https://oktelugu.com/

Blue Crab Italy: పీతలను చంపడానికి రూ.26 కోట్లు కేటాయింపు.. ఎందుకంటే?

ఇటలీ వాసులు మొలస్కా జాతికి చెందిన నత్తలను బాగా తింటారు. అందుకు సంబంధించి ఆక్వా కల్చర్‌ ఇటలీలో బాగా ప్రఖ్యాతి గాంచింది. అలాంటి ఆక్వాకల్చర్‌ ఈ నీలి పీతల కారణంగా చాల నష్టాలను చవిచూస్తోంది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : August 10, 2023 / 04:12 PM IST

    Blue Crab Italy

    Follow us on

    Blue Crab Italy: ప్రతీ దేశం తన బడ్జెట్‌ ప్రకారం ఆయారంగాల అభివృద్ధికి కొంత కేటాయించడం కామన్‌. అన్ని దేశాల్లోనూ జరిగేదే. కానీ కేవలం ఒక సీఫుడ్‌ కోసం కోట్లు కేటాయించడం విన్నారా.. అది కూడా పీతలను తొలగించేందుకు దాదాపు రూ.26 కోట్లు కేటాయించడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఏంటి వింత నిర్ణయం అనిపిస్తుంది కదా.. కానీ నిజమే.. ఇటలీ ప్రభుత్వం ఈ బడ్జెట్‌ కేటాయించింది. అసలు ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందో తెలుసుకుందాం.

    నత్తలను అంతం చేస్తున్న పీతలు..
    అసలేం జరిగిందంటే.. ఇటలీలో నీలిరంగు పీతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఎంతలా అంటే ప్రఖ్యాతి గాంచిన నత్తల జాతిని అంతం చేసేలా పెరిగిపోతున్నాయి. నిజానికి ఈ నీలరంగు పీతను పశ్చిమ అట్లాంటిక్‌కు చెందినవి. తొలినాళ్లలో ఒకటో రెండు నీలి పీతలను గుర్తించారు. ఆ తర్వాత క్రమంగా వాటి సంఖ్య పెరిగిపోతోంది. వాటి కారణంగా నత్తలు మాయమవుతున్నాయి. షెల్‌ఫిష్, ఫిఫ్‌ రో వంటి ఇతర జలచరాలు చనిపోతున్నాయని గుర్తించారు.

    పీతల కారణంగా.. నష్టాల్లో ఆక్వా కల్చర్‌..
    ఇటలీ వాసులు మొలస్కా జాతికి చెందిన నత్తలను బాగా తింటారు. అందుకు సంబంధించి ఆక్వా కల్చర్‌ ఇటలీలో బాగా ప్రఖ్యాతి గాంచింది. అలాంటి ఆక్వాకల్చర్‌ ఈ నీలి పీతల కారణంగా చాల నష్టాలను చవిచూస్తోంది. ఈ నీలి పీతలు సముద్ర జాతికి చెందని కొన్ని మొక్కలు, ఇతర జలచరాలను తినేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఉత్తర ఇటలీలో ఉన్న పో రివర్‌ వ్యాలీ డెల్టాలో ఉన్న ఆక్వాఫార్మ్‌లు దారుణంగా దెబ్బతిన్నాయి. సముద్ర జీవశాస్త్రవేత్తలు ఈ నీలి పీతలు ఈ ప్రాంతంలో ఉండే నత్తలను దాదాపు 90% వరకు తినేసినట్లు పేర్కొన్నారు. దీంతో ఇటలీ ప్రభుత్వం ఆ నీలి పీతల ఉధృతికి అడ్డుకట్ట వేయాలని నిర్ణయించింది.

    ప్రత్యేకంగా నిధులు కేటాయింపు..
    ఈ మేరకు ఇటాలియన్ వ్యవసాయ మంత్రి ఫ్రాన్సిస్కో లోలోబ్రిగిడా పో నది డెల్టాను సందర్శించిన తదనంతరమే ఈ పీతల నిర్మూలన కోసం నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. పెద్ద ఎత్తున ఆ పీతలను వేటాడి అంతం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. మత్స్యకారులు వీలైనంత ఎక్కువ పీతలను పట్టి వాటిని చంపేయాలని సూచించారు. అందుకు కోసం దాదాపు రూ. 26,51,00,000 కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. వీలైనంత త్వరగా ఈ నీలి పీతల సంఖ్యను తగ్గించకపోతే పరిస్థితి తీవ్రమై పర్యావరణం దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరించారు. అంతేగాదు యుఎన్‌ ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ ప్రకారం, చైనా, దక్షిణ కొరియా తర్వాత ఇటలీనే ఎక్కువగా నత్తలను పెంచే మూడో అతిపెద్ద ఉత్పత్తిదారు. నీలి పీతలతో ఈ నత్తలు పెంపకానికి కూడా ముప్పు పొంచి ఉంది. అందుకే ఇటలీ ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్‌ కేటాయించి చర్యలు తీసుకుంటోంది.