
Mayank Agarwal: హైదరాబాద్ జట్టు పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. చెన్నై జట్టుతో శుక్రవారం జరిగిన పోరులో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆటగాళ్ల ప్రదర్శన అద్వానంగా ఉందనే చెప్పాలి. బ్యాటింగ్ పరమ చెత్తగా తయారైంది. టి20 ఆడుతున్నారో లేక.. టెస్ట్ క్రికెట్ ఆడుతున్నారు అర్థం కాని విధంగా ఆటగాళ్లు బ్యాటింగ్ చేయడం గమనార్హం. జిడ్డు బ్యాటింగ్ తో నామమాత్రపు స్కోరు కూడా చేయలేక హైదరాబాద్ జట్టు ప్లేయర్లు చతికిలపడ్డారు.
ఐపీఎల్ లో ఈ సీజన్ ను హైదరాబాద్ జట్టు రెండు వరుస పరాజయాలతో ఆరంభించింది. దీంతో ఈ జట్టు ప్రదర్శనలో ఏమాత్రం మార్పు రాలేదంటూ అభిమానులు అసహనం వ్యక్తం చేశారు. అంతలోనే తేరుకుని వరుస రెండు విజయాలను నమోదు చేసుకుంది. దీంతో హైదరాబాద్ జట్టు గాడిని పడిందని అభిమానులు భావించారు. ముఖ్యంగా కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన బ్రూక్ సెంచరీ చేసి కదం తొక్కడంతో జట్టు ఆటగాళ్లంతా ఫామ్ లోకి వచ్చారని అభిమానులు భావించారు. అయితే అభిమానుల ఆనందం కొద్దిరోజులు కూడా నిలవకుండా చేశారు హైదరాబాద్ జట్టు ఆటగాళ్లు. రెండు వరుస విజయాలు నమోదు చేసుకున్న తరువాత ఆడిన రెండు మ్యాచ్ ల్లోనూ ఓటమిపాలైంది హైదరాబాద్ జట్టు. దీంతో ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్ ల్లో నాలుగు ఓటములు, రెండు విజయాలతో పాయింట్లు పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది సన్ రైజర్స్ జట్టు.
పరమ చెత్త బ్యాటింగ్ తో..
హైదరాబాద్ జట్టు ఆటగాళ్లు చెన్నైతో జరిగిన మ్యాచ్ లో పేలవ ప్రదర్శనతో అభిమానులను తీవ్రంగా నిరాశపరిచారు. బ్యాటింగ్ మరీ చెత్తగా తయారైంది. టి20 క్రికెట్ ఆడుతున్నారో.. టెస్ట్ క్రికెట్ ఆడుతున్నారో అసలు ఫ్యాన్స్ కు అర్థం కాని రీతిలో బ్యాటింగ్ చేశారు బ్యాటర్లు. ఈ సీజన్లో మయాంక్ అగర్వాల్ దారుణ ఆట తీరు కొనసాగుతూనే ఉంది. తాజాగా శుక్రవారం జరిగిన మ్యాచ్ లో మాయాంక్ అగర్వాల్ ఓపెనర్ గా కాకుండా ఐదో స్థానంలో వచ్చాడు. ఏ స్థానంలో వచ్చిన తన ఆట తీరు మారదని మరోసారి నిరూపించాడు. నాలుగు బంతులు ఎదుర్కొని కేవలం రెండు పరుగులు మాత్రమే చేసి జడేజా బౌలింగ్ లో స్టంప్ అవుట్ గా వెనుదిరిగాడు. అసలు వికెట్ టు వికెట్ బౌలింగ్ చేసే జడేజా బౌలింగ్ లో ఫ్రంట్ ఫుట్ రావడమే తప్పు.. అలాంటిది ధోని కీపర్ గా ఉన్నప్పుడు అలా చేయడం ఇంకా పెద్ద తప్పు. క్షణం కూడా ఆలస్యం చేయని ధోని వికెట్లను ఎగరగొట్టేశాడు. దీంతో అవుట్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓపెనర్ గా ఫెయిల్ అయ్యాడని.. ఫినిషర్ రోల్ లో పంపిస్తే దానికి న్యాయం చేయలేకపోయాడు మాయాంక్ అగర్వాల్. హైదరాబాద్ జట్టు యాజమాన్యం మయాంక్ అగర్వాల్ ను రూ. 8.25 కోట్లు వెచ్చించి తీసుకున్నప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. ఇప్పటి వరకు మాయాంక్ 6 మ్యాచ్ లు ఆడి 115 పరుగులు మాత్రమే చేశాడు. ముంబై తో మ్యాచ్ లో 48 పరుగులు చేసినప్పటికీ చాలా బంతులు వృధా చేశాడు. టెస్ట్ ప్లేయర్ ను టి20 ల్లో ఆడిస్తే ఇలాగే ఉంటుందంటూ సన్ రైజర్స్ జట్టు అభిమానులు సెటైర్లు వేస్తున్నారు.
కెప్టెన్ గాను ఫెయిల్ అయిన మయాంక్ అగర్వాల్..
మయాంక్ అగర్వాల్ ఐపిఎల్ – 2022 లో పంజాబ్ కింగ్స్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించాడు. ఆ సీజన్ లో 12 ఇన్నింగ్స్ ల్లో కలిపి కేవలం 196 పరుగులు మాత్రమే చేశాడు మయాంక్ అగర్వాల్. సారథిగాను పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు మాయాంక్ అగర్వాల్. ఆ ఏడాది 14 మ్యాచుల్లో కేవలం ఏడు విజయాలు మాత్రమే పంజాబ్ జట్టుకు అందించి పెట్టాడు. పాయింట్ల పట్టికలో పంజాబ్ జట్టు ఆ సీజన్ లో ఆరో స్థానంలో నిలిచింది.

ఎన్నో ఆశలు పెట్టుకున్న హైదరాబాద్ జట్టు యాజమాన్యం..
మయాంక్ అగర్వాల్ పై హైదరాబాద్ జట్టు ఎన్నో ఆశలు పెట్టుకుంది. జట్టుకు బలమైన యంగ్ ఓపెనర్ ను తీసుకువచ్చామని జట్టు యాజమాన్యం భావించింది. డాషింగ్ ఓపెనింగ్ తో మంచి భాగస్వామ్యాలు అందిస్తాడని ఆశలు పెట్టుకున్నా మయాంక్.. ఆ స్థాయిలో ప్రదర్శన చేయలేక చతికిల పడుతుండడంతో ఏం చేయాలో తెలియక హైదరాబాద్ జట్టు యాజమాన్యం తలలు పట్టుకుంటోంది. కోట్లాది రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన మాయాంక్ అగర్వాల్, బ్రూక్.. విఫలమవుతుండడం ఆ జట్టును కలవరానికి గురి చేస్తోంది. ఈ ఇద్దరి ఆటగాళ్లలో సామర్థ్యానికి కొదవ లేదు. తమదైన రోజున ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించగల సత్తా ఉన్నవాళ్లే. అయితే, సరైన సమయంలో ఆడక పోవడంతో జట్టుకు ఇబ్బందులు తప్పడం లేదు.