
Viveka Murder Case: సంక్షిష్టంగా మారిన వివేకా హత్య కేసు దర్యాప్తు రోజుకో మలుపు తిరుగుతుంది. నాలుగేళ్లుగా విచారణ జరుగుతున్న ఈ వ్యవహారంలో ప్రతీసారి క్లైమాక్స్ కు వచ్చిందనేలోపు మరో అంశం బయటకు వస్తుంది. దానిపై విచారణ చేసి ఆధారాలు సేకరించి చార్జిషీటులో పొందుపరిచేందుకు సమయం పడుతుంది. తాజాగా మరో కోణం వెలుగులోకి వచ్చింది. ఎంపీ అవినాష్ రెడ్డి ప్రధాన అనుచరుడిని అరెస్టు చేసిన సీబీఐ కోర్టులో హాజరు పరిచింది.
అవినాష్ హత్య జరిగిన తరువాత ఎన్నో అనుమానాలు? మరెన్నో ప్రశ్నలు ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయి. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, సరిగ్గా 2019 ఎన్నికలకు ముందు జరిగిన ఈ హత్యోదంతం సంచలనం సృష్టించింది. యథాలాపంగా దీనిని ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుపై నెట్టే ప్రయత్నం జరిగింది. అందుకు తన సొంత మీడియాను బాగా వాడుకున్నారని టీడీపీ ఇప్పటికీ ఆరోపిస్తుంది. అయితే, ఆ సానుభూతిని జగన్ బాగానే వాడుకున్నారు. సీన్ కట్ చేస్తే ఆరోపణలన్నీ జగన్ అండ్ కో టీం వైపు వస్తుండటం విస్మయానికి గురిచేసింది.
నిజానిజాలను తేల్చేందుకు కేసు సీబీఐకి ప్రభుత్వం అప్పగించింది. ఆ తరువాత కేసును ఏపీ పోలీసులు ముందుకు సాగనివ్వడం లేదని స్వయానా వివేకా కూతురు అభ్యర్థన మేరకు తెలంగాణాకు బదిలీ చేశారు. కాగా, అవినాష్ రెడ్డి ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. కడప ఎంపీ సీటు కోసమే ఆయన ఈ పని చేశాడా? లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా? అనేది ఇంకా తేలలేదు. వివేకా హత్య జరిగినప్పుడు శివశంకర్ రెడ్డి అవినాష్ రెడ్డి ఇంట్లోనే ఉన్నారని సీబీఐ తేల్చింది.

కేసు విచారణను ఇంకెన్ని రోజులు కావాని కోర్టు ఆంక్షితలు వేసిన అనంతరం ఓ కొలిక్కి తీసుకువచ్చేందుకు సీబీఐ ప్రయత్నాలు చేస్తుంది. అవినాష్ రెడ్డి ప్రధాన అనుచరుడు ఉదయ్ ను కూడా అదుపులోకి తీసుకొని విచారించింది. ఆధారాలు చెరిపేయడంలో ఈయన ప్రధాన పాత్ర పోషించాడనేది సీబీఐ అభియోగం. హత్య జరిగిన రోజు ఉదయం 4 గంటల సమయంలో బయటకు వెళ్లిన ఉదయ్, ఆ రోజంతా అవినాష్ రెడ్డి ఇంట్లోనే ఉన్నాడని సీబీఐ పేర్కొంది. కాగా, ఇప్పటికే జగన్ మూడుసార్లు ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. అవినాష్ రెడ్డిని కాపాడేందుకు జగన్ శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. అయితే, అసలు వివేకా హత్య ఎందుకు జరిగిందనే విషయాన్ని మాత్రం సీబీఐ ఇంకా వెల్లడించలేదు. ఈ నెలాఖరులోపు ఒక స్పష్టత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.