India vs New Zealand Records: టి20 అంటే వేగానికి కొలమానం.. ఈ జట్టైనా కూడా భారీ స్కోర్ సాధించాలని అనుకుంటుంది.. బౌలర్ ఎవరైనా కానీ బాదడమే లక్ష్యంగా పెట్టుకుంటుంది.. అహ్మదాబాదులో బుధవారం జరిగిన మూడో టి20 మ్యాచ్ లో కూడా భారత్ ఇదే సూత్రాన్ని అనుసరించింది..గిల్ తుఫాన్ ఇన్నింగ్స్ కు రాహుల్, హార్దిక్ పాండ్యా, సూర్య కుమార్ యాదవ్ తోడు కావడంతో 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 234 పరుగులు చేసింది.. ఓపెనర్ గిల్ వీర విహారం చేశాడు.. 63 బంతుల్లో 12 ఫోర్లు, ఏడు సిక్సర్ల సహాయంతో 126 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు..ఇదే గిల్ వన్డే సిరీస్ లో భాగంగా హైదరాబాద్లో జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్ జట్టుపై డబుల్ సెంచరీ సాధించాడు.. మొదటి రెండు టి20లో విఫలమయ్యాడు.. కానీ మూడో టి20 లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.. 126 పరుగులను మంచినీళ్లు తాగినంత ఈజీగా చేశాడు.

లక్నోలో జరిగిన రెండవ టి20 మ్యాచ్లో 99 పరుగుల లక్ష్యాన్ని భారత జట్టుకు నిర్దేశించిన న్యూజిలాండ్… దాన్ని కాపాడుకోవడంలో ఎక్కడా లేని పోరాట పటిమ ప్రదర్శించింది.. భారత బ్యాట్స్మెన్ వెన్నులో వణుకు పుట్టించింది.. కానీ అహ్మదాబాద్ మ్యాచ్లో మాత్రం చేతులు ఎత్తేసింది.. ఇక ఆ జట్టు బౌలింగ్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.. చివరి 7 ఓవర్లలో భారత బ్యాట్స్మెన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోవడంతో స్కోరు రాకెట్ లాగా దూసుకెళ్లింది.. ఇక్కడ న్యూజిలాండ్ బౌలర్లు కాస్త ప్రతిఘటిస్తే మ్యాచ్ ఫలితం మరో విధంగా ఉండేది. న్యూజిలాండ్ కెప్టెన్ ఏడుగురు బౌలర్లను మార్చి మార్చి బౌలింగ్ చేయించినప్పటికీ ఫలితం లేకపోవడం విశేషం.
సాధారణంగా చేజింగ్ కు దిగేటప్పుడు న్యూజిలాండ్ ప్రణాళిక పకడ్బందీగా ఉంటుంది.. మొదటి నాలుగు వికెట్లు పోయినప్పటికీ మిడిల్ ఆర్డర్ రాణిస్తుంది.. భారత పర్యటనలో న్యూజిలాండ్ దీన్ని నిరూపించింది.. కానీ మొదటి రెండు మ్యాచ్ల్లో ప్రొఫెషనలిజం ప్రదర్శించిన న్యూజిలాండ్ జట్టు… చివరి మ్యాచ్లో తేలిపోయింది.. డారిల్ మినహా ఎవరు కూడా ఆశించిన మేర ప్రదర్శన చేయలేకపోయారు.. వచ్చిన బ్యాట్స్మెన్ వచ్చినట్టే పెవిలియన్ వెళ్లారు.. మొదటి పవర్ ప్లే లో 30 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది అంటే న్యూజిలాండ్ ఆట ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.. ఇక భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా, మాలిక్, మావి, అర్ష్ దీప్ సింగ్ ప్రతిభ చూపారు.. ఖచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్ తో బంతులు వేశారు. న్యూజిలాండ్ బౌలర్లు ఇబ్బంది పడ్డచోట… తాము మాత్రం నిప్పులు చెరిగేలా బంతులు వేసి ప్రత్యర్థి జట్టును 12.1 ఓవర్లలో 66 పరుగులకే కుప్పకూలిచారు.. మొత్తానికి అతిపెద్ద విజయాన్ని అందుకున్నారు.. 2018లో ఐర్లాండ్ జట్టుపై భారత్ 214 పరుగులు చేసింది.. తర్వాత ఐర్లాండ్ జట్టు 70 పరుగులకే ఆల్ అవుట్ అయింది.. ఫలితంగా భారత్ 143 పరుగుల భారీ విజయాన్ని అందుకుంది.. కానీ న్యూజిలాండ్ పై 168 పరుగుల తేడాతో విజయం సాధించడంతో… ఐర్లాండ్ పై ఇండియాకు ఉన్న రికార్డు బ్రేక్ అయింది.

గత ఏడాది బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ విజయం ద్వారా ఘనమైన ముగింపు ఇచ్చిన ఇండియా… ఏడాది శ్రీలంక, న్యూజిలాండ్ పై వన్డే సిరీస్ లను వైట్ వాష్ చేసింది. న్యూజిలాండ్ జట్టుతో జరిగిన మూడు t20 మ్యాచ్ ల సీరీస్ ను 2_1 తేడాతో గెలుచుకుంది.. ప్రస్తుతం ఇండియా అటు వన్డేలు, ఇటు టి20ల్లో నెంబర్ వన్ ర్యాంకులో కొనసాగుతోంది.