెద్దగా ఫోకస్ చేసినట్టు కనిపించడం లేదు. ముఖ్యంగా బీజేపీలో అభ్యర్థుల కొరత కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.
ప్రత్యామ్నాయం తామే అంటున్న బీజేపీ
తెలంగాణలో బలం పుంజుకుంటున్న బీజేపీ రాష్ట్రంలో బీఆర్‌ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా తామే ఉన్నామని చెప్పే ప్రయత్నం చేసింది. తమ శక్తిని చాటుకోవడానికి తెలంగాణ రాష్ట్రంలో జరిగిన కొన్ని ఉప ఎన్నికలు, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కూడా దోహదం చేశాయి. ఇక బండి సంజయ్ సారధ్యంలో దూకుడుగా ముందుకు వెళుతున్న కమలం పార్టీ క్షేత్రస్థాయిలో బలం పుంజుకోవడానికి అనేక కార్యక్రమాలను చేస్తూ ప్రజల మద్దతును కూడగట్టే ప్రయత్నం చేస్తుంది. స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లు నిర్వహిస్తూ, ప్రజా సమస్యలను మాట్లాడడంతోపాటు, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ ఏ విధంగా రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేస్తుందో ప్రజలకు వివరిస్తూ, మద్దతును కూడగట్టే ప్రయత్నం చేస్తుంది.
అభ్యర్థులేరి?
ఇంతవరకు బాగానే ఉన్నా.. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో బీజేపీ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల విషయంలో పెద్దగా దృష్టి సారించిన దాఖలాలు లేవు. ఈటల రాజేందర్‌కు చేరికల కమిటీ బాధ్యత అప్పజెప్పిన అమిత్‌షా వచ్చే ఎన్నికలలో గెలుపు గుర్రాలను, బలమైన నాయకులను పార్టీలోకి తీసుకు వస్తారని భావిస్తే ఆ పని కూడా జరగడం లేదు. దీంతో బీజేపీకి బలం సరే బలగం మాటేమిటి అని రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నా చాలా నియోజకవర్గాలలో అభ్యర్థుల లేమి ఆ పార్టీలో కొట్టొచ్చినట్టు కనబడుతోంది. బీఆర్‌ఎస్ పార్టీని వ్యతిరేకించే వారు ఉన్నప్పటికీ, బీజేపీ వైపు మళ్లడానికి కావాల్సిన చరిష్మా ఉన్న నాయకులు రాష్ట్రవ్యాప్తంగా పెద్దగా కనిపించడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల బీజేపీకి ఇదే మైనస్.

క్రేజీ లీడర్లు ఏరి?
బీజేపీలో బండి సంజయ్, ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, డాక్టర్ కె.లక్ష్మణ్, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, డీకే.అరుణ వంటి కొందరు నాయకులు మినహాయించి, చాలా చోట్ల ప్రజలలో క్రేజ్ ఉన్న నాయకులు బీజేపీలో కనిపించడం లేదు. నాయకత్వ లోపాన్ని భర్తీ చేయడంపై కమలం నేతలు దృష్టిపెట్టకపోవడం ప్రస్తుతం చర్చనీయాంశం అవుతుంది. చేరికల కమిటీ యాక్టివ్‌గా పనిచేసి ఇతర పార్టీల్లోని యాక్టివ్ నాయకులను వచ్చే ఎన్నికల నాటికి బరిలోకి దిగే అభ్యర్థులుగా జనాలకు చూపించగలిగితే కొంతమేర బీజేపీ సక్సెస్ అవుతుంది. అలా కాకుండా సభలు సమావేశాలు పెట్టినా, బల ప్రదర్శన చేసినా.. బలగం లేకపోతే పని కాదన్నది విశ్లేషకుల భావన.