Ponguleti Srinivasa Reddy: పోటీ ఎక్కడి నుంచి అంటే.. పొంగులేటి సంచలన ప్రకటన

పువ్వాడ అజయ్ కుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం లోని రఘునాథపాలెం మండలం ఇర్లపూడి గ్రామంలో బుధవారం రాత్రి ఆ గ్రామ సర్పంచ్ దేవ్ సింగ్ ఆధ్వర్యంలో ఆదివాసి దినోత్సవం నిర్వహించారు.

Written By: Bhaskar, Updated On : August 10, 2023 4:24 pm

Ponguleti Srinivasa Reddy

Follow us on

Ponguleti Srinivasa Reddy: భారత రాష్ట్ర సమితి నుంచి బయటికి వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. రాజకీయంగా తన అడుగులను మరింత వేగంగా వేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో మాత్రమే కాకుండా పొరుగున ఉన్న మహబూబాబాద్, సూర్యాపేట, నల్లగొండ జిల్లాలోనూ తన అభ్యర్థులకు టికెట్లు ఇప్పించుకునే పనిలో పడ్డారు. ఇక తన సొంత జిల్లాలో గతంలో తాను ప్రకటించిన అభ్యర్థులతో విస్తృతంగా పర్యటనలు చేస్తున్నారు. అయితే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మొన్నటిదాకా తాను ఎక్కడి నుంచి పోటీ చేస్తాననేదానిపైన ఒక క్లారిటీ ఇవ్వలేదు. ఒక దశలో పొంగులేటి కొత్తగూడెం నుంచి పోటీ చేస్తారని ఆయన అనుచరులు ఒక అంచనా వేశారు. దాదాపు పొంగులేటి కూడా అదే విధంగా సంకేతాలు ఇచ్చారు. ఎందుకంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కేవలం ఖమ్మం, పాలేరు, కొత్తగూడెం మాత్రమే జనరల్ నియోజకవర్గాలు. అయితే పాలేరులో షర్మిల పోటీ చేస్తారు అనే ఊహాగానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. పొంగులేటి కూడా కొత్తగూడెం నుంచి పోటీ చేస్తారు అని కార్యకర్తలు దాదాపుగా ఫిక్స్ అయిపోయారు. కానీ, పొంగులేటి తాను ఎక్కడ నుంచి పోటీ చేస్తాను కార్యకర్తలకు ఒక క్లారిటీ ఇచ్చారు.

పొంగులేటి బిఆర్ఎస్ లో రాకమందు వైఎస్ఆర్సిపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండేవారు. ఆయన కంటే ముందు పువ్వాడ అజయ్ కుమార్ వైఎస్ఆర్సిపి లో ఉండేవారు. తర్వాత పొంగులేటి వచ్చిన అనంతరం పువ్వాడ అజయ్ కుమార్ ప్రాధాన్యం తగ్గిపోయి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య కోల్డ్ వార్ ఉంది. 2014లో ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పువ్వాడ అజయ్ కుమార్ గెలుపొందారు. అదే ఎన్నికల్లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఖమ్మం పార్లమెంట్ సభ్యుడిగా విజయం సాధించారు. తదనంతరం రాజకీయ పరిణామాలు నేపథ్యంలో వారిద్దరు భారత రాష్ట్ర సమితిలో చేరినప్పటికీ.. ఇద్దరి మధ్య సఖ్యత ఉండేది కాదు. తర్వాత భారత రాష్ట్ర సమితిలో ఉక్కపోత భరించలేక పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు.. ఈ సందర్భంగా అటు పువ్వాడ ఇటు పొంగులేటి మధ్య ఆరోపణల పర్వం సాగుతూనే ఉంది. అయితే బుధవారం నిర్వహించిన ఆదివాసి దినోత్సవం లో పొంగులేటి చాలా హాట్ కామెంట్స్ చేశారు.

పువ్వాడ అజయ్ కుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం లోని రఘునాథపాలెం మండలం ఇర్లపూడి గ్రామంలో బుధవారం రాత్రి ఆ గ్రామ సర్పంచ్ దేవ్ సింగ్ ఆధ్వర్యంలో ఆదివాసి దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. ఇక్కడ జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. లంబాడా లతో కలిసి నృత్యాలు చేశారు. వారి సాంప్రదాయ వంటకాలను ఆరగించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ భారత రాష్ట్ర సమితిని పడగొట్టి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడం లక్ష్యంగా తమ పని చేస్తామని ప్రకటించారు. గిరిజనులకు ఇచ్చిన హామీలను కెసిఆర్ అమలు చేయలేదని ధ్వజమెత్తారు. రెండు పడక గదుల ఇళ్ళ నిర్మాణంపై కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని భరోసా ఇచ్చారు. ఖమ్మం జిల్లా ప్రజల కోరికపై తాను ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. ఖమ్మం జిల్లా ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్న మంత్రిని ఇంటికి పంపిస్తానని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో ఒక్కసారిగా ఉమ్మడి జిల్లా రాజకీయాలు వేడెక్కాయి. ఈ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి లేదా పోట్ల నాగేశ్వరరావు పోటీ చేస్తారని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా ఆయన ఖమ్మం నుంచి పోటీ చేస్తానని ప్రకటించడం ఒకింత ఆసక్తికరంగా మారింది.