Director Sagar Passed Away: తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదాలు కొనసాగుతున్నాయి. ఏడాది ప్రారంభంలోనే లెజెండరీ యాక్ట్రెస్ జమున అనారోగ్యంతో కన్నుమూశారు. టాలీవుడ్ తొలితరం స్టార్ హీరోయిన్స్ లో ఒకరిగా ఆమె వెలిగారు. ఆమె మృతిని మరవక ముందే మరో ప్రముఖుడు మరణించారు. సీనియర్ డైరెక్టర్ సాగర్ నేడు ఉదయం చెన్నైలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. 70 ఏళ్ల సాగర్ కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్చారు.

పరిస్థితి విషమించడంతో ఫిబ్రవరి 2 ఉదయం 6 గంటల ప్రాంతంలో ఆయన మరణించారు. సాగర్ మరణాన్ని కుటుంబ సభ్యులు ధృవీకరించారు. మీడియాకు సమాచారం అందించారు. సాగర్ మృతి వార్త తెలిసిన చిత్ర ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈయనది మంగళగిరి సమీపంలో గల నిడమర్రు గ్రామ. అసలు పేరు విద్యాసాగర్ రెడ్డి. పరిశ్రమలో సాగర్ గా చలామణి అయ్యారు.
రాకాసి లోయ మూవీతో సాగర్ దర్శకుడయ్యారు. ఈ చిత్రంలో విజయశాంతి, భానుచందర్ లీడ్ రోల్స్ చేశారు. సుమన్ హీరోగా రామ సక్కనోడు చిత్రం తెరకెక్కించారు. ఈ చిత్రానికి మూడు నంది అవార్డులు రావడం విశేషం. సూపర్ స్టార్ కృష్ణ హీరోగా అమ్మదొంగ చిత్రం తెరకెక్కించారు. అమ్మదొంగ మ్యూజికల్ హిట్ గా నిలిచింది. సాగర్ చివరి చిత్రం ఖైదీ బ్రదర్స్. ఈ చిత్రం 2002లో విడుదలైంది. చెన్నైలోనే ఉంటూ ఆయన టాలీవుడ్ కి దూరమయ్యారు.

స్టార్ డైరెక్టర్ గా వెలుగొందిన శ్రీను వైట్ల ఈయన శిష్యుడే. అలాగే మాస్ డైరెక్టర్ వివి వినాయక్ సైతం సాగర్ వద్ద పనిచేశారు. ఆయన శిష్యులుగా పనిచేసిన పలువురు పరిశ్రమలో స్థిరపడ్డారు. తెలుగు సినిమా డైరెక్టర్స్ అసోసియేషన్ కి మూడు సార్లు అధ్యక్షుడిగా వ్యవహరించారు. సాగర్ మృతితో పరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి. పలువురు సోషల్ మీడియా వేదికగా ఆయన మృతికి సంతాపం ప్రకటిస్తున్నారు.