
Vignesh Shivan- Nayanthara Love Story: విగ్నేష్ శివన్-నయనతార దాదాపు ఏడేళ్లు ప్రేమించుకున్నారు. గతంలో నయనతార శింబు, ప్రభుదేవాలను ప్రేమించారు. తర్వాత వారితో విడిపోయారు. ఈ క్రమంలో విగ్నేష్ శివన్ ని అయినా పెళ్లి చేసుకుంటుందా? అనే సందేహాలు కలిగాయి. బహిర్గతంగా డేటింగ్ చేస్తున్న ఈ జంటను పెళ్లి ఎప్పుడని అడిగితే… దానికి టైం ఉంది. డేటింగ్ బోర్ కొట్టాక వివాహం చేసుకుంటామని సమాధానం చెప్పేవారు. ఎట్టకేలకు గత ఏడాది పెళ్లి పీటలు ఎక్కారు. మహాబలిపురంలో నయనతార-విగ్నేష్ వివాహం జరిగింది.
తాజా ఇంటర్వ్యూలో విగ్నేష్ శివన్ తమ లవ్ స్టోరీ గురించి ఓపెన్ అయ్యారు. అది ఎలా మొదలైందో వెల్లడించారు. ‘నా మొదటి సినిమా పోడా పొడీ మంచి విజయం సాధించింది. తర్వాత నానుమ్ రౌడీదాన్ కథ రాసుకున్నాను. ఆ కథను ధనుష్ కి వినిపించాను. కథ నచ్చడంతో తాను నిర్మించడానికి ముందుకు వచ్చారు. నయనతారకు చెప్పు ఆమెతో చేద్దాం అన్నారు. ఆమె ఒప్పుకోరేమో నజ్రియాతో చేద్దామని నేను అన్నాను.
లేదు నయనతారకు ఈ కథ చెప్పమని ధనుష్ అన్నారు. అలా మొదటిసారి నయనతారను నేను కలిశాను. ఆమె చాలా బాగా ట్రీట్ చేశారు. ఆ రోజే ఆమెతో నేను ప్రేమలో పడిపోయాను. నానుమ్ రౌడీదాన్ చిత్ర సెకండ్ షెడ్యూల్ కే మేము దగ్గరయ్యాం. డేటింగ్ మొదలుపెట్టాము. కానీ ఈ విషయం ఎవరికీ తెలియదు. సెట్స్ లో నేను మేడం అని పిలిచేవాడిని. డేటింగ్ చేస్తున్నప్పటికీ నయనతార కారవాన్ కి కూడా నేను వెళ్ళలేదు. వృత్తిపరంగా ఇద్దరం చాలా ప్రొఫెషనల్ గా ఉండేవాళ్ళం. మేము చెప్పే వరకు ఈ విషయం ఎవరికీ తెలియదు…’ అని విగ్నేష్ అన్నారు.

కాగా పెళ్ళైన నెలల వ్యవధిలో నయనతార దంపతులు సరోగసీ పద్దతిలో పేరెంట్స్ అయ్యారు. ఇద్దరు కవల అబ్బాయిలను పొందారు. ఇది వివాదాస్పదమైంది. సరోగసీ చట్టాన్ని నయనతార దంపతులు అతిక్రమించారనే ఆరోపణలపై విచారణ ఎదుర్కొన్నారు. అయితే ఐదేళ్ల క్రితమే మాకు పెళ్లయింది. సరోగసి మదర్ కూడా మా బంధువే. మేము ఏ విధంగానూ చట్టాన్ని అతిక్రమించలేదని నయనతార దంపతులు అధరాలు సమర్పించారు. దాంతో ఆ వివాదం ముగిసింది.