
Nagababu: జనసేన ఎన్నికల కధనరంగానికి సిద్ధమవుతోంది. అస్త్రశస్త్రాలను సిద్ధం చేస్తోంది. రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సమరశంఖం పూరిస్తోంది. మరికొద్దిరోజుల్లో పవన్ వారాహి యాత్ర ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి షెడ్యూల్ రూపకల్పనలో నాయకత్వం అన్నిరకాలుగా కసరత్తు చేస్తోంది. ఇంతలో గ్రామస్థాయి నుంచి నెలకొన్న సమస్యలపై జనసేన ప్రత్యేక కాన్సంట్రేట్ చేస్తోంది. స్థానికంగా నెలకొన్న సమస్యలపై గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయి నేతల నుంచి నివేదికలు తెప్పించుకునే పనిలో పడింది. గ్రౌండ్ లెవల్ లో ఉన్న సమస్యలను తెలుసుకొని వాటికి పరిష్కార మార్గం చూపాలన్నది జనసేన లక్ష్యం. అయితే ఈ బాధ్యతను సమన్వయం చేసే బాధ్యతను జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు తీసుకోవడం విశేషం.
ఇటీవలే పదవి..
గత ఎన్నికల ముందు నుంచి నాగబాబు పార్టీలో యాక్టివయ్యారు. ఎంపీగా పోటీచేసి ఓటమి చవిచూశారు. దీంతో కొద్దిరోజుల పాటు యాక్టివ్ పాలిటిక్స్ కు దూరమయ్యారు. ఇటీవల తిరిగి క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. పవన్ కు అండగా నిలుస్తూ వస్తున్నారు. సమకాలిన రాజకీయ అంశాలపై స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ నాగబాబుకు పార్టీలో కీలక పదవి అప్పగించారు. ఆయన్ను జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎంపికచేశారు. అలాగే జనసేన అధికార ప్రతినిధిగా వేములపాటి అజయ్‌కుమార్ నియమితులయ్యారు. జాతీయ మీడియా కోఆర్డినేషన్ బాధ్యతల్ని అజయ్‌కి అప్పగించారు. అయితే సుదీర్ఘ కాలం తర్వాత నాగ బాబుకు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవీ బాధ్యతలు అప్పగించడం ఏంటబ్బా అని అంతా అనుకున్నారు. దీని వెనుక పవన్ ఎన్నోరకాల బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తోంది.
కోఆర్డినేషన్ బాధ్యతలు
జనసేనకు లక్షలాది మంది అభిమానులు, కార్యకర్తలు ఉన్నా వారిని సమన్వయం చేసుకోకపోవడం పెద్దలోటే. దానిని భర్తీ చేసేందుకే పవన్ నాగబాబుకు కీలక బాధ్యతలు అప్పగించారు. అందుకే ఇప్పుడు నాగబాబు రంగంలోకి దిగారు. జిల్లాల వారీగా పార్టీ శ్రేణులతో సమావేశం కావాలని డిసైడ్ అయ్యారు. గ్రామం, మండలం, నియోజకవర్గ స్థాయిలో సమస్యలు గుర్తించాలని నిర్ణయించారు. ఈ మేరకు పర్చువల్ విధానంలో వరుసగా సమావేశాలు కానున్నట్టు చెబుతున్నారు., ఇదే విషయంపై పార్టీ కేంద్ర కమిటీ కార్యాలయం నుంచి ప్రకటన విడుదలైంది. జనసైనికులు స్థానికంగా తమకు ఎదురయ్యే సమస్యలను నాయకత్వానికి విన్నవించాలని ప్రకటన సారాంశం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నాయకులు, శ్రేణులతో నాగబాబు పర్చువల్ విధానంలో సమావేశమవుతారని పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ ప్రకటనలో పేర్కొన్నారు.

పార్టీలో జోష్..
వచ్చే ఎన్నికల్లో పోటీచేయను అంటూ నాగబాబు ఇప్పటికే ప్రకటించారు. పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషిచేస్తానని చెప్పుకొచ్చారు. అందుకు తగ్గట్టే పార్టీలో ప్రధాన కార్యదర్శి పోస్టు దక్కడంతో పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం పవన్ సినిమాల్లో బిజీగా ఉన్నారు. వీలైనంత త్వరగా వాటిని పూర్తిచేసి ఎన్నికల ప్రచారంలో దిగనున్నారు. అందుకు తగ్గట్టుగానే ప్లాన్ చేసుకున్నారు. ఇటువంటి తరుణంలో పార్టీ శ్రేణుల సమన్వయంతో పాటు పార్టీలో చేరికలు,అనుబంధ విభాగాల బలోపేతంపై నాగబాబు ప్రత్యేకంగా దృష్టిపెట్టినట్టు సమాచారం. నాగబాబు జనసేనలో యాక్టివ్ అవుతుండడంపై పార్టీ శ్రేణుల్లో జోష్ నెలకొంది.